- పదేండ్లలో 158 శాతం పెరిగిన వరి సాగు విస్తీర్ణం
- 9.11 లక్షల ఎకరాల నుంచి 4.48 లక్షల ఎకరాలకు పడిపోయిన పండ్ల తోటలు
- కూరగాయల సాగు 5.52 లక్షల ఎకరాల నుంచి 1.02 లక్షల ఎకరాలకు..
- వివిధ పంటలకు ప్రసిద్ధి చెందిన జిల్లాల్లో తారుమారైన పరిస్థితులు
- పంట మార్పిడి విధానం పాటించాలని సర్కారుకు రైతు కమిషన్ నివేదిక
హైదరాబాద్/నెట్‌వర్క్, వెలుగు: గతంలో పండ్లు, పూల తోటలు, మక్క, జొన్న, పప్పుధాన్యాలు, నూనె గింజల పంటలను విస్తృతంగా సాగు చేసిన తెలంగాణ రైతులు.. క్రమంగా వాటిని తగ్గిస్తూ వరి, పత్తి సాగువైపు మళ్లుతున్నారు. కోతుల బెడద, కూలీల కొరత, ఆయా పంటలకు మార్కెట్ సౌకర్యం, ప్రభుత్వాల నుంచి సరైన ప్రోత్సాహం లేకపోవడం లాంటి కారణాలతో ఆరుతడి పంటలను పూర్తిగా అటకెక్కించారు.
అదే సమయంలో నీటి లభ్యత పెరగడం, సర్కారు మద్దతు ధరకు వడ్లు కొంటుండడంతో వరి సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా పదేండ్ల కింద యేటా 49.28 లక్షల ఎకరాల్లో సాగైన వరి.. ప్రస్తుతం 1.27 కోట్ల ఎకరాలకు చేరుకుంది. అంటే వరిసాగు విస్తీర్ణం 158 శాతం పెరిగింది.
అదే సమయంలో పదేండ్ల కింద 9 లక్షల ఎకరాల్లో సాగైన పండ్ల తోటలు ప్రస్తుతం 4.48 లక్షల ఎకరాలకు పడిపోయాయి. ఒకప్పుడు ద్రాక్ష, పూలతోటలకు ప్రసిద్ధి చెందిన హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఇప్పుడు మచ్చుకు కూడా ఆ పంటలు కనిపించడం లేదు.
ఇక బత్తాయి, నిమ్మ తోటలకు కేరాఫ్‌గా ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో గడిచిన ఐదేండ్లుగా రైతులంతా తోటలను నరికేస్తూ వరి సాగు చేస్తున్నారు. ఫలితంగా ఇక్కడ గతంలో మూడు లక్షల ఎకరాల్లో సాగయ్యే బత్తాయి ప్రస్తుతం 40 వేల ఎకరాలకు పడిపోయింది.
కూరగాయల సాగు సైతం 5.52 లక్షల ఎకరాల నుంచి 1.02 లక్షల ఎకరాలకు పడిపోయింది. ఫలితంగా రాష్ట్రంలో ఓవైపు లక్షల పుట్లు పండుతున్న వడ్లను ఏం చేసుకోవాలో తెలియక ప్రభుత్వం తలపట్టుకుంటుంటే, మరోవైపు పండ్లు, కూరగాయలు, పప్పులు, నూనెగింజలను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ఫలితంగా ట్రాన్స్పోర్ట్ భారంతో నిత్యవసరాల రేట్లు పెరిగి సామాన్యులు కుదేలవుతున్నారు.
నల్గొండ జిల్లాలో బత్తాయి తోటలు కనుమరుగు..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2010 వరకు ప్రధాన పంటగా ఉన్న బత్తాయి, నిమ్మ తోటలను రైతులు నరికేస్తున్నారు. వీటికి స్థానికంగా మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడం, ఒక వేళ పంటను హైదరాబాద్‌కు తీసుకెళ్లినా దళారులు అడ్డికి పావుశేరు పెడ్తుండడం, బత్తాయిని ప్రాసెసింగ్ చేసి ఉత్పత్తులు విక్రయించే టెక్నాలజీ లేకపోవడం వంటి కారణాలతో బత్తాయి, నిమ్మ తోటలను తొలగించి వరి పొలాలుగా మారుస్తున్నారు.
2010 వరకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో అత్యధికంగా 3.1 లక్షల ఎకరాల్లో బత్తాయి తోటలు ఉండగా, ప్రస్తుతం అది 45 వేల ఎకరాలకు పరిమితమైంది. గతంలో 30 వేల ఎకరాల్లో ఉన్న నిమ్మ తోటలు ప్రస్తుతం 11 వేల ఎకరాలకే పరిమితమయ్యాయి. గతంలో రోజుకు 20 వేల బస్తాలతో కళకళలాడిన నకిరేకల్ మార్కెట్‌కు ఇప్పుడు 3 వేల బస్తాలు కూడా రావడం లేదని అక్కడి వ్యాపారులు వాపోతున్నారు.
హైదరాబాద్ శివార్లలో పూలు, ద్రాక్ష తోటలు గాయబ్..
హైదరాబాద్ శివార్లలోని చేవెళ్ల, మొయినాబాద్, షాద్‌నగర్, శంకర్‌పల్లి, మహేశ్వరం, శంషాబాద్, కందుకూరు, కొత్తూరు, కేశంపేట తదితర మండలాల్లో ఒకప్పుడు గులాబీ, బంతి, చామంతి, జర్బరతో పాటు డెకరేషన్‌కు వినియోగించే పూల రకాలను, అస్పరస్ గడ్డిని సాగు చేసేవారు. నీటి వనరులు, మార్కెటింగ్ సౌకర్యం బాగానే ఉండడంతో పూలతోటల విస్తీర్ణం ఓ దశలో 20 వేల ఎకరాలకు చేరింది.
కానీ వివిధ రకాల కారణాలతో ఎనిమిదేండ్ల కింద 11 వేల ఎకరాలకు పడిపోగా ప్రస్తుతం అందులో సగం కూడా సాగవడం లేదు. అలాగే గ్రేటర్హైదరాబాద్ శివార్లలో గజ్వేల్, ములుగు, వర్గల్, తూప్రాన్‌తో పాటు కీసర, మేడ్చల్, ఘట్‌కేసర్, శామీర్‌పేట్, కందుకూరు, మహేశ్వరం, శంషాబాద్, ఫరూక్‌నగర్ లాంటి మండలాల్లోని సుమారు ఐదు వేలకు పైగా ఎకరాల్లో ద్రాక్ష తోటలు ఉండేవి. కానీ ప్రస్తుతం 200 ఎకరాలకే పరిమితం అయ్యాయి.
నిజామాబాద్ జిల్లాలో సోయాబీన్ బంద్..
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 2005కు ముందు వరకు నాలుగు లక్షల ఎకరాల్లో సోయాబీన్ సాగయ్యేది. కేవలం వర్షాలపై ఆధారపడి పంటను వేసేవారు. ఈ దిగుబడులను మార్క్‌ఫెడ్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేసేది. పంట విస్తీర్ణం గరిష్ట స్థాయికి తీసుకెళ్లేందుకు సర్కార్ సబ్సిడీపై సీడ్ సప్లై చేయగా.. అగ్రికల్చర్ ఆఫీసర్లు యాక్టివ్‌గా పనిచేశారు.
కొనుగోళ్లపై రైతులకు నమ్మకం కలిగించేందుకు బోధన్‌లోని నిజాం షుగర్ ఫ్యాక్టరీకి చెందిన 200 ఎకరాల భూమిలో సోయా ఫ్యాక్టరీ నెలకొల్పే ఏర్పాట్లు సైతం జరిగినా ముందుకు సాగలేదు. తర్వాత సీడ్ సప్లైని ప్రభుత్వం ఎత్తేయడంతో రైతులు సోయాబీన్ సాగు క్రమంగా తగ్గించి వరి వైపు మొగ్గు చూపారు.
ఇపుడు కేవలం 30 వేల ఎకరాల్లో మాత్రమే సోయా సాగవుతోంది. బోధన్ నిజాం షుగర్, సారంగాపూర్ కో ఆపరేటివ్ షుగర్స్ ఫ్యాక్టరీలు నడిచిన టైంలో 35 వేల ఎకరాల్లో చెరుకు సాగయ్యేది. ఆ రెండు ఫ్యాక్టరీలు మూత పడడంతో చెరుకు స్థానంలో వరి చేరింది.
మెదక్ జిల్లాలో తగ్గిన చెరుకు సాగు..
మెదక్, జహీరాబాద్‌లో షుగర్ ఫ్యాక్టరీలు నడిచిన టైంలో ఉమ్మడి మెదక్ జిల్లాల్లో చెరుకు ఎక్కువగా సాగయ్యేది. ఆ రెండు ఫ్యాక్టరీలు మూత పడడంతో చెరుకు రైతులు తమ పంటను పక్క రాష్ట్రాలైన కర్నాటక, మహారాష్ట్రకు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో చెరుకు సాగును తగ్గించి వరి వైపు మొగ్గు చూపారు. ఒకప్పుడు సంగారెడ్డి జిల్లాలో 50 వేల ఎకరాల్లో సాగయ్యే చెరుకు ఇప్పుడు 9 వేల ఎకరాలకు పడిపోయింది.
సిద్దిపేట జిల్లాలో తెల్లజొన్న, నువ్వులు బాగా పండించేవారు. స్థానికంగా మార్కెటింగ్ సదుపాయం లేకపోవడం వల్ల పంటల సాగు తగ్గిపోయింది. ఒకప్పుడు 10 వేల ఎకరాల్లో పండించిన తెల్లజొన్నలు ఇప్పుడు 3 వేల ఎకరాలు, 15 వేల ఎకరాల్లో పండించే నువ్వులు ఇప్పుడు 4 వేల ఎకరాలకు పడిపోయాయి.
కరీంనగర్ జిల్లాలో మక్క మాయం..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి నీళ్లు రాక ముందు వరకు రైతులు మక్కజొన్న, ఇతర మెట్ట పంటలు సాగు చేసేవారు. మూడు, నాలుగు దశాబ్దాలుగా ఎస్సారెస్పీ నీళ్లు అందుబాటులోకి రావడంతో ఇక్కడి రైతులకు వరి ప్రధాన పంటగా మారింది.
అక్కడక్కడ పత్తి సాగు చేస్తుండగా.. కొందరు రైతులు ఇప్పుడిప్పుడే ఆయిల్‌పామ్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 12 లక్షల ఎకరాల సాగు భూమి ఉంటే.. 10 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుండగా.. మిగతా 2 లక్షల ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న, కంది, వేరుశనగ, పొద్దుతిరుగుడు, కూరగాయలు సాగు చేస్తున్నారు.
‘ఒక జిల్లా ఒక ఉత్పత్తి’ విధానం
ప్రతి జిల్లాకు భౌగోళిక పరిస్థితులు, నేల స్వభావం, వాతావరణానికి అనుగుణంగా ప్రత్యేక పంటలను గుర్తించి ‘ఒక జిల్లా ఒక ఉత్పత్తి’ విధానాన్ని అమలు చేయాలని రైతు కమిషన్ ప్రతిపాదించింది. నిజామాబాద్‌లో పసుపు, వరంగల్, ఖమ్మంలో మిరప, ఖమ్మం,జగిత్యాల, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో మామిడి, రంగారెడ్డి, వికారాబాద్ ప్రాంతాల్లో కూరగాయల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది.
ఆయా ప్రాంతాల్లో ప్రాసెసింగ్ యూనిట్లు, ప్యాక్‌హౌస్‌లు, కోల్డ్ స్టోరేజీలను ఏర్పాటు చేయాలని సూచించింది. ఉద్యానవన పంటల కొనుగోలుకు ప్రత్యేక మార్కెటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, కేరళ తరహాలో కూరగాయల క్లస్టర్లు, మహారాష్ట్రలోని సహ్యాద్రి ఫార్మ్స్ నమూనాలో రైతు ఉత్పత్తిదారుల సంస్థలను (ఎఫ్‌పీఓలు) ప్రోత్సహించాలని పేర్కొంది. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టాలని సిఫార్సు చేసింది.
ఉద్యాన, పప్పు, నూనెగింజల పంటల వైపు మళ్లాలి..
రాష్ట్రంలో వ్యవసాయ రంగం ఒకే పంట విధానం వైపు సాగుతోందని, ఇది దీర్ఘకాలికంగా ప్రమాదకరంగా మారుతుందని రైతు కమిషన్ హెచ్చరించింది. రైతులు ఉద్యానవన, పప్పు, నూనె గింజలను పంటలను వదిలేసి పూర్తిగా వరి, పత్తిపైనే ఆధారపడుతున్నట్లు తాజాగా ప్రభుత్వానికి అందజేసిన నివేదికలో స్పష్టం చేసింది.
ఒకే రకమైన పంట విధానం వల్ల భూసారం క్షీణించడం, నీటి వినియోగం పెరగడం, సాగు వ్యయాలు అధికమవడం, పంటల వైవిధ్యం తగ్గిపోవడం వంటి సమస్యలు ఏర్పడుతాయని, వీటిని అధిగమించాలంటే పంటల మార్పిడి తప్పనిసరి అని తన పేర్కొంది.
