సేంద్రియ సాగు.. లాభాల బాట..! ప్రకృతి సేద్యానికి జేబీడీ సొసైటీ కృషి

సేంద్రియ సాగు.. లాభాల బాట..! ప్రకృతి సేద్యానికి జేబీడీ సొసైటీ కృషి

జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: వ్యవసాయ సాగులో రసాయనిక ఎరువులు, పురుగు మందులను విపరీతంగా వాడుతుండడంతో భూసారం దెబ్బతింటుంది. పంట దిగుబడి రాక రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు ఉంటుంటాయి. దీంతో నేల తల్లిని కాపాడుకునేందుకు, భూసారం పెంచేందుకు కొన్నాళ్లుగా రైతులు సేంద్రియ సేద్యం చేస్తున్నారు. పంటలను పండిస్తూ మార్కెట్‎లో అమ్ముకుంటూ అధిక లాభాలు పొందుతున్నారు. 

ఇందుకు జయశంకర్ భూపాలపల్లి డెవలప్ మెంట్(జేబీడీ) సొసైటీ కృషి చేస్తోంది. కొత్తపల్లి గోరి మండలం చెన్నాపూర్‎కు చెందిన1,300 మంది రైతులతో జేబీడీ సొసైటీ ఏర్పడింది. పెట్టుబడి ఖర్చులు తగ్గిస్తూ.. లాభాల బాటలో రైతులు పయనించేలా సొసైటీ ప్రోత్సహిస్తోంది. అంతేకాకుండా సేంద్రియ సాగు చేసే ఏపీ, తెలంగాణలోని 50 మంది ఉత్తమ రైతులను గుర్తించి ఏటా ఉగాది పురస్కారాలను కూడా ఇస్తోంది. 

జీవామృతం, దశపత్ర కషాయాల తయారీ 

సేంద్రియ సేద్యానికి  ప్రధానంగా జీవామృతంతోపాటు ప్రకృతిలో దొరికే చెట్ల ఆకుల పసర్లతో ఎరువులను సొసైటీ తయారు చేస్తోంది. జీవామృతాన్ని10 కిలోల ఆవు పేడ, 10 లీటర్ల ఆవు మూత్రంలో 2 కిలోల బెల్లం, పప్పు పిండి, పుట్టమట్టితో, దశపత్ర కషాయాన్ని అడవిలో దొరికే వేప, సీతాఫలం, కానుగ, బెలబెండ, వయ్యారి భామ, తులసి, జిల్లెడు, ఉమ్మెత్త, బొమ్మెడు, మద్ది ఆకులతో రూపొందిస్తోంది.  

వీటిని రైతులు సాగులో నీటి ద్వారా, లేదంటే పైనుంచి పిచికారీ కూడా చేయొచ్చు. ఇలా పంట కాలవ్యవధిలో మూడు సార్లు వాడితే సరిపోతుంది. పచ్చపురుగు, సన్న పురుగు, ముడత, దోమల నివారణకు దోహదం చేస్తాయి. తయారీకి ఎరువులకు అయిన ఖర్చులు మాత్రమే తీసుకుంటూ రైతులకు అందిస్తోంది. అంతేకాకుండా రెండేండ్లుగా మేలైన మిరప విత్తనాలను ఫ్రీగా పంపిణీ చేస్తోంది.  

వందేండ్ల నాటి దేశవాళీ సీడ్‎తో..

హైబ్రిడ్​విత్తనాల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడంతో పాటు ప్రకృతిలో వచ్చే మార్పులకు తట్టుకోలేక రైతులు నష్టపోతున్నారు. దీంతో100 ఏండ్ల నాటి దేశీ విత్తనాలైన రక్తశాలి, మైసూర్​మల్లిక, చిక్లాకొయిలా, దుదేశ్వర్ వంటి రకాలు సాగు చేస్తున్నారు. ఎకరం వరి సాగుకు కలుపు, నాటు, కొత, దున్నుడు ఖర్చులు, సహజసిద్ధమైన ఎరువుల తయారు చేయడానికి అయ్యే కొద్దిపాటి ఖర్చులు మినహా ఎలాంటి ఇతర ఖర్చులు లేకపోవడంతో తక్కువ పెట్టుబడులతో రైతులు అధిక లాభాలు పొందుతున్నారు. 

దీంతో జిల్లాలో సేంద్రియ పద్ధతిలో పంటల సాగు చేసే రైతుల సంఖ్య పెరుగుతోంది. సేంద్రియ ఉత్పత్తులకు మార్కెట్​లోనూ మంచి డిమాండ్​ఉండడంతో రైతులే సొంతంగా వ్యాపారం చేస్తున్నారు. సేంద్రియ సేద్యాన్ని ఉద్యమంలా చేపట్టిన జేబీడీ సొసైటీ రైతులు పండించిన ఉత్పత్తులకు మార్కెట్ రేటు కంటే ఎక్కువకు కొనుగోలు చేసేందుకు విన్​టెజ్ అగ్రి ప్రొడక్ట్​కంపెనీ సిద్ధమైంది. రైతుల పండించిన అన్నిరకాల వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసి కస్టమర్లకు అందించేవిధంగా స్టోర్​ను నిర్మాణం చేస్తోంది. 

నేల తల్లిని సంరక్షించడమే లక్ష్యం 

రసాయనిక మందులతో నిస్సారంగా మారిన నేల తల్లిని సంరక్షించి పర్యావరణ సమతుల్యతను కాపాడటమే సొసైటీ లక్ష్యం. అందుకనుగుణంగా రైతులకు సేంద్రియ సాగుపై అవగాహన కల్పిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర గోశాల సమితి ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో 20 మంది షుగర్, సంతానలేమి బాధితులను గుర్తించి గో ఆధారిత ఉత్పత్తులను అందించేందుకు కసరత్తు చేస్తున్నాం. పంచగవ్య తరహా శిక్షణ తీసుకుంటున్నాం. 

- సిరికొండ తిరుపతిరావు, జేబీడీ సొసైటీ చైర్మన్​

దేశీరకం బియ్యాన్ని పండిస్తున్నా..

20 ఏండ్లుగా సేంద్రియ సాగు చేస్తూ రక్తశాలి దేశీరకం బియ్యాన్ని పండిస్తూ మార్కెటింగ్ చేస్తున్నాను. ఎకరా సాగుకు రూ.20 వేల ఖర్చు అవుతుంది. బియ్యాన్ని కేజీకి రూ.130 నుంచి 150 వరకు అమ్ముతు న్నా. ఖర్చులు పోనూ ఏటా రూ. 80 వేల ఆదాయం వస్తుంది. హైదరాబాద్, రాజమండ్రి, కాకినాడ, విజయవాడ నుంచి రైస్ కోసం ఆర్డర్లు వస్తున్నాయి. 
-ఎం.మణికుమార్ , రైతు, కొత్తపల్లి గోరి మండలం