యాదాద్రి, వెలుగు: యూరియా బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా చెక్‌పెట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అవసరం లేకున్నా.. పెద్ద మొత్తంలో యూరియా నిల్వ చేసుకొని కృత్రిమ కొరత సృష్టించకుండా ఆన్లైన్లో బుకింగ్ చేసుకునేలా ‘యూరియా యాప్’ ను ప్రభుత్వం రూపొందించింది. ఈ యాప్ ద్వారానే ఈ యాసంగి సీజన్లో రైతులకు యూరియా అందించనుంది.
24 వేల టన్నుల యూరియా అవసరం
యాదాద్రి జిల్లాలో 8,55,922 ఎకరాల భూమి అందుబాటులో ఉంది. ఇందులో సాగుకు అనువైన భూమి 6,18,390 ఎకరాలు కాగా, సాగు చేయని భూములు 63,222 ఎకరాలు ఉన్నాయి. యాదాద్రి జిల్లాలో పంటల సాగు కోసం ప్రతి సీజన్లో రైతులు దాదాపు 24 వేల టన్నుల యూరియా అవసరం పడుతోంది. యూరియా బ్లాక్ మార్కెట్‌కు తరలించడం, డీలర్లు, బ్లాక్ చేసి కృత్రిమ కొరత సృష్టించడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
కృత్రిమ కొరత కారణంగా వానాకాలం 2025 సీజన్లో యూరియా కోసం తెల్లవారక ముందే రైతులు క్యూ కట్టారు. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం దీనికి చెక్ పెట్టేందుకు నిర్ణయం తీసుకుంది. యాదాద్రి జిల్లాలో పర్టిలైజర్ షాపులు 267 ఉండగా ప్రస్తుతం 250 షాపులే నడుస్తున్నాయి. ఈ యాసంగి 2025--–26 సీజన్‌కు 24 వేల టన్నుల యూరియా అవసరం కాగా ఇప్పటికే 10 వేల టన్నుల యూరియా అందుబాటులో ఉంది. ప్రతీ రోజు యూరియా ఎంతో కొంత దిగుమతి అవుతూనే ఉంది.
యూప్‌లో యూరియా బుకింగ్
రైతులు పర్టిలైజర్ షాపుల వద్దకు వెళ్లకుండానే ఏ ఫోన్ నుంచైనా యారియా బుక్ చేసుకోవడానికి ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించింది. ఈ యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకోవడానికి పట్టదారులతో పాటు కౌలు రైతులు, ఆర్వోఎఫ్ఆర్లకు అవకాశం కల్పించింది. ఈయాప్‌లో రైతు ముందుగా తన ఫోన్ నెంబర్ అప్లోడ్ చేయాలి. తన ఫోన్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయడంతో పాటు తనకు సంబంధించిన పట్టదారుపాస్ బుక్ నెంబర్ ఎంటర్ చేయగానే మరో ఓటీపీ వస్తుంది.
ఓటీపీని ఎంటర్ చేయగానే రైతు పేరుతో ఎన్ని ఎకరాల భూమి ఉందో వివరాలతో పాటు పర్టిలైజర్ డీలర్‌ను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. పైగా సదరు డీలర్ వద్ద ఎన్ని బస్తాల యూరియా ఉందో కూడా వివరాలు ఉంటాయి. బుకింగ్ కోడ్ రాగానే సంబంధిత డీలర్ వద్దకు వెళ్లి యూరియా కొనుగోలు చేయవచ్చు.
ఎకరానికి రెండున్నర బస్తాలే
వరికి ఎకరానికి రెండున్నర బస్తాలు, చెరుకు, మిరప, మొక్కజొన్న పంటలకు ఎకరానికి 5 బస్తాల వరకే బుక్ చేసుకోవడానికి లిమిట్ ఉంటుంది. అంతకు మించి బుక్ చేసుకోవడానికి వీలులేదు. ఒకసారి బుకింగ్ చేసుకుంటే 24 గంటల్లో యూరియా తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకోకుంటే బుకింగ్ రద్దు అవుతుంది. 15 రోజుల్లో మళ్లీ బుకింగ్ చేసుకోవచ్చు. అవసరమైన యూరియా ఒక్కసారే కాకుండా విడతల వారీగా బుకింగ్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఏ జిల్లా రైతులు అదే జిల్లాలోనే యూరియా బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. పక్క జిల్లాలో బుకింగ్ చేసుకునే అవకాశం ఉండదు.
22 నుంచి యాప్‌లో బుకింగ్
ఈ నెల 22 నుంచి యాప్ ద్వారా యూరియా బుకింగ్ చేసుకోవచ్చు. ఇందుకోసం ప్రతి పర్టిలైజర్ షాపు వద్ద వలంటీర్‌ను ఏర్పాటు చేస్తున్నాం. వారిసహకారంతో రైతులు యూరియా బుక్ చేసుకోవచ్చు. అవగాహన ఉన్న రైతులు ఇంటి నుంచే యూరియా బుక్ చేసుకోవచ్చు. – వెంకటరమణా రెడ్డి, డీఏవో, యాదాద్రి
