గ్రామాల్లో ఘనంగా రైతుల ఏరువాక సంబరాలు

గ్రామాల్లో ఘనంగా  రైతుల ఏరువాక సంబరాలు

తొలకరికి ముందు గ్రామాల్లో రైతులు ఏరువాక సంబరాలు జరుపుకోవటం ఆనవాయితీగా వస్తోంది. ఏరువాక పౌర్ణమి నాడు పూజల తర్వాత రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రైతుల ఏరువాకపై ప్రత్యేక కథనం. 

తొలకరి వానలు పడగానే గ్రామాల్లో ఏరువాక సంబురాలు జరుపుకోవడం ఆనవాయితీ. జ్యేష్ట శుద్ధ పౌర్ణమి నాడు ఎద్దులకు నాగలికి కట్టి ప్రత్యేక పూజలు చేసి వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు రైతులు. వర్షాలు సమృద్ధిగా కురిసి... పంటలు బాగా పండాలని పుడమి తల్లికి మొక్కుతారు. ఏరువాక సందర్భంగా  పొద్దు గాలనే కాడెద్దులకు స్నానం చేయించి వాటి కొమ్ములకు రంగులు పూసి..మెడలో గజ్జెలు, గంటలతో అలంకరిస్తారు. ఆ తర్వాత ఎడ్ల పందేలు నిర్వహిస్తారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఏటా ఈ సంప్రదాయం ఘనంగా కొనసాగిస్తున్నారు రైతులు. ఏరువాక పౌర్ణమి వేడుకలు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. జిల్లాలోని దేవరకద్ర మండలం కౌకుంట్లలో జరిగే ఎడ్ల పందాల పోటీలు చాలా ఫేమస్. ఈ వేడుకలను చూసేందుకు జనం భారీగా తరలివస్తారు.

ఈసారి కూడా దూర ప్రాంతాల నుంచి ఎండ్ల బండ్ల ఊరేగింపుతో వచ్చిన రైతులు.. ఎడ్ల పందాల్లో పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు గ్రామ పెద్దలు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లాలోని గ్రామ దేవతల ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. నైవేద్యం పెట్టి ఆశీస్సులు తీసుకున్నారు. ఆ తర్వాత కాడెద్దులకు పూజలు చేసి పొలాల్లో వ్యవసాయ పనులు మొదలు పెట్టారు. వ్యవసాయ పనులు ప్రారంభానికి ముందు వచ్చే ఏరువాక పౌర్ణమిని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు పాలమూరు జిల్లా రైతులు. సాగులో ఎలాంటి తిప్పలు రాకుండా చూడాలని పుడమి తల్లికి మొక్కుకున్నారు.