వరుస కేసులతో కోర్టుల చుట్టూ రైతుల ప్రదక్షిణలు

వరుస కేసులతో కోర్టుల చుట్టూ రైతుల ప్రదక్షిణలు
  • పరిహారం కోసం రోడ్డెక్కితే కేసులు
  • మద్దతు ధర కోసం ఆందోళన చేస్తే కేసులు
  • పోడు భూములు దున్నితే కేసులు
  • రాష్ట్రంలో వేలాది రైతుల ఇక్కట్లు

వెలుగు, నెట్​వర్క్​:  రాష్ట్రంలో బలవంతపు భూసేకరణను వ్యతిరేకంగా,  న్యాయమైన పరిహారం కోసం పోరాడుతున్న రైతులపై సర్కారు కేసులు పెట్టిస్తున్నది.  పంట కొనాలని, మద్దతు ధర ఇయ్యాలని ఆందోళన చేసిన రైతులనూ వదలట్లేదు. ఇక పోడుభూములను దున్నేందుకు వెళ్తున్న వందలాది రైతులను అడ్డుకొని జైళ్లకు పంపుతున్నది. ఇటీవల పెండింగ్​ పరిహారాల కోసం గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులు హుస్నాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించిన ఘటనలో గుడాటి పల్లి కి చెందిన 17 మందిపై కేసులు పెట్టడంతో రైతులపై కేసుల వ్యవహారం రాష్ట్రమంతా చర్చ జరుగుతోంది. 

పరిహారం కోసం పోరాడినందుకు.. 

ఈ నెల 14న గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులు హుస్నాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట పెండింగ్ పరిహారాల కోసం ధర్నా చేశారు. వీళ్లకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ తీశారు. దీంతో ఘర్షణ వాతావరణం ఏర్పడగా, పోలీసులు, టీఆర్​ఎస్​ వాళ్లు కలిసి నిర్వాసితులపై కర్రలతో దాడిచేయగా పలువురికి గాయాలయ్యాయి. పోలీసులకు కూడా గాయాలయ్యాయంటూ 17 మంది రైతులపై కేసులు పెట్టారు. ఇందులో నలుగురిని రిమాండ్ ​చేశారు.

ఇదే సిద్దిపేట జిల్లాలో పరిహారం కోసం గతంలో ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్న19 మంది మల్లన్న సాగర్ నిర్వాసితులు, ఐదుగురు కొండపోచమ్మ సాగర్​ నిర్వాసితులపైన ఇప్పటికీ కేసులు నడుస్తున్నాయి. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు పనులు జరుగుతున్న నాగర్​కర్నూల్ జిల్లాలో పరిహారం కోసం పోరాడుతున్న 100 మందికి పైగా రైతులపై కేసులు నమోదయ్యాయి.  వట్టెం రిజర్వాయర్ ​ముంపు గ్రామాలైన కారుకొండ తాండ, అనేఖాన్​పల్లి తాండకు ముందుగా ప్రకటించిన  ప్యాకేజీ కాకుండా తక్కువ ప్యాకేజీ ఇవ్వడాన్ని నిరసిస్తూ పలుమార్లు ఆందోళనకు దిగిన గిరిజనులపై ఇప్పటికీ నాలుగు దఫాలుగా 69 కేసులు పెట్టారు. బిజినేపల్లి మండలం మంగనూర్ చెరువు నుంచి పర్మిషన్ లేకుండా నల్లమట్టి తవ్వడాన్ని నిరసిస్తూ మే 8న గ్రామంలో ర్యాలీ తీసిన 32 మంది రైతులపై కేసులు పెట్టారు.

కొల్లాపూర్ మండలం కేఎల్ఐ డీ5 కాల్వను ఆఫీసర్లు పూడ్చడంతో ఈనెల 8న కాల్వను పరిశీలించడానికి  మాజీ  మంత్రి జూపల్లితోపాటు వెళ్లిన 23 మందిపై కేసులు బుక్​చేసి జైలుకు పంపారు. వీరిలో చాలా మంది రైతులున్నారు.  జగిత్యాల జిల్లా  కొడిమ్యాల మండలంలోని హిమ్మత్​రావుపేటలో మంత్రులను అడ్డుకున్నారని నురాంసాగర్, శనివారం పేట, డబ్బు తిమ్మాయపల్లిలకు చెందిన రైతులపై కేసు పెట్టారు. ప్రస్తుతం బాధితులంతా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. 

పోడుభూముల ఇష్యూలో గిరిజన రైతులపై.. 

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కోయపోచగూడలో పోడు చేసినందుకు ఫారెస్ట్ ఆఫీసర్లు జూన్​1న 31 మంది ఆదివాసీలపై కేసులు పెట్టించారు. వీరిలో 12 మంది మహిళలు అక్రమంగా అడవిలోకి చొరబడి చెట్లు నరికారంటూ పలు సెక్షన్ల కింద కేసులు పెట్టి, ఆదిలాబాద్ జైలుకు పంపగా, బెయిల్​పై విడుదలయ్యారు. ప్రతి సోమవారం తాళ్లపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసులో హాజరవుతున్నారు. ఇదే జిల్లా భీమారం మండలం ఆరెపల్లిలో పోడు భూముల కేసులో ఫారెస్ట్ ఆఫీసర్లు 13 మందిపై ఈ ఏడాది జనవరిలో కేసులు పెట్టారు. సర్పంచ్ భర్త రమేశ్​తో పాటు రాంటెంకి రమేశ్​ను జైలుకు పంపారు. వారు బెయిల్ పై వచ్చి ప్రతి నెలా కోర్టు పేషీలకు హాజరవుతున్నారు.

పోలంపల్లిలోనూ నలుగురిపై కేసు నమోదు చేశారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 100 మందికి పైగా పోడు రైతులు కేసులపాలయ్యారు. ఒక్క సార్సల ఘటనలోనే 39 మంది కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. పోడు భూముల్లో హరితహారం కార్యక్రమాన్ని నిరసిస్తూ జిల్లాలో మూడురోజులపాటు నిరసన దీక్ష చేపట్టిన ఘటనలో బీజేపీ నేత హరీశ్​బాబు సహా కొండపల్లికి చెందిన 20 మంది, రెబ్బెన గ్రామానికి చెందిన 8 మంది రైతులను అరెస్ట్​ చేశారు. సూర్యాపేట జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి, సాగర్​, త్రిపురారం మండలాలకు చెందిన 60 మంది పై ఫారెస్ట్ అధికారులు కేసులు పెట్టారు.

మఠంపల్లి మండలం గుర్రంబోడులో పోడు భూముల పోరాటం చేసిన 27మంది రైతులపై గత ఏడాది హత్యాయత్నం కింద  కేసులు నమోదు చేయగా నేటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.  మెదక్​ జిల్లా శివ్వంపేట మండలం తాళ్లపల్లిగడ్డ తండా, బిక్యా తండా, నాను తండా, తుక్యా తండా పరిధిలోని సర్వే నెంబర్​ 315, 316లో దాదాపు 1200 ఎకరాల ను పార్ట్​– బీలో పెట్టడంతో 550 మంది  రైతులు పోరాడుతున్నారు.  శివ్వంపేట తహసీల్దార్​ ఆఫీస్ ఎదుట ఆందోళనలో పాల్గొన్న ఘటనలో14 మంది రైతులపై కేసులు పెట్టి రిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం గడ్కోల్ లో పోడుభూముల ఇష్యూలో 9మంది పై పెట్టిన కేసులు ఇప్పటికీ నడుస్తున్నాయి.

నాగర్​కర్నూల్​ జిల్లా అమ్రాబాద్ మండలం మాధవానిపల్లికి చెందిన ఎనిమిది మంది రైతుల పై ఫారెస్ట్ అధికారులు కేసులు నమోదు చేశారు. ఇందులో మహిళా రైతు చారగొండ బాలమ్మ మనస్తాపానికి గురై గుండెపోటుతో మృతి చెందింది.  పదర మండలం మాచారంలో  పోడు భూముల స్వాధీనానికి వచ్చిన ఫారెస్ట్ స్టాఫ్ పై పెట్రోల్ పోసేందుకు యత్నించారని నలుగురిపై కేసు పెట్టారు. భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం పంది పంపులలో ఫారెస్ట్ ఆఫీసర్ల పై దాడి చేశారని  నలుగురు పోడు రైతులపై  కేసులు పెట్టి  జైలుకు పంపించారు.  

ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం ఎల్లన్న నగర్ లో పోడు భూములు సాగుచేసుకుంటున్న రైతులను గతేడాది ఫారెస్ట్​ ఆఫీసర్లు అడ్డుకున్నారు. ఈ సమయంలో జరిగిన గొడవలో తమపై దాడి చేశారంటూ 22 మంది గిరిజన, గిరిజనేతర రైతులపై ఫారెస్ట్​ ఆఫీసర్లు కేసులు పెట్టారు. 18 మంది మహిళలను అరెస్టు చేసి హత్యాయత్నం కింద 307 సెక్షన్  తో పాటు మరికొన్ని సెక్షన్లు పెట్టారు. ప్రతి పక్షాలు, ప్రజాసంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో 307 సెక్షన్​ను పోలీసులు తొలగించారు. జూలై 12న జైలు లో ఉన్న రైతులను బెయిల్ మీద విడుదల చేశారు. కానీ బాధితులు ఇప్పటికీ కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. 

ల్యాండ్​పూలింగ్​ను అడ్డుకున్నందుకు..

 హనుమకొండ జిల్లా లో ల్యాండ్​ పూలింగ్​ జీవోను పూర్తిగా రద్దు చేయాలని మే 31న హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పెరుమాండ్లగూడెంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్​ను అడ్డుకున్న 12 మంది రైతులపై కేసులు పెట్టారు. కల్పగిరి శ్రీనివాస్​, నిరంజన్​, వరంగంటి మురళి అనే ముగ్గురు రైతులను స్టేషన్​లో పెట్టి కొట్టడంతో నిరంజన్​, మురళికి తీవ్ర గాయాలయ్యాయి. పత్తికి మద్దతు ధర కల్పించాలంటూ ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో ఆందోళనకు దిగిన ఘటనలో సాంగిడి, కౌట, మేడిగూడ, సుంకిడి, ఆదిలాబాద్, ఆనంద్​పూర్​కు చెందిన 20 మంది రైతులపై కేసులు పెట్టగా, ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.  వనపర్తిలో 40 ఏండ్లుగా గిరిజనులు, బీసీలు సాగు చేసుకుంటున్న భూములను  ఖాళీ చేయించి కలెక్టరేట్, మెడికల్ కాలేజీ, ఇతర బిల్డింగులకు ఇచ్చారు. ఈ క్రమంలో ఆందోళన చేసిన12 మంది రైతుల పై కేసులు పెట్టగా పేసీలు అటెండ్​ అవుతున్నారు.
45రోజులు జైల్లో ఉన్నాం.. 

పునరావాసం కింద అప్పటి ప్రభుత్వం 540 సర్వే నంబర్​లో పోడు పట్టాలు ఇచ్చింది. కానీ కొందరు ప్రైవేట్​వ్యక్తులు మాకు తెలియకుండా  మా భూములకు పట్టాలు చేసుకున్నారు. మాపై దాడిచేసి పొలంలో ఉన్న బోర్లు, పైపులు, ట్రాన్స్​ఫార్మర్​ ధ్వంసం చేసిన్రు. అడ్డుకున్న మా పై కేసులు పెట్టించి జైలుకు పంపించిన్రు.  నేను 45 రోజులు హుజూర్ నగర్ సబ్ జైల్ లో ఉండి వచ్చిన. కోర్టుల చుట్టూ తిరుగుతనే ఉన్న.  -అజ్మీరా రమేశ్, బోజ్య తండా,  మఠంపల్లి మండలం, సూర్యాపేట జిల్లా

భూమి సాధించే వరకు పోరాటం ఆపం
మా తాతలు తండ్రులకాలంలో శివారులోని అటవీ ప్రాంతంలో పోడు వ్యవసాయం చేసిన్రు. ఉద్యమ సమయంలో రాష్ర్టం వస్తే ఆదివాసీ గిరిజనుల పోడు భూములకు పట్టాలు ఇస్తామని కేసీఆర్ చెప్పిండు. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పిండు. ఫారెస్ట్ ఆఫీసర్లు అడవిలో చెట్లు కొట్టిన్రని మాపై కేసులు పెట్టి జైలుకు పంపిన్రు. పట్టాలు ఇచ్చేదాకా మా పోరాటం ఆపం. – దోసండ్ల శ్యామల, కోయపోచగూడెం