- నకిలీ విత్తనాలు, కల్తీ ఎరువులతో రైతులు నష్టపోయారు
- రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి విమర్శ
- పంటలకు మద్దతు ధర కల్పించాలి: కోదండరాం
హైదరాబాద్, వెలుగు: వ్యవసాయ రంగం గత పదేళ్లలో నిర్లక్ష్యానికి గురైందని, నకిలీ విత్తనాలు, కల్తీ ఎరువులతో రైతులు తీవ్రంగా నష్టపోయారని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో రైతు కమిషన్, సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్, డెక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ మంగళవారం బీఆర్కే భవన్లో సంయుక్తంగా వర్క్‌షాప్ నిర్వహించాయి. ఈ సందర్భంగా కోదండరెడ్డి మాట్లాడుతూ విత్తనాలు ప్రైవేట్ కంపెనీల చేతుల్లోకి వెళ్లాయన్నారు.
అధిక ఎరువుల వాడకంతో భూమి, నీరు, వాతావరణం కలుషితమవుతున్నాయని, ఇలాంటి పంటలు తినడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కమిషన్ వివిధ రాష్ట్రాల్లో పర్యటనలు చేసిన విషయాన్ని వివరించారు.
టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ.. రాష్ట్రంలో 60% ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారని, చిన్న, సన్నకారు, మహిళా రైతులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. వరి, పత్తితో పాటు ఇతర పంటలకు మద్దతు ధర కల్పించాలని కోరారు. రైతు సంఘం నేత సారంపల్లి మల్లారెడ్డి మాట్లాడుతూ భూసార పరీక్షల ఆధారంగా పంటలు ఎంచుకోవాలని, ఉద్యానవన పంటల సాగు పెంచి ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలన్నారు.
సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ ఫౌండర్ రామాంజనేయులు మాట్లాడుతూ సేంద్రియ సాగు వైపు మళ్లాలని, యువతను వ్యవసాయంవైపు ఆకర్షించాలని, పశువుల పెంపకంతో సహజ ఎరువుల వినియోగం పెంచాలని సూచించారు. సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలని, వ్యవసాయ యూనివర్సిటీలు, ఆగ్రోస్, విత్తనాభివృద్ధి సంస్థలను బలోపేతం చేయాలన్నారు. రైతు కమిషన్ సభ్యుడు రాములు నాయక్ మాట్లాడుతూ గత పదేళ్లలో 10 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు.
