
హైదరాబాద్, వెలుగు: బోయిన్‌పల్లి వ్యవసాయ మార్కెట్ నిర్వహణలో తీవ్ర అవకతవకలు ఉన్నాయని రైతు కమిషన్ గుర్తించింది. మార్కెట్ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై కమిషన్ చైర్మన్ కొదండరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం కమిషన్ సభ్యులు రాములు నాయక్, భవానీ రెడ్డితో కలిసి చైర్మన్ అకస్మిక తనిఖీ నిర్వహించారు. గంటన్నర పాటు మార్కెట్‌ను పరిశీలించిన కమిషన్ బృందం.. రైతులు, వ్యాపారస్తులు, హమాలీలతో మాట్లాడింది.
మార్కెట్ కార్యాలయ రికార్డులు, అటెండెన్స్ రిజిస్టర్‌లను పరిశీలించగా, గత మూడు నాలుగు రోజులుగా మార్కెట్ సెక్రటరీ అందుబాటులో లేనట్లు తేలింది. కింది స్థాయి సిబ్బంది కూడా సమయపాలన పాటించకపోవడంపై చైర్మన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. డేటా ఎంట్రీ ఆపరేటర్, అవుట్‌సోర్సింగ్ సిబ్బంది మాత్రమే విధుల్లో ఉండటం ఏమిటని నిలదీశారు.
కూరగాయల వ్యర్థాలతో బయోగ్యాస్ ఉత్పత్తి కోసం ఏర్పాటు చేసిన ప్లాంట్ మూడు నెలలుగా నిలిచిపోయినా చర్యలు తీసుకోకపోవడంపై మండిపడింది. మార్కెట్‌లో కూరగాయల కొనుగోళ్లు, అమ్మకాలు, ఉద్యోగుల వివరాలు, ఆదాయ -వ్యయాలు, షాపుల సమాచారారంపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది.