వడ్ల డబ్బులు చెల్లించాలని రైతుల ధర్నా

వడ్ల డబ్బులు చెల్లించాలని రైతుల ధర్నా
  • ధాన్యం కొని రూ. 12 లక్షలు ఇవ్వకుండా మోసం చేసిన ఏజెంట్‌‌‌‌‌‌‌‌
  • పురుగుల మందు డబ్బాలతో సహకార సంఘం ఎదుట రైతుల ఆందోళన

జన్నారం, వెలుగు : వడ్లు కొని డబ్బులు ఇవ్వకుండా మోసం చేసిన వ్యక్తితో పాటు, అతడికి సహకరించిన ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని బాదంపల్లి, చింతలపల్లె గ్రామాలకు చెందిన రైతులు సోమవారం పొనకల్‌‌‌‌‌‌‌‌ సహకార సంఘం ఆఫీస్‌‌‌‌‌‌‌‌ ఎదుట ఆందోళకు దిగారు. సహకార సంఘం తరఫున ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ ఏజెంట్‌‌‌‌‌‌‌‌గా నియామకం అయిన చింతలపల్లెకు చెందిన గాందోరి రవి అనే వ్యక్తి జనవరిలో రెండు గ్రామాలకు చెందిన 14 మంది రైతుల నుంచి 600 క్వింటాళ్ల వడ్లు కొన్నాడు.

వీటికి సంబంధించిన రూ.12 లక్షలను రైతుల బ్యాంక్‌‌‌‌‌‌‌‌ అకౌంట్లలో జమ చేస్తానని చెప్పి, తనకు తెలిసిన వారి అకౌంట్లలో డిపాజిట్‌‌‌‌‌‌‌‌ చేసుకున్నాడు. డబ్బులు ఎంతకూ రాకపోవడంతో రైతులు సహకార సంఘం సీఈవో రాజన్నను నిలదీయడంతో విషయం బయటపడింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు పురుగుల మందు డబ్బాలు పట్టుకొని సహకార సంఘం ఆఫీస్‌‌‌‌‌‌‌‌ ఎదుట ధర్నాకు దిగారు. తమ డబ్బులు చెల్లించాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు.

వీరికి సీపీఐ, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ లీడర్లు మద్దతు తెలిపారు. విషయం తెలుసుకున్న సొసైటీ అడిట్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ రాథోడ్‌‌‌‌‌‌‌‌ బిక్కు, పొనకల్‌‌‌‌‌‌‌‌ సొసైటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ అల్లం రవి ఘటనాస్థలానికి చేరుకొని డబ్బులను ఇప్పిస్తామని, మోసం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.