భూమి పాయే.. డబ్బూ పాయే.. బతికేదెట్లా!..భూ నిర్వాసితుల నుంచి రూ. 200 కోట్ల దోచేసిన ఫైనాన్షియర్లు

భూమి పాయే.. డబ్బూ పాయే.. బతికేదెట్లా!..భూ నిర్వాసితుల నుంచి రూ. 200 కోట్ల దోచేసిన ఫైనాన్షియర్లు
  • రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలంటున్న బాధిత రైతులు 

ఖైరతాబాద్, వెలుగు: అధిక వడ్డీ ఆశ చూపి డిపాజిట్ చేయించిన సుమారు రూ. 200 కోట్లను ఫైనాన్షియర్లు దోచేశారని భూ నిర్వాసిత బాధిత రైతులు ఆరోపించారు. ఫైనాన్షియర్లు మోసగించడంతో భూమి పోయి.. డబ్బు పోయి.. రోడ్డున పడ్డామని.. బతికేదెట్లా అంటూ..!  ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు.  హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్​ క్లబ్​లో సోమవారం మీడియా సమావేశంలో బీసీ నేత సంగెం సూర్యారావు, సీనియర్​జర్నలిస్టు పాశం యాదగిరి, విమలక్క, రఫీ పాల్గొని బాధితులకు మద్దతు తెలిపారు.

బాధితులు మాట్లాడుతూ.. పాలమూరు-– రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా 25 గ్రామాల రైతులు భూములను కోల్పోగా, రాష్ట్ర ప్రభుత్వం పరిహారం అందించింది.    నాలుగేండ్ల కింద మహబూబ్ నగర్ జిల్లా నాగర్​కర్నూలులో సాయిబాబా అనే వ్యక్తికి చెందిన ఓం సాయి శ్రీరామ్ ​ఫైనాన్స్   సంస్థలో  1,500 మంది నుంచి సుమారు రూ. 200 కోట్లు డిపాజిట్ చేయించారు.  

ఫైనాన్స్ సంస్థ బోర్డు తిప్పేయడంతో  బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు పెట్టి నిందితుడిని అరెస్ట్ చేయగా..  బెయిల్​పై వచ్చి బయట తిరుగుతున్నాడని, మోసం వెనక ఇట్యాల సాయిబాబా ప్రధాన సూత్రధారుడిగా, ఎన్ఎఫ్​సీ చీఫ్​జనరల్​ మేనేజర్ ఇట్యాల ధనుంజయ్, నాగం సురేందర్​రెడ్డి(బుచ్చిరెడ్డి) కరుణాకర్​ రెడ్డి, ఇట్యాల బాలేశ్వర్, జానకి రామ్​రెడ్డి ఉన్నారని బాధితులు ఆరోపించారు. నాగర్​కర్నూల్,  కొల్లాపూర్, వనపర్తి సెగ్మెంట్లకు చెందిన రెడ్డి సామాజిక వర్గ వ్యక్తులు సాయిబాబా వెనక ఉండి కథ నడిపించినట్టు పేర్కొన్నారు.