చట్టం రైతుకు చుట్టం కావాలి.. విత్తన చట్టం బిల్లులో మార్పులు అవసరం..

చట్టం రైతుకు చుట్టం కావాలి.. విత్తన చట్టం బిల్లులో మార్పులు అవసరం..

‘విత్తనం చనిపోతూ పంటను వాగ్దానం చేసింది’ అంటాడు శివసాగర్‌‌.  విత్తనాలపై రూపుదిద్దుకుంటున్న కొత్త చట్టం ‘బిల్లు ముసాయిదా’ మాత్రం రైతాంగానికి భరోసా ఇవ్వలేకపోయింది. ఈ దేశపు రైతులు, రైతు సంఘాల దశాబ్దాల డిమాండ్‌‌ దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం తాజాగా తలపెట్టిన విత్తన చట్టం తాలూకు బిల్లు ముసాయిదా మూడు వారాల కింద విడుదలయింది. ఏమైనా మార్పులు, సూచనలు, సలహాలుంటే డిసెంబర్‌‌ 11 వరకు తెలియపర్చవచ్చని ముసాయిదా ప్రతిని ప్రజాక్షేత్రంలో ఉంచింది. 

‘రైతుల ప్రయోజనం’ అన్న ఆత్మ లేకుండా ఉన్న ఈ బిల్లు ముసాయిదాలో ముఖ్యమైన మార్పులు తీసుకురాకుండా ఇదే రూపంలో బిల్లు ఆమోదం పొంది చట్ట రూపు సంతరించుకుంటే  ప్రమాదమని రైతులు,  రైతు నాయకులు ఆందోళన చెందుతున్నారు. బిల్లులో మార్పులు రాకుంటే  రైతాంగ పరిస్థితి  పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్టేననే భావన వ్యక్తమౌతోంది.

దేశ విత్తనోత్పత్తిలో తెలంగాణది అగ్రస్థానం. ‘విత్తన గోదాం’గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామన్న ప్రభుత్వాల హామీలు, ప్రణాళికలు కార్యరూపం దాల్చకుండానే వట్టిపోయాయి. ఇప్పుడీ చట్టం రూపొందే క్రమంలో బిల్లు  ముసాయిదాను  క్షుణ్ణంగా అధ్యయనం చేసి, అవసరమైన అభ్యంతరాలు, తగు సూచనలు, -సలహాలు ఇచ్చి ఆమేర మార్పులకు కృషి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఈ ప్రక్రియలో భాగంగానే వివిధ స్థాయిల్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ రంగ నిపుణులు, ప్రభుత్వ వివిధ విభాగాలు, పలు రైతుసంఘ ప్రతినిధులు, రైతులతో చర్చలు సాగుతున్నాయి. ఏయే అంశాల్లో, ఎటువంటి కొరతలు, లోపాలు తప్పిదాలున్నాయి. ఏమి తొలగించాలి? ఏవి పొందుపర్చాలి? అనే విషయాల్లో అంతటా ఇప్పుడు  ప్రధానంగా చర్చ జరుగుతోంది.

విత్తనంపై పెత్తనమెవరిది?

నాగరికత వికాస క్రమంలో మనిషి ప్రకృతిని ప్రసన్నం చేసుకొని వ్యవసాయం ప్రారంభించిన నాటి నుంచి ఇటీవలి కాలం వరకు విత్తనం రైతు అధీనంలోనే ఉంది.  పంటను గమనించి, మేలిమైన దిగుబడి నుంచి విత్తనాలు ఎంపిక చేసుకునేది.  వివిధ సంప్రదాయ పద్ధతుల్లో వాటిని నిలువ చేసుకునేది.  మిగిలితే  అవసరాల్లోని ఇరుగుపొరుగుకూ ఇచ్చేది.  పంట వాణిజ్యమై, అన్ని వ్యవసాయ ప్రక్రియలు వ్యాపారమై కార్పొరేట్‌‌ శక్తులు రంగ ప్రవేశం చేశాక విత్తనంపై కంపెనీలదే పెత్తనమైంది.  ఇదొక పార్శ్వం.  ఇక రెండోది  కేంద్ర ప్రభుత్వ ఆధిపత్యం.  

నిజానికి,  రాజ్యాంగం ప్రకారం వ్యవసాయం రాష్ట్ర జాబితాలోని అంశం.  రాష్ట్రంలో జరిగే విత్తన పరిశోధనలు, పరిశోధనా కేంద్రాలు, విత్తనోత్పత్తి, పరీక్షలు, క్రయ విక్రయాలు, నాణ్యత, ధరల నిర్ణయం వంటి విషయాలపైనా రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణ ఉండాలి. నాణ్యత లేని విత్తనాల వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించి, బాధ్యులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.  తప్పు చేసినవారిని శిక్షించాలి.  నష్టపోయిన  రైతులకు ఆమేరకు  నష్టపరిహారం బాధ్యులైన వారి నుంచి ఇప్పించాలి.  ఇందుకుగాను యంత్రాంగం, వ్యవస్థ ఉండాలి.  

కానీ, రాష్ట్రాలే  సొంతంగా చట్టాలు, వ్యవస్థలు ఉండే పరిస్థితులకు  కేంద్రంలోని  ప్రభుత్వాలు సానుకూలంగా ఉండటం లేదు.  ఇప్పుడు  ప్రతిపాదిస్తున్న బిల్లు చట్టమైతే అమలు బాధ్యత ఎవరిది? అందుకవసరమైన వ్యవస్థ ఎవరి నిర్వహణలో ఉంటుంది? తప్పిదాలకు కారణమయ్యే వారికి శిక్షలుపడేలా,  బాధితులైన వారికి నష్టపరిహారం ఇప్పించేలా ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఇటువంటి అంశాల్లో ఏ స్పష్టత ముసాయిదాలో లేదు. నష్టపరిహారమనే మాటేలేదు. పైగా అన్నింటికీ కేంద్ర విత్తన కమిటీయే ‘సూపర్‌‌ పవర్‌‌’ అన్నట్టుంది. 

రిజిస్ట్రేషన్‌‌ ప్రక్రియ సంస్కరించాలి

విత్తన రకాల వినియోగం సాగు విలువ, ఉపయోగాన్ని నిర్ధారించడానికి  ప్రపంచంలో  ఏ ఇతర  దేశంలోనైనా,  ఎక్కడైనా  అనుమతించే  (సెక్షన్‌‌ 16 (3)) అవకాశం కల్పించారు.  ఇది  ప్రమాదకర ప్రతిపాదన.  ప్రాంతాన్నిబట్టి వివిధ పంటల రకాలపై ఆయా ప్రాంతీయ వాతావరణ పరిస్థితులు నేరుగా ప్రభావం చూపుతాయి. ఒకచోట పరీక్షలు, నిర్ధారణలు మరోచోటుకి పనికిరావు.  ఏ రకం విత్తన- పంటసాగు అనుమతించాలన్నా  సంబంధిత వ్యవసాయ వాతావరణ మండలాల్లో సాగు విలువల అంచనా తరువాతనే అది జరగాలి.  అందుకు తగు నియంత్రణ అవసరం.  విదేశాల నుంచి దిగుమతయ్యే  విత్తనాలను  21 రోజులు ‘క్వారంటైన్‌‌’ విధంగా (సెక్షన్‌‌- 33) జరిగేటట్టు చూసే నిఘా- నియంత్రణ వ్యవస్థ ఉండాలి.  

ఇది సరిగా  లేకపోవడం వల్ల గతంలో జరిగిన పొరపాట్ల ఫలితమే విదేశాల నుంచి కలుపు మొక్కలు,  సర్కారు తుమ్మ, గొల్లబామ వంటివి విస్తారంగా వచ్చి వ్యవసాయాన్ని కుదేలు చేశాయి.  మ్యాడ్‌‌ కౌ, బర్డ్‌‌ ఫ్లూ, మౌత్‌‌ డిసీజ్‌‌,  గాలికుంట, గులాబీ పురుగు, తామర వంటివి ఇలాంటివే.  అనుమతి పొందిన విశ్వవిద్యాలయాలు, కేంద్ర-, రాష్ట్ర పరిశోధనా సంస్థలు స్వీయ ధ్రువీకరణతో కొత్త విత్తన రకాలను నేరుగా  రైతులకు అమ్మే అవకాశాల్ని  కల్పించాలనే సూచన కూడా వస్తోంది.  

సెక్షన్‌‌ 21 (1)లో  రిజిస్ట్రేషన్‌‌ చేసిన విత్తనాల ఎగుమతులు, -దిగుమతులకు అనుమతించిన దరిమిలా, వాటిపై తగు నియంత్రణ లేకుండా మన వ్యవసాయం కుదేలై, రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.  ప్రయివేటు సంస్థలు షరతులతో ఇచ్చినా విత్తన వైఫల్యం వల్ల పంటనష్టం జరిగితే సంబంధిత కంపెనీయే నష్ట పరిహారం చెల్లించే నిబంధనను బిల్లులో పొందుపరచాలనే సూచన వ్యక్తమౌతోంది.

రైతుకోసం చట్టం రావాలి

విత్తన చట్టం తీసుకువస్తున్నది విత్తనాన్ని ఉత్పత్తి చేసి, విత్తనాన్ని వినియోగించే  రైతుల కోసమా?  విత్తనంతో వ్యాపారం చేసే కంపెనీల కోసమా? అన్నది ప్రశ్న.  1998లో  ప్రపంచబ్యాంకు నిర్బంధిస్తే  అప్పటి తమిళనాడు ప్రభుత్వం ‘సమాచార హక్కు చట్టం’  తెచ్చింది.  కానీ అందులో పౌరులకు సులువుగా సమాచారం ఇచ్చేందుకు రూపొందించిన నిబంధనకన్నా సమాచారం నిరాకరించేందుకు పొందుపరిచిన నిర్బంధాలే ఎక్కువ!  పరిశోధనలు, పలు ధ్రువీకరణాల తర్వాత వివిధ రకాల విత్తనాలతో పంటలు పండించే ప్రక్రియలో పాల్గొనే ఇతరేతరులే కాకుండా మౌలికమైన రైతులు వారి ప్రయోజనాల పరిరక్షణ అంశాలన్నీ చట్టంలో పొందుపర్చాలి.  

ఆనాటి పరిస్థితుల్ని బట్టి 1966లో వచ్చిన ‘విత్తన చట్టం’ 1983లో వచ్చిన ‘విత్తన నియంత్రణ’ చట్టం అమలవుతున్న క్రమంలో వ్యవసాయంలో ఎన్నో మార్పులు వచ్చాయి.  వ్యవసాయ స్వరూపమే సమగ్రంగా మారింది.  మారిన పరిస్థితుల్ని బట్టి పలు విదేశీ, స్వదేశీ విత్తన కంపెనీలు మొత్తం వ్యవస్థను గుప్పెట్లోకి తీసుకున్నాయి. 

1990ల నుంచి జరుగుతున్న పరిణామంలో... 2004లో, 2010లో, 2017లో, 2019లో ఇలా పలుమార్లు కొత్త చట్టం తెచ్చేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. 2017లో  తెలంగాణ ప్రభుత్వం చట్టం తెచ్చేందుకు చేసిన యత్నమూ విఫలమైంది. దశాబ్దాల కార్పొరేట్‌‌ శక్తుల ఒత్తిళ్లను అధిగమించి ఇప్పుడొక కొత్త చట్టం అంటూ వస్తే... అది వారికి ప్రయోజనకరంగా కాకుండా రైతులకు మేలు చేసేదిగా ఉండాలి. రైతు హక్కుల్ని కాపాడి వ్యవసాయాన్ని గట్టెక్కిచ్చేదిగా ఉండాలని సమాజం కోరుకుంటోంది.

ధరల నియంత్రణలో అస్పష్టత

అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే విత్తనాల ధరల నియంత్రణకు అవకాశం (సెక్షన్‌‌ 22) ప్రతిపాదించారు.   విత్తనాల విక్రయ ప్రక్రియలో మాధ్యమికంగా ఉండే డీలరు, డిస్ట్రిబ్యూటర్‌‌, సెల్లర్‌‌... వంటి వారిని జాగ్రత్తగా ప్రస్తావించిన  బిల్లు  ముసాయిదా విత్తన ఉత్పత్తి రైతును,  పంటల్ని  వాణిజ్యస్థాయిలో  పండించే  రైతును సదరు విత్తన కొనుగోలుదారులుగా మాత్రం ప్రస్తావించలేదు. వారి హక్కుల గురించిగాని,  తగు భద్రత గురించిగాని ముసాయిదాలో  ఎక్కడా లేదు.  

‘కేంద్ర వ్యవసాయోత్పత్తుల ఖర్చుల -ధరల నియంత్రణ కమిషన్‌‌’ తాజా ధరల నివేదిక ప్రకారం రాష్ట్రంలో, దేశంలో విత్తన ధరలు ప్రతి ఏటా వ్యవసాయ ఇతర ఖర్చులకన్నా వేగంగా పెరుగుతున్నాయి. బ్రాండెడ్‌‌  కంపెనీలకు  విత్తనాలు  ఉత్పత్తి చేసిచ్చే  రైతులకు చెల్లించే ధరలకు,  వాటిని అంతిమంగా వినియోగ  రైతులకు అమ్మే ధరలకు పొంతనే ఉండడం లేదు. 

ఈ అంశాన్ని,  సంబంధాన్ని బిల్లులో నిర్దేశించాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. ఇది లేకపోవడం వల్లే ఒకవైపు విత్తనోత్పత్తి  రైతులు,  మరొకవైపు విత్తనాలు కొనుగోలు చేసి వాణిజ్య స్థాయిలో పంటలు  పండించే  రైతులు సంక్షోభం ఎదుర్కొంటున్నారు. పరిస్థితులు వికటించినప్పుడు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అత్యవసరాల్లోనే కాకుండా సాధారణ సమయాల్లో కూడా ఈ ధరలపైన నిఘా,  నియంత్రణ ఉండేలా ముసాయిదాను  మార్చాలనే  సూచన వస్తోంది.  విత్తన లోపం వల్ల పంట నష్టపోయినప్పుడు రైతుకు నష్టపరిహారం అంశాన్ని కూడా చట్టబద్ధం చేయాలనేది గట్టి ప్రతిపాదనగా ఉంది.

- దిలీప్‌‌ రెడ్డి,
పొలిటికల్‌‌ ఎనలిస్ట్‌‌, 
డైరెక్టర్‌‌, పీపుల్స్‌‌ పల్స్‌‌ రీసెర్చ్‌‌ సంస్థ