పంటలకు సాగు నీరు కోసం రైతుల ధర్నా

పంటలకు సాగు నీరు కోసం రైతుల ధర్నా

పంట పొలాలకు సాగు నీరందించాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లాలోని ఎండపల్లి రైతులు రహదారిపై ధర్నాకు దిగారు. రాజారాంపల్లి టు బసంత్ నగర్ ఎక్స్ రోడ్ పై బైఠాయించి, నిరసన తెలిపారు. ఈ ధర్నాకు పలువురు బీజేపీ నాయకులు మద్దతు తెలపగా.. ముంజంపల్లి, మారేడుపల్లి ఉండేడా గ్రామాల్లో సుమారు 400 ఏకరాల భూములు సాగు నీరందక ఎండిపోతున్నాయని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. అండర్ గ్రౌండ్ నిర్మాణాలు చేపట్టి పంట పొలాలకు నీరు అందకుండా ఎస్సారెస్పీ D83 మెయిన్ L6 కాలువను కూల్చివేశారని ఆరోపించారు. ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ నుంచి పంప్ హౌస్ ద్వారా సాగు నీరు అందించాలని రైతులు డిమాండ్ చేశారు. ఓ పక్క పంటలు ఎండుతుంటే  పంప్ హౌస్ లు రన్ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులందరం కలిసి ఎల్లంపల్లి ప్రాజెక్టు కోసం భూములు త్యాగం చేస్తే పరిహారం డబ్బులు కూడా ఇవ్వలేదని, కనీసం తమ పంట పొలాలకు సాగునీరు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పంప్ హౌస్ స్టార్ట్ చేసి ఎయిర్ వాల్స్ ద్వారా నీరు అందించాలని కోరారు. ఒకవేళ పంట పొలాలకు నీరు అందించలేనట్లయితే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.