వడ్లు కొనాలంటూ రైతుల ధర్నా

వడ్లు కొనాలంటూ రైతుల ధర్నా
  •     అన్​లోడ్​ సమస్యతో తిరిగిరాని లారీలు 
  •     కొనుగోళ్లు నిలిచిపోయి వానకు తడిసిన ధాన్యం  
  •     మొలకలు రావడంతో యాదాద్రి కలెక్టరేట్​ఎదుట ఆందోళన 

యాదాద్రి, వెలుగు : వడ్లను కొనాలని డిమాండ్​చేస్తూ యాదాద్రి జిల్లా ఆకుబావి తోట తండా రైతులు జిల్లా కలెక్టరేట్​ఎదుట మంగళవారం ఆందోళన నిర్వహించారు. అన్​లోడ్​సమస్య కారణంగా మిర్యాలగూడకు వెళ్లిన లారీలు తిరిగి రాకపోవడంతో వడ్ల కొనుగోళ్లు నిలిచిపోయాయి. రెండు రోజుల క్రితం వర్షం రావడంతో కొనుగోలు సెంటర్​లో ఉన్న వడ్లు తడిచిపోయి..మొలకలు వచ్చాయి. 

దీంతో ఆందోళన చెందిన రైతులు మొలకలు వచ్చిన వడ్లను బస్తాల్లో తీసుకొని కలెక్టరేట్​కు వచ్చి ఆందోళన చేశారు. పోలీసులు సర్దిచెప్పినా వినకపోవడంతో సివిల్​ సప్లయీస్​ డీఎం గోపీకృష్ణ అక్కడికి వచ్చి రైతులతో మాట్లాడారు. వడ్లు అన్​లోడ్ ​కాకపోవడం వల్ల వెళ్లిన లారీలు రాలేదని నచ్చజెప్పారు. ఇతర ప్రాంతాల నుంచి లారీలు తెప్పించి కొనుగోళ్లు వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు.