యూరియా కోసం రైతు తిప్పలు : బారులు తీరిన చెప్పులు

యూరియా కోసం రైతు తిప్పలు : బారులు తీరిన చెప్పులు

రాష్ట్ర రైతులను యూరియా కొరత వేధిస్తోంది. వ్యవసాయశాఖ ఆఫీసులు, గోదాములు, ఎరువుల షాపుల వద్ద అన్నదాతలు పడిగాపులు కాస్తున్నారు. గంటల తరబడి ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా ఇదే పరిస్థితి. లైన్లో చెప్పులు పెట్టి మరీ వేచి చూడాల్సిన దుస్థితి. అవసరానికి తగినంత యూరియాను అధికారులు సరఫరా చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు వ్యాపారులు కృత్రిమ కొరతను సృష్టిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారని వారు వాపోతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో యూరియా కోసం క్యూలు కట్టే పరిస్థితి ఉండేదని, తెలంగాణ రాష్ట్రంలో ఆ పరిస్థితి రాదని చెప్పిన ముఖ్యమంత్రి.. ఈ దుస్థితికి ఏం సమాధానం చెప్తారని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు.

తప్పిన అధికారుల అంచనాలు

రాష్ట్రంలో ఏటా సుమారు 15 లక్షల టన్నుల యూరియా అవసరమవుతుంది. ఈ సారి వానాకాలం సీజన్‌‌ అవసరాలను గుర్తించడంలో అధికారుల అంచనాలు తప్పాయి. గత జూన్‌‌లోనే లక్ష టన్నుల యూరియా రాష్ట్రానికి సరఫరా అయింది. అయితే ప్రారంభంలో వర్షాలు లేకపోవడం, సాగు పెద్దగా లేకపోవడంతో  రైతులు యూరియా కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు. దీంతో అధికారులు యూరియాపై పెద్దగా దృష్టి సారించలేదు. జులై నెలాఖరుకు వర్షాలు ప్రారంభమై ఆగస్టులోనూ భారీగా కురిశాయి. ఫలితంగా వరినాట్లు పెరిగి.. యూరియా అవసరం మరింత ఎక్కువైంది. ఆగస్టు నెల చివరి దశలోనే ఏకంగా 1.27 లక్షల టన్నుల యూరియా కొరత ఏర్పడినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ గుర్తించింది. అప్పటికే సమయం కాస్తా మించిపోయింది. రాష్ట్రంలో వానాకాలం ప్రారంభంలో 20 శాతం వరి సాగు కూడా జరుగలేదు. ఆగస్టు ప్రారంభం నుంచి వర్షాలు కురవడంతో వరి నాట్లు పెరిగాయి.

ఇప్పుడు అది 111శాతంగా నమోదైంది. రాష్ట్రంలో వరి సాధారణ సాగు 23.83లక్షల ఎకరాలు కాగా ఈ ఏడాది 26.48 లక్షల ఎకరాల్లో సాగు మొదలైంది. అంటే.. అదనంగా 3లక్షల వరకు సాగు విస్తీర్ణం పెరిగింది. వరి సాగు పెరగడంతో యూరియాకూ డిమాండ్​ పెరిగింది. ఇదే అదునుగా కొందరు వ్యాపారులు అందినకాడికి దోచుకుంటున్నారు.  ప్రైవేటు కంపెనీలు స్టాక్​ ఉన్నా.. కృత్రిమ కొరతను సృష్టిస్తున్నాయి. 45 కిలోల యూరియా బస్తా రూ. 266.50 కాగా.. దాన్ని రూ. 400 నుంచి 800 వరకు  అమ్ముతున్నాయి. కొన్ని ప్రాంతాల్లోనైతే  అంతకు ఎక్కువగానే దోచుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం యూరియా అవసరాలను సరిగ్గా అంచనా వేయకపోవడం.. కృత్రిమ కొరతను సృష్టిస్తున్నవారిపై చర్యలు తీసుకోకపోవడంతోనే ఈ సమస్య వచ్చిందని రైతు సంఘాలు అంటున్నాయి.

కేంద్రం ఇస్తున్నా.. జాగ లేదంటున్న రాష్ట్రం!

వానాకాలం సీజన్ లో 7.1 లక్షల టన్నుల యూరియా కావాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కేరింది. అయితే.. కేంద్రం 7.45 లక్షల టన్నుల యూరియాను అందుబాటులో ఉంచినట్లు చెప్పింది. సెప్టెంబర్​ నెలలో లక్ష టన్నులు అవసరం ఉంటుందని రాష్ట్ర సర్కార్​ అంచనా వేసి కేంద్రానికి పంపింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా కోరడంతో కేంద్ర ఎరువుల విభాగం (డీవోఎఫ్​) మొత్తంగా 2 లక్షల టన్నులను కేటాయించింది. ప్రతి నెలలో అవసరమైనంత యూరియాను అలాట్​ చేస్తున్నా.. నిల్వ చేసుకునేందుకు తగినంత చోటు లేదని
రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవడంలేదని  కేంద్రం అంటోంది.

నాలుగైదు రోజుల్లో సర్దుకుంటుంది: పార్థసారథి

ఇంపోర్టెడ్‌ యూరియా కేటాయింపుతో షిప్పింగ్‌ ద్వారా పోర్టుకు.. అక్కడి నుంచి రైల్వే ద్వారా సరఫరా జరుగడంతో వారం రోజుల పాటు ఆలస్యమైందని రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి అన్నారు. కేంద్రం తాజాగా 2 లక్షల టన్నులు కేటాయించిందని, వీటిలో 45 వేల టన్నుల సరఫరా జరుగుతోందని తెలిపారు.
ఈ నెల 2 నుంచి 10లోగా పూర్తిగా సరఫరా చేస్తామని కేంద్ర ఎరువుల శాఖ తెలిపిందని, ఇప్పటికే బుధవారం నిజామాబాద్‌కు ఒక ర్యాక్​ యూరియా వచ్చిందని వివరించారు. రోజు ఒక ర్యాక్​ చొప్పున  18 ర్యాక్​ల ద్వారా ఆయా ప్రాంతాలకు యూరియా చేరుతోందని, నాలుగైదు రోజుల్లో రాష్ట్రంలో రైతులందరికీ యూరియా అందుబాటులో ఉంటుందని భరోసా ఇచ్చారు. యూరియా కోసం ఆందోళన చెందవద్దని సూచించారు.

లక్ష టన్నుల ఎరువులు అడిగితే..రెండు లక్షలు ఇచ్చినం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం అడిగిన దానికంటే కేంద్రం నుంచి ఎక్కువ ఎరువులను కేటాయించామని.. కానీ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే యూరియా కోసం ఇబ్బందులు తలెత్తాయని కేంద్ర ఎరువుల శాఖ మంత్రి సదానందగౌడ చెప్పారు. సెప్టెంబర్​ నెలకు సంబంధించి లక్ష టన్నుల ఎరువులు కావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ కోరిందని, వీలైతే అదనంగా ఇవ్వాలని అడగడంతో.. తాము రెండు లక్షల టన్నులు కేటాయించామని తెలిపారు. బుధవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌‌  ఢిల్లీలో సదానందగౌడను కలిసి.. యూరియా సరఫరా అంశంలో కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్​చేస్తున్న ఆరోపణలను వివరించారు. ఈ సందర్భంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి కేటాయించిన యూరియా లెక్కలు, వివరాలను సదానంద విడుదల చేశారు.

అవసరానికి మించే ఎరువులున్నయ్..

ఈ ఏడాది ఖరీఫ్​ సీజన్​కు సంబంధించి సెప్టెంబర్​ తొలివారం వరకు రాష్ట్రానికి 7.1 లక్షల టన్నులు ఎరువులు అవసరమని.. కేంద్రం నుంచి 7.45 లక్షల టన్నులు సరఫరా చేశామని సదానందగౌడ వివరించారు. ఏ నెలకు అవసరమైన మేర ఆ నెలలో సరఫరా చేశామని, స్టోరేజీ సరిపోలేదంటూ రాష్ట్ర ప్రభుత్వమే యూరియాను తీసుకోలేదని స్పష్టం చేశారు. తాజాగా లక్ష టన్నులు అదనంగా కేటాయించామని తెలిపారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఇలా అదనంగా ఇస్తామని, తెలంగాణలో రైతులందరికీ ఎరువులు అందడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. ఈ నెల మొదట్లో పది రైల్వే ర్యాక్​ల ఎరువులు కావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ కోరితే.. 18 ర్యాక్​లు కేటాయించామని కేంద్ర మంత్రి తెలిపారు. ఇప్పటికే 5 ర్యాక్​ల ఎరువులు వచ్చాయని, మరో ఐదు రవాణాలో ఉన్నాయని.. మిగతావి కొద్దిరోజుల్లో వస్తాయని వివరించారు. కేంద్ర ఎరువుల శాఖ అధికారులు ఎప్పటికప్పుడు రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడి, పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు.

యూరియా పేరిట టీఆర్​ఎస్​ రాజకీయాలు

దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో లేని యూరియా కొరత, తెలంగాణ లో ఎందుకు ఏర్పడిందో రైతులకు కూడా అర్థమైందని లక్ష్మణ్​ అన్నారు. కృత్రిమంగా కొరతను సృష్టించి.. బీజేపీ ఎంపీలు గెలిచిన నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ స్థానాల్లో లబ్ధిపొందాలని టీఆర్ఎస్ సర్కార్ చూస్తోందని మండిపడ్డారు. ఫామ్​ హౌజ్, ప్రగతి భవన్ కే కేసీఆర్ పరిమితం కావడం ప్రజలకు తీవ్ర నష్టాన్ని మిగులుస్తోందన్నారు. ఎన్నికలు అయిపోగానే బీజేపీ రాజకీయాలను పక్కన పెట్టి.. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ నినాదంతో ముందుకువెళ్తున్నదని, ఇందుకు భిన్నంగా టీఆర్ఎస్ సర్కార్ మాత్రం సొంత వైఫల్యాలను కేంద్రంపై నెట్టాలని చూస్తోందని మండిపడ్డారు. మీడియా సమావేశంలో బీజేపీ నేతలు ప్రేమేందర్ రెడ్డి, ధర్మారావు, కాసం వెంకటేశ్వర్లు, నూనే బాల్​రాజు, రవీంద్ర నాయక్  పాల్గొన్నారు.