హైకోర్టును ఆశ్రయించిన 40 రైతు కుటుంబాలు 

హైకోర్టును ఆశ్రయించిన 40 రైతు కుటుంబాలు 

హైదరాబాద్, వెలుగు: పంట దిగుబడి రాక, పండిన పంటకు గిట్టుబాటు ధర లేక అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం చెల్లించేందుకు రాష్ట్ర సర్కారు దగ్గర డబ్బులు కరువయ్యాయి. ఆత్మహత్య చేసుకున్నోళ్లు రైతులేనని, వారంతా అప్పుల బాధతోనే సూసైడ్ చేసుకున్నారని రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ అధికారులతో కూడిన త్రీమెన్ కమిటీ తేల్చిచెప్పినా.. ప్రభుత్వం మాత్రం పరిహారం చెల్లించడం లేదు.రూ. 6 లక్షల ఎక్స్ గ్రేషియాకు సంబంధించి అధికారికంగా ప్రొసీడింగ్స్ ఇచ్చి ఏండ్లు గడుస్తున్నా బడ్జెట్ లేదనే సాకుతో పైసలు ఇవ్వడం లేదు. దీంతో బాధిత కుటుంబాలు చివరికి హైకోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

సర్కార్ దగ్గర డబ్బులు లేవట
ప్రభుత్వం గుర్తించిన  రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలకు కూడా ఎక్స్ గ్రేషియా ఇవ్వటానికి  నిధులు లేవంటూ ఏండ్ల తరబడి అధికారులు ఆఫీసుల చుట్టూ  తిప్పిచ్చుకుంటున్నారు. ఒక్క యాదాద్రి భువనగిరి జిల్లాల్లోనే ఎక్స్ గ్రేషియా రావాల్సిన రైతు కుటుంబాలు 50కి పైగా ఉన్నాయి. ప్రభుత్వ సాయం అందక, అప్పులు తీరక రైతు కుటుంబాలు తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నాయి. రైతు బీమా స్కీమ్ అమల్లోకి రావడానికి ముందు రాష్ట్రంలో ఎవరైనా రైతు ఆత్మహత్య చేసుకుంటే తహసీల్దార్, ఎస్సై, ఏవోతో కూడిన త్రీమెన్ కమిటీ ఇచ్చే ఎంక్వైరీ రిపోర్ట్ ఆధారంగా.. అది అప్పుల బాధతో జరిగిన ఆత్మహత్యా? లేక ఇతర కారణాలతో జరిగిందా?.. అనే విషయాన్ని తేల్చేవారు. 

కలెక్టర్ కు నివేదిక పంపితే బాధిత రైతు కుటుంబాలకు రూ. 6 లక్షల ఎక్స్ గ్రేషియా మంజూరు చేస్తూ ప్రొసీడింగ్స్ ఇచ్చేవారు. ప్రభుత్వం విడుదల చేసే బడ్జెట్ ను బట్టి.. వారి అకౌంట్లలో డబ్బులు జమ చేసేవారు. ఇలా తెలంగాణ ఏర్పాటు తర్వాత 2014 జూన్ 2 నుంచి 2017 ఆగస్టు 31 వరకు అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో 2,066 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వీటిలో త్రీమెన్ కమిటీ 1,309 మంది రైతుల ఆత్మహత్యలపై విచారించి.. వీరిలో 1,149 మంది రైతులు అప్పుల బాధ, పంట నష్టంతోనే సూసైడ్ చేసుకున్నట్లు నిర్ధారించింది. రెండు దఫాల్లో 842 మందికి ఎక్స్ గ్రేషియా చెల్లించింది. మరో 307 మందికి సంబంధించిన ఎక్స్ గ్రేషియా పెండింగ్ లో ఉండిపోయింది. ఆ తర్వాత రైతు బీమా స్కీమ్ వచ్చేనాటికి 19 నెలల కాలంలో మరో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అంచనా.

త్రీమెన్ కమిటీ నిర్ధారించిన రైతు కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా మంజూరు చేస్తూ వివిధ జిల్లాల కలెక్టర్లు అప్పట్లో ప్రొసీడింగ్స్ జారీ చేశారు. కానీ వీరికి బడ్జెట్ లేదనే సాకుతో ప్రభుత్వం పరిహారం చెల్లించలేదు. కలెక్టరేట్ల చుట్టూ తిరిగితిరిగి విసిగిపోయిన రైతు కుటుంబాలు 2019లో రైతు స్వరాజ్య వేదిక, మానవ హక్కుల వేదిక సాయంతో హైకోర్టును ఆశ్రయించాయి. హైకోర్టు జోక్యంతో అప్పట్లో 243 కుటుంబాలకు పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం బడ్జెట్ రిలీజ్ చేసింది. కానీ ఇంకా మరో 250 కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లించలేదు. పరిహారం ఎందుకు ఇవ్వడం లేదని కలెక్టర్లను ఆర్టీఐ కింద సమాచారం అడిగితే నో బడ్జెట్ అని సమాధానమిచ్చారు. ఈ క్రమంలోనే ఎక్స్ గ్రేషియా ప్రొసీడింగ్స్ కలిగిన 40 మంది రైతు కుటుంబాలతో మరోసారి రైతు స్వరాజ్య వేదిక నాయకులు హైకోర్టును ఆశ్రయించారు.

ప్రొసీడింగ్స్‌‌‌‌​ ఇచ్చి మూడేండ్లాయె
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం చందుపట్ల గ్రామానికి చెందిన తోటకూరి నరసింహా అనే రైతు తనకున్న 2.18 ఎకరాల్లో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. వ్యవసాయ పెట్టుబడుల కోసం రూ. 3.17 లక్షల అప్పు చేశాడు. పంట దిగుబడి సరిగా రాకపోవడంతో తీవ్రంగా నష్టపోయిన ఆయనకు అప్పులు తీర్చడం భారంగా మారింది. అప్పుల బాధ భరించలేక 2017 ఏప్రిల్ 25న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన అప్పుల బాధతోనే చనిపోయాడని మండల స్థాయి త్రీమెన్ కమిటీ నిర్ధారించి, ఎక్స్ గ్రేషియా కోసం కలెక్టర్ కు సిఫార్సు చేసింది. ఈ నివేదిక ఆధారంగా 2018 ఏప్రిల్ 19న కలెక్టర్ ఎక్స్ గ్రేషియా ప్రొసీడింగ్స్ ఆర్డర్ ఇచ్చారు. ఇప్పటికీ నరసింహ భార్య నాగమణికి పరిహారం అందలేదు. 

ప్రొసీడింగ్​ ఇచ్చి.. పైసలియ్యలే
ఈ ఫొటోలోని మహిళ పేరు గవ్వల మంజుల. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలన్ పాకకు చెందిన ఈమె భర్త యాదగిరి తనకున్న నాలుగెకరాల భూమిలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. పంట పెట్టుబడి కోసం రూ.4,82,000 అప్పు చేశాడు. పంట దిగుబడి రాక అప్పుల బాధతో 2015 అక్టోబర్ 10న పురుగు మందు తాగి ప్రాణాలు విడిచాడు. మండల స్థాయి త్రీమెన్ కమిటీ ఎంక్వైరీ చేసి అప్పుల బాధతోనే యాదగిరి సూసైడ్ చేసుకున్నాడని తేల్చింది. కమిటీ రిపోర్ట్ ఆధారంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ 2018 మే 8న ఆ కుటుంబానికి రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా, అప్పులు తీర్చడానికి మరో లక్ష  మంజూరు చేస్తూ ప్రొసీడింగ్​ ఆర్డర్ ఇచ్చారు. కానీ ఇప్పటికీ యాదగిరి ఫ్యామిలీకి పరిహారం అందలేదు.