యూరియా కోసం రైతుల తండ్లాట..కూపన్ల పంపిణీలో తోపులాట

యూరియా కోసం రైతుల తండ్లాట..కూపన్ల పంపిణీలో తోపులాట
  • ఖమ్మం జిల్లా కారేపల్లి సొసైటీకి 3 వేల మంది 
  • కూపన్ల పంపిణీలో తోపులాట.. ఏవోకు గాయాలు
  • ఖమ్మం జిల్లా కారేపల్లి సొసైటీకి 3 వేల మంది రైతులు

కారేపల్లి, వెలుగు: యూరియా అందక రైతులు ఇబ్బందులు పడ్తున్నారు. స్టాక్ వచ్చిందని తెలిసి శుక్రవారం ఖమ్మం జిల్లా కారేపల్లి సొసైటీ కార్యాలయానికి రైతులు భారీగా తరలివచ్చారు. గత 10 రోజులుగా యూరియా లేకపోవడం, ఇప్పుడు వచ్చిన రెండు లోడ్ల స్టాక్‌‌‌‌కు కూపన్లు ఇస్తున్నారని తెలియడంతో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 3 వేల మందికి పైగా రైతులు సొసైటీ కార్యాలయానికి చేరుకున్నారు.

 భారీ సంఖ్యలో తరలివచ్చిన రైతులను పోలీసులు కంట్రోల్ చేయలేకపోయారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. రైతులు ఒకరినొకరు తోసుకుంటూ వెళ్లి ఏవో అశోక్‌‌‌‌పై పడ్డారు. దీంతో ఆయనకు స్వల్ప గాయాలు కావడంతో స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకొని ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి కారేపల్లికి వచ్చారు. యూరియా కూపన్ల పంపిణీ సరిగా జరిగేలా ప్రణాళిక సిద్ధం చేశారు. మండల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి రైతులందరి పేర్లను గ్రామాల వారీగా నమోదు చేసుకున్నారు. 2 రోజుల్లో గ్రామాలకే అధికారులు వచ్చి, కూపన్లు పంపిణీ చేస్తారని రైతులను ఒప్పించడంతో వారు తిరిగి వెళ్లిపోయారు.