రైతులు సాంగ్లీకి వెళ్లి పసుపు అమ్ముకుంటున్నారు

రైతులు సాంగ్లీకి వెళ్లి పసుపు అమ్ముకుంటున్నారు

ఆదిలాబాద్, వెలుగు: బీజేపీ ఆదివాసీ మహిళను రాష్ట్రపతిని చేస్తే.. కేసీఆర్ ప్రభుత్వం పోడు చేసుకుంటున్న ఆదివాసీ ఆడబిడ్డలను చీరలు పట్టుకొని బయటకు లాగుతోందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్​ఫైర్​అయ్యారు. ‘పల్లె గోస.. బీజేపీ భరోసా’లో భాగంగా బుధవారం ఆయన ఆదిలాబాద్​జిల్లా బేల మండలం పాత సాంగిడి, కొత్త సాంగిడి, బేదోడా, ఖంగర్ పూర్, గూడ, మణియార్ పూర్, దహెగావ్, ఖోగ్దూర్, పాటన్, కొబ్బాయ్, మాంగ్ రూర్, చప్రాల గ్రామాల్లో పర్యటించారు. ఎమ్మెల్యే జోగు రామన్నకు చెప్పిందే చెప్పుడు, చేసిందే చేసుడు అలవాటైందన్నారు. బీజేపీ భరోసా మొదటి రోజు కార్యక్రమాన్ని చూసి బిత్తరపోయిండని ఎద్దేవా చేశారు. చెల్లని రూపాయని తనను అనడం కాదని, నిజామాబాద్ జనం కేసీఆర్ బిడ్డను చెల్లని రూపాయి చేసిన విషయం గుర్తుంచుకోవాలన్నారు. కవిత పసుపు బోర్డు చెప్పి ఓట్లు వేయించుకుందని, లేదంటే బీజేపీకి రెండు లక్షల మెజారిటీ వచ్చేదన్నారు.

రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే అంతర్జాతీయ పసుపు రంగాన్ని శాసించే స్థాయికి తెలంగాణను తీసుకెళ్తామన్నారు. మార్కెట్​లో సదుపాయాలు కల్పించకపోవడంతోనే రైతులు సాంగ్లీకి వెళ్లి పసుపు అమ్ముకుంటున్నారని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ గురించి మాట్లాడే అర్హత టీఆర్ఎస్ కు లేదన్నారు. కార్పొరేటర్లను కోట్లుపెట్టి కొన్నారని, బీజేపీ ఎక్కడ సభ పెడితే అక్కడ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్, జిల్లా ఇన్​చార్జి అల్జాపూర్ శ్రీనివాస్, లీడర్లు సుహాసిని రెడ్డి, దత్త నిక్కమ్, రాకేశ్, నవీన్, లోక ప్రవీణ్ రెడ్డి, దశరథ్, నగేశ్ రెడ్డి, లాలా మున్న, రత్నాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.