రామాయంపేట, వెలుగు: తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని బాధిత రైతులు డిమాండ్ చేశారు. గురువారం రామాయంపేట మండలం డి. ధర్మారంలో వడ్ల తట్టలతో రాస్తారోకో చేశారు. రెండు గంటల పాటు రోడ్డుపై బైఠాయించడంతో రామాయంపేట, గజ్వేల్ రూట్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తాము 20 రోజుల ముందు వరి కోతలు మొదలు పెడితే వారం కింద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారని మండిపడ్డారు. కానీ, ఇప్పటి వరకు గింజ కూడా కొనలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన వానకు తడిసి మొలకలు వచ్చాయని వాపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ, అగ్రికల్చర్ అధికారులు అక్కడకు చేరుకుని వెంటనే కొనుగోళ్లు ప్రారంభిస్తామని హామ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
రైతులకు పరిహారం ఇవ్వాలి
కొండాపూర్, వెలుగు: అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఓఎంవైఎస్ టీమ్ మెంబర్స్ కోరారు. గురువారం కొండాపూర్ తహసీల్దార్ ఆశాజ్యోతికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఓయంవైస్ టీమ్ లీడర్ మల్లేశ్ యాదవ్ మాట్లాడుతూ జిల్లాలో చెడగొట్టు వానలకు వరి, జొన్న, మామిడి, బొప్పాయి, అరటి, ఉల్లి రైతులు తీవ్రంగా నష్టపోయారని, సర్కారు వెంటనే పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సి కోనాపూర్ ఉప సర్పంచ్ మల్లేశం పాల్గొన్నారు.
కొలేకోలేని దెబ్బతీసిన వడగళ్ల వాన
మెదక్ (శివ్వంపేట, కౌడిపల్లి), వెలుగు: వడగళ్ల వాన కొలుకోలేని దెబ్బతీసిందని, సర్కారే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. గురువారం శివ్వంపేట మండల కేంద్రానికి చెందిన రైతు లక్ష్మీనర్సయ్య మొలకెత్తిన వడ్లను చూపించి కన్నీళ్లు పెట్టుకున్నాడు. మూడెకరాల్లో వరిపంట కోసి వడ్లు కుప్ప పెట్టానని, వానకు నాని 10 క్వింటాళ్ల వరకు మొలకెత్తాయని ఆవేదన వ్యక్తం చేశాడు. అలాగే రత్నాపూర్ గ్రామానికి చెందిన కౌలు రైతు ఆంజనేయులు తాను రెండెకరాలు కౌలుకు తీసుకొని రూ.50 వేలు అప్పుచేసి పంట వేశానని, ఇప్పుడు గింజ కూడా చేతికొచ్చే పరిస్థితి లేదని సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
పొలంయజమానికి ఏమివ్వాలి..? తెచ్చిన అప్పు ఎలా కట్టాలని కన్నీళ్లు పెట్టుకున్నాడు. కౌడిపల్లి మండలం రాజిపేట, తిమ్మాపూర్ గ్రామాల రైతులు మాట్లాడుతూ కోత కోసి 20 రోజులైనా అధికారులు కాంటా పెట్టడం లేదని మండిపడ్డారు. రాజిపేటలో మల్లేశ్ యాదవ్, శివ, బిక్షపతి గౌడ్ చెందిన వడ్లు తడిసి మొలకలు వచ్చాయి. టార్పాలిన్లు ఇవ్వకపోవడంతో కవర్లు కిరాయికి తెచ్చి వడ్ల కుప్పల మీద కప్పుతున్నామని వాళ్లు వాపోయారు.