రైతులకు పరామర్శలే తప్ప పరిహారం ముచ్చట్లేదు

రైతులకు పరామర్శలే తప్ప పరిహారం ముచ్చట్లేదు
  • తామర పురుగు​ నష్టం రూ.2 వేల కోట్లు
  • అప్పుల బాధతో ప్రాణాలు తీసుకుంటున్న అన్నదాతలు

ఖమ్మం, వెలుగు: ఈ ఏడాది మిర్చి రైతులను తామర, అకాల వర్షాలు నిండా ముంచాయి. తామర పురుగు కారణంగానే రెండు లక్షలకు పైగా  ఎకరాల్లో మిర్చి పంట పాడైంది. రాష్ట్రవ్యాప్తంగా మూడున్నర లక్షల ఎకరాల్లో మిర్చి పంట సాగు చేశారు. తామర పురుగు కారణంగా పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని రైతులు నష్టపోయారు. రాష్ట్రం మొత్తం మీద ఈ నష్టం విలువ రూ.2 వేల కోట్ల వరకు ఉంటుందని రైతు సంఘాల నేతలు అంచనా వేస్తున్నారు. అయినా ఇప్పటివరకు పంట నష్టపోయిన మిర్చి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నా సర్కారు పట్టించుకోకపోవడంపై అన్నదాతల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రెండు నెలలుగా రాష్ట్రంలో బలవన్మరణాలకు పాల్పడుతున్న రైతుల్లో ఎక్కువ మంది మిర్చి సాగు చేసి నష్టపోయినవాళ్లే ఉన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోనే గత రెండు నెలల్లో 9 మంది మిర్చి రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఇందులో కౌలు రైతులు కూడా ఉన్నారు.

సైంటిస్టులూ ఏం తేల్చలే..
రాష్ట్రంలో ప్రతి ఏటా యావరేజీగా 2 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు చేసేవారు. గతేడాది క్వింటా ఎండు మిర్చి రూ.22 వేల వరకు పలకడంతో ఈసారి సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. అంతకుముందు ఏడాది కంటే అదనంగా మరో లక్షకు పైగా ఎకరాల్లో మిర్చి తోటలు వేశారు. రాష్ట్రం మొత్తం మీద మూడున్నర లక్షల ఎకరాల్లో పంట వేయగా అత్యధికంగా ఖమ్మం జిల్లా పరిధిలోనే 1.03 లక్షల ఎకరాల్లో మిర్చి సాగైంది. తామర తెగులు వ్యాపించి పూత, కాయల్లో రసం మొత్తం పీల్చేస్తుండడంతో రెండ్రోజులకో పురుగు మందు చొప్పున కొట్టుకుంటూ పోయారు. సైంటిస్టులు కూడా తామరను అరికట్టే విధానాన్ని స్పష్టంగా చెప్పకపోవడంతో మార్కెట్లో ఉన్న మందులన్నీ ట్రై చేశారు. దీంతో రైతులకు పెట్టుబడులు భారీగా పెరిగాయి. ఎన్ని మందులు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో మిర్చి తోటలను పీకేసి, మక్క, పెసర, సోయా వంటి ప్రత్యామ్నాయ పంటలు కొందరు సాగు చేస్తున్నారు. పలు వ్యవసాయ యూనివర్శిటీల నుంచి సైంటిస్టులు వచ్చి జిల్లాల్లో తిరిగి పరిశీలన చేసినా, ఇంత వరకు ఏమీ తేల్చలేదు. మరో వైపు రైతులు మాత్రం ప్రభుత్వం తమను ఆదుకుంటుందని ఆశతో ఎదురు చూస్తున్నారు. 
ఆందోళనలు చేసినా పట్టించుకుంటలేరు
అకాల వర్షాలతో ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో దెబ్బతిన్న పంటల గురించి తెలుసుకోవడానికి నాలుగు రోజుల క్రితం ఆ జిల్లాలో మంత్రులు పర్యటించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి, పంట నష్టం వివరాలపై అధికారులతో మాట్లాడారు. కానీ తామర వల్ల అంతకు రెట్టింపు ఎకరాల్లో నష్టపోయిన మిర్చి రైతుల గురించి మాత్రం ఎవరికీ పట్టడం లేదు. ప్రతి ఏటా వచ్చే దిగుబడిలో ఈసారి పదో వంతు కూడా రావడం లేదని ఓ వైపు రైతులు కన్నీళ్లు పెట్టుకున్నా, కనీసం పట్టించుకోవడం లేదు. కొన్ని జిల్లాల్లో రైతు సంఘాలు, లెఫ్ట్​ పార్టీల ఆధ్వర్యంలో మిర్చి రైతులు పంట నష్ట పరిహారం కోసం ఆందోళనలు, నిరసనలు చేపడుతున్నారు. జిల్లా కలెక్టర్​సహా ఉన్నతాధికారులకు వినతిపత్రాలు ఇస్తున్నారు. ఫసల్ బీమా పథకం, మరేదైనా ఇన్స్యూరెన్స్​ స్కీమ్​అమలు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని రైతు సంఘాల నేతలు కామెంట్ చేస్తున్నారు.  రాష్ట్రవ్యాప్తంగా కనీసం ఎన్ని ఎకరాల్లో మిర్చి పంటకు నష్టం జరిగిందన్న అంచనాలు కూడా ఆఫీసర్లు స్పష్టంగా చెప్పడం లేదు. ప్రభుత్వం నుంచి ఈ వివరాలు సేకరించాలని ఎలాంటి ఆదేశాలు లేవని మాత్రమే చెబుతున్నారు.

ఎకరాకు రూ. లక్ష ఇయ్యాలె
తామరను అరికట్టడంలో సైంటిస్టులు పూర్తిగా విఫలం కావడం వల్లే పంటలు దెబ్బతిని రైతులు నష్టపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంటల బీమా పథకం అమలు చేయకపోవడంతో లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినా, కనీసం పరిహారం పొందే అవకాశం రైతులకు లేకుండా పోయింది. ప్రకృతి వైపరీత్యాల కింద పరిగణనలోకి తీసుకుని మిర్చి రైతులకు ఎకరాకు రూ. లక్ష పరిహారం చెల్లించాలి. – బొంతు రాంబాబు, తెలంగాణ రైతు సంఘం, ఖమ్మం జిల్లా అధ్యక్షుడు

ప్రభుత్వం ఆదుకోవాలి
రెండెకరాలు కౌలుకు తీసుకొని మిర్చి పంట సాగు చేశా. తెగుళ్లు సోకడం వల్ల రూ.2 లక్షల వరకు నష్టపోయా. అప్పు తెచ్చి కౌలు డబ్బులు చెల్లించా. అప్పులు ఎలా తీర్చాలో తెలియడం లేదు. ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకోవాలి.   – శిల్ప బ్రహ్మం, బాణాపురం, ముదిగొండ మండలం