నాదీ సమ్మక్క తల్లి గోత్రమే.. నా తల్లి పేరూ సమ్మక్కనే..! మంత్రి సీతక్క భావోద్వేగం

నాదీ సమ్మక్క తల్లి గోత్రమే.. నా తల్లి పేరూ సమ్మక్కనే..! మంత్రి సీతక్క భావోద్వేగం
  • కోటొక్క భక్తుల కొంగు బంగారం మేడారం వనదేవతలు 
  • ఆదివాసీ సంప్రదాయం ప్రకారమే గద్దెల మార్పు
  • వచ్చే జాతరకు దేదీప్యమానంగా అమ్మవార్ల దర్శనం
  • మంత్రి సురేఖ అక్కతో ఎలాంటి విభేదాలు లేవు.. 
ములుగు, వెలుగు : “ సమ్మక్క సారలమ్మలు నా ఇలవేల్పులు.. సమ్మక్క గోత్రం నాది ఒక్కటే.. నా తల్లిదండ్రులు, నేను పూర్వజన్మలో చేసుకున్న  పుణ్యం.. నా తల్లి పేరు కూడా సమ్మక్కనే.. అలాంటి మహిమగల్ల తల్లులు సమ్మక్క, సారలమ్మ చరిత్రను తరతరాలకు తెలిసేలా కంకణం కట్టుకున్నా..” అని మంత్రి సీతక్క భావోద్వేగంతో పేర్కొన్నారు. 
 
గురువారం (అక్టోబర్ 16) ములుగు క్యాంపు ఆఫీసులో ఆమె మీడియాతో మాట్లాడారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం తన సెగ్మెంట్ లో నే ఉండడం గర్వకారణంగా ఉందని వ్యక్తం చేశారు. ప్రతిసారి జరిగే మహా జాతరలో భక్తులు ఇబ్బందులకు గురయ్యే విషయాలను దృష్టిలో పెట్టుకొని మాస్టర్ ప్లాన్ అమలు చేసి మేడారం అభివృద్ధికి సీఎం రేవంత్​ రెడ్డి సంకల్పించారని పేర్కొన్నారు.
 
 పూజారులు, ఆదివాసీ పెద్దలు, ప్రభుత్వ పెద్దలు ఆలోచనలతో  గద్దెల మార్పు, పరిసరాల అభివృద్ధి, అమ్మవార్ల గద్దెలు, పగిడిద్ద రాజు, గోవిందరాజుల గద్దెలు ఒకే వరుసలో ఉండేందుకు నిర్ణయించారని తెలిపారు.  వెయ్యేండ్లు చరిత్రలో నిలిచేలా అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. భక్తులతో పాటు ఆదివాసీల భవిష్యత్ తరాలకు తెలిసేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.  ఆదివాసుల సంస్కృతి  మార్పు చెందుతుండగా.. ప్రత్యేక రాతి శిలలపై చరిత్ర చెక్కించనున్నట్టు వివరించారు.  
 
భక్తుల రద్దీ, ట్రాఫిక్ ఆంక్షల ఇబ్బందులను తొలగించేందుకు ప్రత్యేకంగా ఆలయం ప్రాంగణం విస్తీర్ణం పెంచడంతోపాటు చుట్టూ రోడ్లు వేస్తున్నామని చెప్పారు. మేడారం ఖ్యాతిని ప్రపంచానికి చాటేలా  నిర్మాణం చేస్తున్నామని అన్నారు.  మాస్టర్ ప్లాన్ అమలుపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని,  చాలామందికి ఆదివాసీల చరిత్ర, జీవన విధానం తెలియదని తెలిపారు.  ఏ పుణ్యక్షేత్రమైనా ఒక విశిష్టత ఉంటుందని పేర్కొన్నారు.  మంత్రి సురేఖ, తాను అక్కా చెల్లెళ్లలా కలిసుంటామని, తమను సీఎంతోపాటు మంత్రులు సమ్మక్క,-సారలమ్మలతో పోల్చుతారని పేర్కొన్నారు.  తమ మధ్య విభేదాలు ఏమీ లేవని, కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
 

రామప్ప ఖ్యాతిని ప్రపంచానికి చాటాలి:

 
వెంకటాపూర్( రామప్ప) : రామప్ప ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) పిలుపునిచ్చారు. యునెస్కో  గుర్తింపు పొందిన రామప్ప టెంపుల్ లో తొమ్మిది రోజులుగా తెలంగాణ టూరిజం  నిర్వహిస్తున్న ‘ వరల్డ్ హెరిటేజ్ వలంటీర్ క్యాంపెయిన్’ శిక్షణ శిబిరాన్ని గురువారం మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మంత్రి .. మాట్లాడుతూ.. కాకతీయుల చరిత్రను దేశ విదేశాల నుంచి వచ్చిన విద్యార్థులు నేర్చుకున్న ప్రతీ అంశం తమ సొంత ప్రాంతాలకు వెళ్లిన తర్వాత వివరించాలని సూచించారు.  
 
ఇంటాక్​కన్వీనర్​ ప్రొఫెసర్ పాండురంగారావు, అసిస్టెంట్ టూరిజం ప్రమోషన్ ఆఫీసర్ కుసుమ సూర్యకిరణ్ , వరంగల్​ ఎన్ఐటీ ప్రొఫెసర్ వెంకట్ రెడ్డి జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టంపై, ట్రైబల్ వర్సిటీ వైస్ ఛాన్సలర్ వైఎల్.శ్రీనివాస్ టూరిజం కల్చర్ హెరిటేజ్​పై వివరించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్   రవి చందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి పాల్గొన్నారు.