
హైదరాబాద్: వచ్చే ఏడాది జరగనున్న విమెన్స్ హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్ టోర్నీని హైదరాబాద్‌లో నిర్వహించే అవకాశాలున్నాయి. ఈ మేరకు హాకీ ఇండియా ప్రతినిధులు రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరిని అధికారిక నివాసంలో కలిసి చర్చించారు. హాకీ ఇండియా ప్రతినిధులు గచ్చిబౌలి, బేగంపేట్‌లోని హాకీ స్టేడియాలను పరిశీలించారు.
గచ్చిబౌలి స్టేడియంలోని సౌకర్యాలపై వాళ్లు సంతృప్తి వ్యక్తం చేశారు. క్వాలిఫయర్ టోర్నీకి ఈ వేదిక అనుకూలంగా ఉందని గుర్తించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 15 మధ్యలో ఈ టోర్నీ జరిగే అవకాశం ఉంది. ఇందుకోసం చేపట్టాల్సిన పనులపై హాకీ ఫెడరేషన్ ప్రతినిధులు, స్పోర్ట్స్ అథారిటీ అధికారులు చర్చించారు.
వీటిపై నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. ఇక తెలంగాణలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీల నిర్వహణకు ముందుకు వచ్చే ఫెడరేషన్లకు సంపూర్ణ సహకారం అందిస్తామని మంత్రి పేర్కొన్నారు.