బీసీ బంద్కు కాంగ్రెస్ మద్దతిస్తది..42% రిజర్వేషన్లకుకట్టుబడి ఉన్నం: మహేశ్ గౌడ్

బీసీ  బంద్కు కాంగ్రెస్ మద్దతిస్తది..42% రిజర్వేషన్లకుకట్టుబడి ఉన్నం: మహేశ్ గౌడ్
  •     బీజేపీ, బీఆర్ఎస్ నేతలే అడ్డుపడ్తున్నరని ఫైర్
  •     రిజర్వేషన్ల కోసం బీజేపీపై ఒత్తిడి పెంచుతాం: ఆర్.కృష్ణయ్య

హైదరాబాద్, వెలుగు: బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు కోసం బీజేపీపై ఒత్తిడి పెంచేందుకు బీసీ జేఏసీ ఈ నెల 18న ఇచ్చిన రాష్ట్రవ్యాప్త బంద్ కు కాంగ్రెస్ సంపూర్ణంగా మద్దతు ఇస్తుందని పీసీసీ చీఫ్​మహేశ్ గౌడ్ వెల్లడించారు. గాంధీ భవన్ లో మహేశ్ గౌడ్ తో బీసీ సంఘాల నేతలు ఆర్.కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్, ఇతర నాయకులు గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మహేశ్ గౌడ్ మాట్లాడారు.

 బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు కోసం కాంగ్రెస్ కట్టుబడి ఉందని, తమ వాదనలను హైకోర్టులో కూడా బలంగా వినిపిస్తామని చెప్పారు. ‘‘తెలంగాణ ప్రజలు మేల్కొనేందుకు బీసీ సంఘాలు ఇచ్చిన బంద్ కు తమ పార్టీ మద్దతు ఇస్తున్నది. దీన్ని ప్రజలు సంపూర్ణంగా విజయవంతం చేసి బీసీల శక్తిని చాటాలి. కామారెడ్డి డిక్లరేషన్ కు కాంగ్రెస్ కట్టుబడి ఉంది. బీసీ రిజర్వేషన్ల విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తేలేదు. బీజేపీ, బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందంతోనే బీసీ రిజర్వేషన్లకు ఆ పార్టీ నేతలు అడ్డుపడ్తున్నరు. 

రాజకీయాలు కేవలం ఎన్నికల వరకు మాత్రమే. బీసీ రిజర్వేషన్ల విషయంలో అన్ని పార్టీల బీసీలంతా ఏకం కావాలి’’అని మహేశ్ గౌడ్ పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్ల అమలు కోసం బీజేపీపై ఒత్తిడి పెంచుదామని ఆర్.కృష్ణయ్య అన్నారు. అందుకే ఈ నెల 18న బీసీ సంఘాలు జేఏసీగా ఏర్పడి బంద్ కు పిలుపునిచ్చామని చెప్పారు.

సీపీఎం నేతలతో పీసీసీ చీఫ్ భేటీ

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని, బీసీ రిజర్వేషన్ల అమలు కోసం సపోర్ట్ ప్రకటించాలని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ సీపీఎం నేతలను కలిసి విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సీపీఎం ఆఫీస్​కు వెళ్లిన పీసీసీ చీఫ్.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డితో పాటు ఆ పార్టీ నేతలను కలిశారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు.