
హైదరాబాద్: ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్)లో హైదరాబాద్ బ్లాక్ హాక్స్ రెండో విజయాన్ని అందుకుంది. గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో బ్లాక్ హాక్స్ 3–1 (15–13, 20–18, 15–17, 15–9)తో గోవా గార్డియన్స్‌పై గెలిచింది. దీంతో ఏడు పాయింట్లతో పట్టికలో ఆరో ప్లేస్‌కు చేరింది. తొలి సెట్‌లో నిరాశపర్చిన బ్లాక్ హాక్స్ ప్లేయర్లు తర్వాతి మూడు సెట్లలో అద్భుతంగా ఆడారు.
గోవా ప్లేయర్లు అనవసర తప్పిదాలతో పాయింట్లు సమర్పించుకున్నారు. యుడి యమమోటో, సాహిల్ పదేపదే దాడులు చేసి హైదరాబాద్‌ను ఆధిక్యంలో ఉంచారు. గార్డియన్స్‌కు చెందిన నేథానియల్ డికిన్సన్, చిరాగ్ యాదవ్ శక్తివంతమైన స్పైక్‌లు కొట్టారు.
దుష్యంత్ సింగ్ సూపర్ సర్వ్‌తో మూడో సెట్‌లో గోవా స్వల్ప ఆధిక్యంలోకి వెళ్లినా హైదరాబాద్ వరుస పాయింట్లతో అంతరాన్ని క్రమంగా తగ్గించింది. ప్రిన్స్, గౌరవ్ యాదవ్ కీలక పాత్ర పోషించారు. శిఖర్ సింగ్ బ్లాకింగ్ నైపుణ్యాన్ని చూపెట్టాడు.