48 గంటల్లో ఇస్తమన్నరు..10 రోజులైనా ఇవ్వట్లే

48 గంటల్లో ఇస్తమన్నరు..10 రోజులైనా ఇవ్వట్లే
  • టెక్నికల్ సమస్యలే అంటున్న ఆఫీసర్లు
  • బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న రైతులు

హైదరాబాద్, కరీంనగర్, వెలుగు‘రైతులు సర్కారు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే వడ్లు అమ్ముకోవాలె.. వడ్లను కాంటా పెట్టిన 48 గంటల్లో అకౌంట్లలో పైసలు జమ చేస్తం..’ అని మంత్రులు, ఉన్నతాధికారులు ఇచ్చిన హామీ అమలైతలేదు. నాలుగైదు జిల్లాల్లో తప్ప చాలా జిల్లాల్లో  పది నుంచి 20 రోజులు గడుస్తున్నా ఖాతాల్లో పైసలు పడ్తలేవు.  టెక్నికల్​సమస్యల వల్లే లేటవుతోందని ఆఫీసర్లు చెబుతుండగా, యాసంగి పెట్టుబడులకు పైసలు లేక రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు.

ఇప్పటివరకు కొన్నదే తక్కువ..

రాష్ట్రంలో 6,640 సెంటర్ల ద్వారా వడ్లు కొనాలని సివిల్‌‌‌‌ సప్లయ్స్​ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ నిర్ణయించింది. ప్రస్తుతం స్టేట్​ వైడ్​ ఐకేపీ సెంటర్లు, పీఏసీఎస్, మార్కెట్‌‌‌‌ యార్డుల్లో కలిపి 5,680 కొనుగోలు కేంద్రాల ద్వారా వడ్లు కొంటున్నారు. ఈ సీజన్​లో 75 లక్షల టన్నుల వడ్లు కొనాలని టార్గెట్ పెట్టుకోగా, ఇప్పటివరకు కేవలం 23.2 లక్షల టన్నులు మాత్రమే కొన్నారు. సన్న వడ్లను దాదాపు మిల్లర్లకే అప్పజెబుతూ దొడ్డు రకాలే కొంటున్న ప్రభుత్వం వాటి పైసలను కూడా సకాలంలో రైతుల అకౌంట్లలో వేయలేకపోతోంది.

10 నుంచి 20 రోజులు

కొనుగోలు కేంద్రాల్లో వడ్లను అమ్మిన 48 గంటల్లోగా రైతుల అకౌంట్లలో పైసలు వేస్తామని ప్రభుత్వం చెప్పినా చాలా జిల్లాల్లో 10 నుంచి 20 రోజులవుతున్నా జమ కావట్లేదు. ఇందుకు టెక్నికల్​ ప్రాబ్లమ్స్​కారణమని ఆఫీసర్లు చెబుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో వడ్లను తూకం వేసిన వెంటనే రైతుల డిటైల్స్​ను అక్కడి స్టాఫ్​ ట్యాబ్ లలో ఎంటర్​ చేయాలి.  కానీ రెండు, మూడు కేంద్రాలకు కలిపి ఒక్కరే ఎంట్రీ ఆపరేటర్​ఉండడంతో ఈ ప్రాసెస్​ లేటవుతోంది. లారీలను రైస్​మిల్లుల్లో అన్​లోడ్ చేశాక మిల్లర్లు సర్టిఫై చేసి అక్ నాలెడ్జ్ మెంట్లు సెంటర్ నిర్వాహకులకు పంపించాలి. కానీ అక్కడా 2, 3 రోజులు పడుతోంది. అవి వచ్చాక సివిల్ సప్లై ఆఫీస్ లో రైతుల పేరిట అమౌంట్ క్రెడిట్ చేయాలి. వడ్లను అమ్మిన సీరియల్ నంబర్ల ప్రకారం బడ్జెట్ ను బట్టి రైతుల అకౌంట్లలో జమ చేసేసరికి మొత్తంగా10 నుంచి 20 రోజులు గడుస్తున్నాయి.

పెట్టుబడులు ఎట్ల?

రైతులు ఇప్పటికే యాసంగి దున్నకాలు మొదలు పెడుతున్నరు.  ట్రాక్టర్ల కిరాయి, సీడ్స్, ఎరువు కొనుగోళ్లు, ఇతరత్రా పెట్టుబడి అవసరాలకు పైసలు అవసరం. ఎంత లేదన్నా ఎకరా సాగుకు ప్రతి రైతు చేతిలో కనీసం రూ. 20 వేలు ఉండాలి. కానీ వడ్లు అమ్మి వారాలు గడుస్తున్నా అకౌంట్లలో పైసలు పడ్తలేవు. మరోవైపు సర్కారు నుంచి ఇంకా రైతుబంధు సాయం కూడా అందలేదు. దీంతో చాలామంది రైతులు సాగు పనులు ఆపేసి, పైసల కోసం బ్యాంకుల చుట్టూ
తిరుగుతున్నారు.

20 రోజులైనా  పైసలు పడలే..

ఐదెకరాల్లో వరి పంట వేసిన. నివర్ తుపాను వల్ల దిగుబడి తగ్గింది. 20 రోజుల క్రితం ఐకేపీ సెంటర్​లో 19 క్వింటాళ్లు అమ్మిన. కానీ ఇప్పటివరకు నా అకౌంట్​లో డబ్బులు పడలేదు. ఆఫీసర్లను అడిగితే మిల్లుకు పంపడం లేటయిందంటున్నారు. ఎందుకలా జరిగిందో తెలియదు. యాసంగి పనులు మొదలుపెట్టాలె. పెట్టుబడులకు ఇబ్బంది అయితాంది. ఇప్పటికైనా రైతుల అకౌంట్లలో పైసలు వేస్తే మంచిగుండు.

– గుండు లింగారావు, మునగాల మండలం, సూర్యాపేట జిల్లా

బ్యాంకు చుట్టూ తిరుగుతన్న

ఎకరం భూమిలో పండిన వడ్లను నెలకిందే కొనుగోలు సెంటర్ కు తెచ్చిన. వడ్లలో తేమ, తాలు ఉన్నాయని కొనకుండా 20 రోజులు గడిపిన్రు. వడ్లను క్లీన్ చేసి ఎండబోసినంక కాంటా పెట్టుకున్నరు. ఇప్పటికి 12 రోజులు దాటినా నా అకౌంట్ల పైసలు పడలే. యాసంగి పనలు స్టార్ట్ చేయాలె. పెట్టుబడికి పైసల్లేక ఇబ్బంది అయితంది. పైసలెప్పుడు పడ్తయోనని బ్యాంకు చుట్టూ తిరుగుతున్న.

– తమ్మడి రామనరసయ్య, ఆర్నకొండ, చొప్పదండి మండలం, కరీంనగర్​ జిల్లా

 

జిల్లాల్లో ఇదీ పరిస్థితి

  • సూర్యాపేట జిల్లాలో వడ్లు అమ్మి 20 రోజులు దాటినా రైతుల అకౌంట్లలో పైసలు జమ కావట్లేదు. ఇక్కడ 4,395 మంది రైతులకు రూ.44.79 కోట్లు చెల్లించాల్సి ఉంది.
  • యాదాద్రి జిల్లాలో 10 రోజుల తర్వాతగానీ రైతుల అకౌంట్లలో డబ్బులు పడడం లేదు. ఈ జిల్లాలో ఇంకా రూ.100 కోట్లు పెండింగ్​లో ఉన్నాయి.
  • వనపర్తి జిల్లాలో వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభమై 25 రోజులు గడిచినా ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో పైసలు పడ్తలేవు. ఇక్కడ 35 వేల టన్నుల వడ్లు కొనగా, 60 కోట్లు రైతులకు రావాలి. తామంతా జీహెచ్​ఎంసీ ఎన్నికల డ్యూటీలో ఉండడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని జిల్లా ఆఫీసర్లు చెబుతున్నారు.
  • జోగులాంబ గద్వాల జిల్లాలో పదివేల క్విటాళ్ల వడ్లను కొనుగోలు చేయగా, ఇప్పటివరకు ఏ ఒక్క రైతు అకౌంట్​లోనూ పైసలు పడలేదు.
  • సిద్దిపేట జిల్లాలో వడ్లను అమ్మిన రైతులకు పది రోజుల తర్వాతే పైసలు పడుతున్నాయి.
  • మంచిర్యాల జిల్లాలో ఇప్పటి వరకు రూ.3.19 కోట్ల విలువైన వడ్లను రైతుల నుంచి కొనుగోలు చేశారు.కానీ వారం రోజులు అవుతున్న రైతుల అకౌంట్లలో పైసా జమ కాలేదు.
  • వరంగల్ రూరల్ జిల్లాలో సివిల్ సప్లయ్ ఆధ్వర్యంలో 49 వేల క్వింటాళ్ల వడ్లు కొన్నారు. కానీ బుధవారం నాటికి కేవలం 529 క్వింటాళ్లకు సంబంధించిన పైసలు మాత్రమే రైతులకు అందించారు. కొన్నిచోట్ల వడ్లు కొని రెండు, మూడు వారాలు అయినప్పటికీ అమౌంట్ మాత్రం వేయలేదు.
  • ఖమ్మం జిల్లాలో 5,553 మంది రైతుల నుంచి రూ.92 కోట్ల విలువైన 48,891 టన్నులు ధాన్యం కొన్నారు. కానీ  3,143 మంది రైతులకు రూ.48 కోట్లు మాత్రమే చెల్లించారు. వరుసగా 4 రోజులు బ్యాంకులకు సెలవు రావడం వల్లే పేమెంట్స్ లేటవుతున్నాయని ఆఫీసర్లు చెబుతున్నారు.
  • పెద్దపల్లి జిల్లాలో  12,217 మంది రైతుల వద్ద రూ. 127.63కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేయగా కేవలం2,133 మంది రైతులకు సంబంధించి  రూ. 21.78 కోట్లు మాత్రమే అకౌంట్లలో జమ చేశారు.
  • భూపాలపల్లి జిల్లాలో 1.5 లక్షల టన్నుల వడ్లు కొనాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకోగా ఇప్పటికి కేవలం 2 వేల టన్నుల వడ్లు మాత్రమే కొనుగోలు చేశారు. ములుగు జిల్లా లో 2,900 టన్నుల వడ్లు కొన్నారు. రెండు జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క రైతుకు కూడా ప్రభుత్వం నుంచి పైసలు పడలేదు.