రైతులకు గుడ్​ న్యూస్​ :  ఆగస్టు 15 నుంచి రైతు బీమా పథకం... అర్హతలు ఇవే...

రైతులకు గుడ్​ న్యూస్​ :  ఆగస్టు 15 నుంచి రైతు బీమా పథకం... అర్హతలు ఇవే...

తెలంగాణలో  కాంగ్రెస్​ ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేస్తోంది.  ఇప్పటికే రైతు రుణాలను మాఫీ చేసిన ప్రభుత్వం  ఇప్పుడు రైతు బీమాపై ఫోకస్​ పెట్టింది.  రాష్ట్రంలో  నిరుపేద రైతుల అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ సర్కార్ రైతు బీమాపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 2024--25 సంవత్సరానికి గాను ఆగస్టు 15 నుంచి రైతు బీమా పథకాన్ని పునరుద్ధరించనుంది.

18 నుంచి 59 ఏళ్ల వయసు గల వారు ఈ పథకానికి అర్హులని ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలో మొత్తం 75.86 లక్షల మందికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఉండగా.. గతేడాది జూన్ వరకు మరో 3.22 లక్షల మందికి కొత్తగా పాస్ పుస్తకాలు వచ్చినట్లుగా వ్యవసాయ శాఖ గుర్తించింది. అందులో 2.32 లక్షల మంది మాత్రమే రైతు బీమాకు దరఖాస్తు చేసుకున్నారు. గతంలో అన్ని అర్హతలు ఉండి రైతు బీమాకు దరఖాస్తు చేసుకోని వారితో కలిపి 2.71 లక్షల మంది అర్హులని తేల్చారు. 

అదేవిధంగా జూలై 30 నాటికి 60 ఏళ్లు దాటిని వారిని పథకం నుంచి తొలగించి మిగతా అర్హులైన 45.13 లక్షల మంది ఇన్సూరెన్స్‌లను రెన్యూవల్ చేయాలని అధికారులు నిర్ణయించారు. వాటికి తోడు కొత్తగా అర్హులైన 2.74 లక్షల మందికి కలిపి మొత్తం 47.87 లక్షల మంది రైతులను ప్రభుత్వం రైతు బీమాలో భాగస్వాములను చేయనుంది. ఏడాదికి ఒక్కో రైతుకు రూ.3,600 చొప్పున సర్కారే ప్రీమియం చెల్లిస్తుంది. రైతు సహజంగా లేదా ప్రమాదవశాత్తు మరణించినా ఆ కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం అందనుంది.