రేటు తక్కువైనా పచ్చి వడ్లనే అమ్ముకుంటున్రు

రేటు తక్కువైనా పచ్చి వడ్లనే అమ్ముకుంటున్రు
  • ప్రైవేటుకే మొగ్గు చూపుతున్న ఖమ్మం జిల్లా రైతులు 
  • ఇప్పటి వరకు సేకరించింది 40 వేల టన్నులే
  • చలి, మంచు కారణంగా తగ్గని తేమ శాతం

ఖమ్మం, వెలుగు: జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల కంటే ప్రైవేట్​ వ్యాపారులకు వడ్లు అమ్ముకునేందుకే రైతులు మొగ్గు చూపిస్తున్నారు. క్వింటాకు రూ.300 నుంచి రూ.400 వరకు ధర తక్కువైనా, ప్రైవేట్ వ్యాపారులకే అమ్ముకుంటున్నారు.

ఒకవైపు చలి ఎఫెక్ట్ చూపిస్తుండడం, రెండు మూడ్రోజుల నుంచి వాతావరణంలో మార్పు రావడంతో ధాన్యం ఎక్కడ తడుస్తుందోనన్న టెన్షన్​ తో రైతులు వీలైనంత త్వరగా పంటను అమ్ముకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతం 17 లోపు ఉండాలన్న నిబంధన ఉండడంతో వడ్లను ఎండబెట్టలేక రేటు తక్కువకే అమ్మి నష్టపోతున్నారు. 

సెంటర్లు ఏర్పాటు చేసినా..

జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఈ సీజన్​ లో 223 కొనుగోలు కేంద్రాల ద్వారా 3.80 లక్షల మెట్రిక్​ టన్నుల వడ్లు కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు అన్ని కేంద్రాలను ప్రారంభించినా, 5892 మంది రైతుల నుంచి 40,601 మెట్రిక్​ టన్నులను మాత్రమే కొన్నారు. ఇందులో కామన్​ రకం 25,977 టన్నులు ఉండగా, 14,623 టన్నుల గ్రేడ్–ఏ రకం ధాన్యం కొన్నారు. ఇక కొనుగోలు చేసిన వడ్లకు సంబంధించి ఇప్పటి వరకు 692 మంది రైతులకు మాత్రమే రూ.8.45 కోట్లను బ్యాంకు అకౌంట్లలో జమ చేశారు.

ఇంకా 5,200 మంది రైతులకు రూ.26.96 కోట్లు చెల్లించాల్సి ఉంది. గ్రేడ్–ఏ రకం ధాన్యానికి ప్రభుత్వం రూ.2060 ధర చెల్లిస్తుండగా, కామన్​ రకం ధాన్యానికి రూ.2040 చొప్పున కొనుగోలు చేస్తోంది. అయితే ప్రైవేట్ వ్యాపారులు కొన్ని మండలాల్లో క్వింటా రూ.1650 నుంచి రూ.1850కి కొనుగోలు చేస్తున్నారు. ధాన్యం ఎండబోయాల్సిన అవసరం లేకుండా, తుఫాను గురించి టెన్షన్​ లేకుండా పచ్చి వడ్లనే వ్యాపారులు కొంటుండడంతో రైతులు దాని వైపే ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.