రంగారెడ్డి జిల్లాలో అసైన్డ్ భూమి రైతుల ఆందోళన

రంగారెడ్డి జిల్లాలో అసైన్డ్ భూమి రైతుల ఆందోళన

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఖానాపూర్ రైతులు రోడ్డెక్కారు. తమ భూములను తమకే అప్పగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఆందోళనలు చేస్తున్న రైతులకు బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. 

43/1సర్వే నెంబర్ కథేంటి..? 
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పరిధిలో ఖానాపూర్ రెవెన్యూలోని సర్వే నెంబర్ 43/1లో 11 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. ఈ భూమిని ఖానాపూర్ గ్రామానికి చెందిన 60 మంది రైతులకు గతంలో ప్రభుత్వం సాగు చేసుకోవడానికి కేటాయించింది. చాలా సంవత్సరాల పాటు ఈ భూమిలో 60 మంది రైతులు సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందారు. సాగర్ రింగు రోడ్డు పక్కనే 43/1 సర్వే నెంబర్ ఉండడంతో ఇటీవల కొందరు ఇదే భూమిలో ఇండ్లు కట్టుకున్నారు. అయితే.. ఇళ్లను నిర్మించుకోవద్దంటూ రెవెన్యూ అధికారులు కొన్ని ఇండ్లను కూల్చివేశారు. ఇదే సర్వే నెంబర్ లో ఆర్డీవో కార్యాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఈ కార్యాలయం ఏర్పాటు సమయంలో 60 మంది అసైన్డ్ రైతులు ఆందోళన చేయడంతో.. మిగులు భూమిని ప్లాట్లుగా చేసి ఇస్తామని ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఆర్డీవో వెంకటాచారి హామీ ఇచ్చారు. 

మిగులు భూమిని  ప్లాట్లుగా చేసి ఇస్తామని హామీ ఇచ్చి నెలలు గడుస్తున్నా.. అధికారులు, స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పట్టించుకోకపోవడంతో 60 మంది రైతులు ఆందోళనకు దిగారు. ప్లాట్స్ ఇవ్వాలంటూ ఖానాపూర్ గ్రామానికి చెందిన రైతులు రాత్రంతా 43/1సర్వేనెంబర్ లో టెంటు వేసుకొని అక్కడే బస చేశారు. 43/1సర్వేనెంబర్ లోని అసైన్డ్ భూమిని కేవలం సాగు చేసుకునేందుకే ఉపయోగించాలని ఇబ్రహీంపట్నం ఆర్డీఓ వెంకటాచారి చెప్పారని ఖానాపూర్ రైతులు చెబుతున్నారు. తమ భూమిని తాము సాధించే వరకూ ఆందోళనలు కొనసాగిస్తామని ఖానాపూర్ రైతులు స్పష్టం చేస్తున్నారు. 

రైతులకు బీజేపీ, కాంగ్రెస్ మద్దతు

ఖానాపూర్ రైతులకు బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాషా, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కోదండ రెడ్డి, సీపీఎం నాయకులు మద్దతు తెలిపారు. 60 మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.