- చీడపీడలు తట్టుకునే సామర్థ్యం
- ఈ కారణాలతో దొడ్డురకం వైపు రైతుల మొగ్గు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో యాసంగి సీజన్‌లో వరిసాగు క్రమంగా జోరందుకుంటోంది. అయితే, ఈసారి రైతులు సన్న రకాలకు బదులుగా దొడ్డు రకాల వైపు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. ఎక్కువ దిగుబడి, తక్కువ చీడపీడల బెడద, మెరుగైన లాభాలు వంటి కారణాలతో రైతులు దొడ్డురకం పండిస్తున్నారు. ఈ పోకడ భవిష్యత్తులో ప్రభుత్వ కొనుగోళ్లకు ఇబ్బందులు తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతి సీజన్‌లోనూ సాధారణంగా సన్న రకాల వరికి మార్కెట్‌లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం సన్న రకాలకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ప్రకటించడంతో రైతులు సన్న రకాల వైపు మొగ్గు చూపారు. అయితే, ఈయేడు పరిస్థితి మారింది.
సన్న రకాల సాగులో చీడపీడల సమస్యలు, ఎకరానికి 20 నుంచి 28 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వస్తోంది. అదే దొడ్డు రకాలు 25 నుంచి 35 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఈ కారణంగా రైతులు దొడ్డు రకాలను ఎంచుకుంటున్నారు. అధిక దిగుబడి వచ్చే అవకాశం, సాగు ఖర్చులతో పోలిస్తే మెరుగైన లాభాలు లభించే అంచనాలతో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.
యాసంగిలో భారీగా పెరుగనున్న వరి
రాష్ట్రంలో యాసంగి సాధారణ వరిసాగు విస్తీర్ణం 51.48 లక్షల ఎకరాలు. గతేడాది అది 59.92 లక్షల ఎకరాలకు పెరిగింది. ఈసారి కూడా వరిసాగు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నప్పటికీ, ఇప్పటికే దాదాపు 10 లక్షల ఎకరాల్లో నాట్లు వేశారు. ఈ సీజన్ లో వరి మొత్తం విస్తీర్ణం 60 లక్షల ఎకరాలు దాటే అవకాశాలు ఉందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మొత్తం సాగులో ఎక్కువ భాగం దొడ్డు రకాలదే.
దొడ్డు రకాలతో సవాళ్లే..
దొడ్డు రకాల సాగు పోకడలతో కొనుగోళ్ల విషయంలో సవాళ్లు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. దొడ్డు వరి నుంచి ఉత్పత్తి అయ్యే బాయిల్డ్ రైస్‌కు మార్కెట్‌లో డిమాండ్ తక్కువగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల బాయిల్డ్ రైస్‌కు బదులుగా రా రైస్‌ను మాత్రమే సరఫరా చేయాలని స్పష్టం చేసింది. దీంతో దొడ్డు వరి కొనుగోళ్లపై అనిశ్చితి నెలకొంటోంది. రాష్ట్ర ప్రభుత్వం ఏటా బాయిల్డ్ రైస్ కొనుగోళ్లకు అనుమతి కోరుతున్నప్పటికీ, కేంద్రం పెద్దగా ముందుకు రావడం లేదు.
కేంద్రం వెనక్కు తగ్గితే మొత్తం బాధ్యత రాష్ట్రంపైనే పడుతుందని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది ప్రభుత్వంపై ఆర్థిక భారాన్ని పెంచడమే కాకుండా, రైతులకు మార్కెట్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు రైతుల భవిష్యత్తుకు కీలకంగా మారనున్నాయి. వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సన్న రకాల సాగును ప్రోత్సహించాలని సూచిస్తున్నప్పటికీ, మార్కెట్ పరిస్థితులు, దిగుబడి అంచనాలు రైతుల నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయి. యాసంగి సీజన్ ముగిసే నాటికి ఈ పరిస్థితులు ఎలా మలుపు తిరుగుతాయో చూడాలి.
