రైతు డిస్కమ్‌‌‌‌.. మరణశాసనమే..అసెంబ్లీలో చర్చించకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం దారుణం

రైతు డిస్కమ్‌‌‌‌.. మరణశాసనమే..అసెంబ్లీలో చర్చించకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం దారుణం
  • మాజీ మంత్రి నిరంజన్​రెడ్డి ఫైర్ 

పంజాగుట్ట, వెలుగు: దేశంలో ఏ రాష్ట్రమూ చేయని విధంగా తెలంగాణ ప్రభుత్వం ‘రైతు డిస్కమ్‌‌‌‌’ను ఏర్పాటు చేసి రైతులను తీవ్ర కష్టాల్లోకి నెడుతోందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌‌‌‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ఎలక్ట్రికల్‌‌‌‌ రిటైర్డ్‌‌‌‌ ఇంజనీర్స్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌ ఆధ్వర్యంలో ఆదివారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో నిర్వహించిన రౌండ్‌‌‌‌ టేబుల్‌‌‌‌ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. 

అసెంబ్లీలో చర్చించకుండా ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయం భవిష్యత్​లో రైతుల పాలిట మరణశాసనంగా మారుతుందని, ఒక్కో ఉద్యోగికి 600 డీటీఆర్‌‌‌‌ల నిర్వహణ అప్పగిస్తే క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారం అసాధ్యమన్నారు. సమావేశంలో విద్యుత్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శివాజీ, ఇంజనీర్స్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌ ప్రతినిధులు, వివిధ రైతు, రాజకీయ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. రెండు డిస్కమ్​లతోనే మంచి సేవలు అందుతుండగా, రూ.35 వేల కోట్ల అప్పులతో పుడుతున్న ఈ 3వ డిస్కమ్‌‌‌‌ వల్ల కార్పొరేట్ శక్తులకు, స్మార్ట్ మీటర్ల వ్యాపారానికి లాభమే తప్ప రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదని, పైగా సంస్థను నిర్వీర్యం చేసే కుట్ర దాగి ఉందని మండిపడ్డారు. జూన్ 2న ప్రారంభించాలనుకుంటున్న ఈ రైతు డిస్కమ్​కు లైసెన్స్‌‌‌‌ ఇవ్వకూడదని ఈఆర్‌‌‌‌సీకి విజ్ఞప్తి చేస్తూ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.