అన్నదాతలకు అడుగడుగునా కష్టాలు

అన్నదాతలకు అడుగడుగునా కష్టాలు
  • ట్రక్ షీట్ల జారీ, ట్యాబ్‌ ఎంట్రీలో తీవ్ర జాప్యం
  • కామారెడ్డి జిల్లాలో రూ.88 కోట్ల బకాయిలు
  • డబ్బుల కోసం రైతుల ఎదురుచూపులు


కామారెడ్డి, వెలుగు: అన్నదాతలకు అడుగడుగునా కష్టాలు తప్పడం లేదు. యాసంగి సీజన్‌లో  వడ్ల కొనుగోలుపై గవర్నమెంట్ ఆలస్యంగా నిర్ణయం తీసుకోవడంతో రైతులను మరింత ఆగం చేస్తోంది. ఇప్పటికే సెంటర్ల ఏర్పాటు, కాంటాలు, వడ్ల లిఫ్టింగ్‌ డీలేలతో అవస్థలు పడుతుంటే.. తాజాగా అమ్మిన వడ్ల పైసల కోసం కూడా ఎదురుచూపులు తప్పడం లేదు. ట్రక్ షీట్ల జారీ, ట్యాబ్‌ ఎంట్రీలో డీలే డబ్బులు రావడం ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో సాగుకు చేసిన అప్పులు తీర్చేందుకు, వానకాలంలో పంటల పెట్టుబడికి కోసం రైతులకు వెతుకులాట తప్పడం లేదు. 

జిల్లాలో ఇదీ పరిస్థితి..

జిల్లాలో ఈ సీజన్‌లో 3.50 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు టార్గెట్ ఉంది. ఈనెల 21న వరకు లక్షా 60 వేల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నారు. మొత్తం రూ.300 కోట్ల మేర వడ్లు కొనగా ఇందులో రూ.212 కోట్ల చెల్లింపులు జరిగాయి. ఇంకా రూ.88 కోట్లు రైతులకు రావాల్సి ఉంది. ట్రక్​షీట్లు జారీ, ఆన్​లైన్‌లో ఎంట్రీకి సంబంధించి మరో రూ.50 కోట్ల పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.  

ట్యాబ్‌ నమోదులో ఆలస్యం

 సెంటర్ వడ్లు రైస్‌ మిల్లుకు వెళ్లిన తర్వాత వారు ఇచ్చే ట్రక్ షీట్‌ను బట్టి రైతు పేరిట సొసైటీ వారు ట్యాబ్‌లో ఎంట్రీ చేస్తారు.  ఇక్కడ ఎంట్రీ జరిగి గవర్నమెంట్‌కు వివరాలు వెళ్లిన తర్వాత రైతుల అకౌంట్‌లో పైసలు జమ అవుతాయి. కాంటాలు కంప్లీట్ అయినా వడ్లు మిల్లులకు వెళ్లడం, ఇక్కడి నుంచి ట్రక్​షీట్లు ఇవ్వడం, ట్యాబ్‌లో ఎంట్రీ చేయడంలో ఎక్కువ డిలే అవుతున్నట్లు తెలుస్తోంది. కామారెడ్డి, లింగంపేట, భిక్కనూరు, నిజాంసాగర్, మాచారెడ్డి, రామారెడ్డి, సదాశివనగర్, రాజంపేట, దోమకొండ, నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి తదతర మండలాల్లో వడ్ల పైసల కోసం రైతులు రోజుల తరబడి ఎదురు చూస్తున్నారు. మిల్లులకు వడ్లు వెళ్లిన తర్వాత మరోసారి ఇక్కడ కోత పెట్టి ట్రక్ షీట్లు ఇస్తున్నారు. కొందరు రైతులు సకాలంలో సమాచారం ఇవ్వకపోవడంతోనే డిలే అవుతోందని ఆఫీసర్లు మళ్లీ రైతులను నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. సొసైటీల పరిధిలో  ట్యాబ్ ఎంట్రీ, ట్రక్ షీట్ల జారీ ఆంశాలపై కూడా ఆఫీసర్లు పర్యవేక్షణ చేయడం లేదు. ట్రక్ షీట్ల జారీ, ఎంట్రీకి వారం రోజులకు పైగా పడితే .. ఇవన్ని జరిగిన తర్వాత ఐదు నుంచి ఎడు రోజుల అకౌంట్లలో పైసలు జమ అవుతున్నాయి.