
నెక్కొండ, వెలుగు : సరిపడా యూరియా ఇవ్వాలంటూ వరంగల్జిల్లా నెక్కొండ పట్టణంలోని అగ్రికల్చర్ మార్కెట్ ఎదుట సోమవారం రైతులు ధర్నాకు దిగారు. వచ్చిన యూరియా స్టాక్‌ను అగ్రికల్చర్ ఆఫీసర్ లీడర్లకు అమ్ముకున్నారని ఆరోపించారు. రైతులు సుమారు రెండు గంటల పాటు ధర్నా చేయడంతో వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయాయి.
సమాచారం తెలుసుకున్న ఎస్సై మహేందర్ ఘటనాస్థలానికి చేరుకొని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మడిపల్లికి చెందిన రైతు తేజావత్ కిషన్ యూరియా బస్తాలు ఇప్పించలంటూ ఎస్సై కాళ్లు మొక్కాడు. అలాగే నాగారం గ్రామంలో యూరియా పంపిణీ చేస్తుండగా.. 15 బస్తాలను గూడూరు మండలంలోని గుండెంగకు చెందిన రైతులు బ్లాక్‌లో కొనుగోలు చేసి ఆటోలో తరలిస్తుండగా నాగారం రైతులు పట్టుకున్నారు. యూరియాను ఏవో నాగరాజు బ్లాక్‌లో అమ్ముకుంటున్నాడన్న ఆగ్రహంతో ఆయనపై దాడికి యత్నించగా.. పోలీసులు అడ్డుకొని ఏవోను రైతువేదికలోకి తరలించారు.