సూర్యాపేట జిల్లాలో అక్రమ మైనింగ్ రద్దు చేయాలని రైతుల ఆందోళన

సూర్యాపేట జిల్లాలో  అక్రమ మైనింగ్ రద్దు చేయాలని రైతుల ఆందోళన

సూర్యాపేట, వెలుగు; సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలంలోని పాత సూర్యాపేట గ్రామంలో అక్రమ మైనింగ్ లీజును రద్దు చేయాలని కోరుతూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. నెమ్మికల్ రెవెన్యూ శివారులో, పాత సూర్యాపేట గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబరు 701లో ఉన్న 17.12 ఎకరాల భూమిలో రాతి గుట్టపై రెండు హెక్టార్ల వరకు మైనింగ్‌కు 2021లో అప్పటి తహసీల్దారు స్థానికంగా విచారణ చేయకుండానే ఓ వ్యక్తి పేరున అనుమతి మంజూరు చేసినట్లు రైతులు తెలిపారు.

 ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో స్థానిక రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ భూమి వద్దే ఆందోళనకు దిగారు . మైనింగ్ ప్రాంతం చుట్టూ పాత సూర్యాపేట , కందగట్ల , నెమ్మికల్ , పాశంబండతండా గ్రామాలకు చెందిన వందల ఎకరాల సాగుభూములు ఉన్నాయని పేర్కొన్నారు. 

అక్కడ పంట పొలాలు లేవని తప్పుడు నివేదిక అందజేసి లీజు తెచ్చుకున్నారని కానీ భూముల్లో వరి, పత్తి పంటలు సాగవుతున్నాయని, మైనింగ్ ప్రారంభమైతే పంటలకు, బోరు బావులతో పాటు మూగజీవాలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమంగా మంజూరైన లీజుపై జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే రద్దు చేయాలని రైతులు కలెక్టర్ వినతిపత్రం అందజేశారు.  అలాగే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు .