కుభీర్​లో రైతుల రాస్తారోకో

కుభీర్​లో రైతుల రాస్తారోకో

కుభీర్, వెలుగు: రబీ పంటలకు 24 గంటల కరెంటు సరఫరా చేయాలని డిమాండ్​చేస్తూ నిర్మల్​జిల్లా కుభీర్​మండల కేంద్రంలో రైతులు ఆందోళన చేపట్టారు. శనివారం భైంసా రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. గంటకుపై గా బైఠాయించడంతో  ఇరువైపులా వెహికల్స్​నిలిచిపోయాయి. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల కరెంటు ఇస్తుందన్న ఉద్దేశంతో పంటలు సాగు చేశామన్నారు. తీరా చూస్తే ఏడెనిమిది గంటలు కూడా కరెంటు ఉండడం లేదన్నారు. దీంతో పంటలు ఎండిపోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. మండలంలోని రైతులంతా బోర్లపైనే ఆధారపడి పంటలు సాగు చేస్తున్నారని, ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. 

ఈ విషయమై స్థానిక ఎమ్మెల్యే విఠల్​ రెడ్డికి ఫోన్​ చేస్తే స్పందించడం లేదన్నారు. ఫోన్​కట్​చేస్తూ అవమానిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే రాజీనామా చేస్తేనే నిరంతరం విద్యుత్తు సరఫరా అవుతుందని పేర్కొన్నారు. రైతులపై ఎమ్మెల్యేకు ఏమాత్రం ప్రేమ ఉన్నా రాజీనామా చేయాలని డిమాండ్​ చేశారు. అనంతరం రైతులంతా కలిసి ర్యాలీగా విద్యుత్తు సబ్​స్టేషన్​కు వెళ్లి ఏఈకి వినతిపత్రం అందించారు. స్పందించిన ఆయన రాత్రి 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిరంతర విద్యుత్తు సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు.