
ఘజియాబాద్: కొత్త వ్యవసాయ చట్టాలపై నిరసనలు తెలుపుతున్న రైతులకు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మద్దతు తెలిపారు. ఢిల్లీ-ఉత్తర్ ప్రదేశ్ బార్డర్‌లోని ఘాజీపూర్‌లో భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్‌ను రౌత్ కలిశారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ప్రవేశించకుండా సెక్యూరిటీని పటిష్టం చేసిన నేపథ్యంలో రౌత్ విజిట్ ఆసక్తిని సంతరించుకుంది. తికాయత్‌ను కలిసిన తర్వాత రౌత్ మాట్లాడారు. ‘జనవరి 26న జరిగిన విధ్వంసంతో రైతుల ఉద్యమాన్ని అణచాలని చూశారు. ఈ సమయంలో అన్నదాతలకు మద్దతుగా నిలవడం మా బాధ్యతగా భావించాం. మొత్తం మహారాష్ట్ర, శివసేన, సీఎం ఉద్ధవ్ ఠాక్రే తరఫున రైతులకు మద్దతుగా మేం ఉన్నాం అని చెప్పడానికే ఇక్కడికి వచ్చా. రైతుల ఉద్యమానికి రాజకీయాలు, పొలిటికల్ లీడర్స్‌తో ఎలాంటి సంబంధం లేదు’ అని రౌత్ పేర్కొన్నారు.