
మెదక్ టౌన్, వెలుగు : వడ్లను కాంటా పెట్టి రెండు నెలలు దాటినా పైసలియ్యలేదని, ఆఫీసర్లకు చెప్పినా పట్టించుకుంటలేరని మెదక్ జిల్లాలోని నార్సింగి మండలం నర్సంపల్లికి చెందిన రైతులు కలెక్టరేట్ఆవరణలో ఆందోళన చేశారు. 36 మంది రైతులు గత ఏడాది నవంబర్15న నర్సంపల్లిలోని ఐకేపీ సెంటర్లో వడ్లను తూకం వేయించారు. అయితే ఐకేపీ సెంటర్లో పని చేసే బాబు అనే వ్యక్తి నిర్లక్ష్యంతో ట్యాబ్లో ఎంట్రీ చేయలేదు. ఈ విషయం రైతులకు కూడా చెప్పలేదు. కొన్ని రోజులకు వచ్చి డబ్బులు రాలేదని అడిగితే ఎంట్రీ అయిపోయిందని, టైం పడుతుందని చెప్పాడు. దీంతో డిసెంబర్ నెలలో కలెక్టరేట్లోని సివిల్సప్లయీస్ఆఫీసుకు వెళ్లగా, వారు తమ దగ్గర ధాన్యం కొన్నట్టు వివరాలే లేవని చెప్పారు. దీంతో ఊరికి వెళ్లి సర్పంచ్ కు చెప్పుకోగా, ఐకేపీ సెంటర్ కు చెందిన బాబును పిలిపించి అడిగారు. ఆయన తానే ఎంట్రీ చేయలేదని ఒప్పుకుని, తర్వాత ధాన్యం కొన్నట్టు నమోదు చేశాడు. వడ్లు కొన్న రెండు, మూడు రోజుల్లోనే సర్కారు రైతుల అకౌంట్లలో డబ్బులు వేస్తున్నామని సర్కారు చెబుతుండడం, తమకు రాకపోవడంతో సోమవారం సుమారు 20 మంది రైతులు మళ్లీ కలెక్టరేట్లోని సివిల్ సప్లయీస్ ఆఫీసుకు వచ్చారు. అయితే తమ దగ్గర డబ్బులు లేవని, వచ్చాక ఇస్తామని ఆఫీసర్లు చెప్పారు. అలాగే రైతులు తమకు సుమారు 35 లక్షల వరకు రావాల్సి ఉందని చెప్పగా, ఆఫీసర్లు మాత్రం 8 లక్షలే అని చెప్పడంతో ఆగ్రహంతో బయటకు వచ్చారు. రెండు నెలల నుంచి తమను సతాయిస్తున్నారని ఆందోళనకు రెడీ అయ్యారు. పోలీసులు అడ్డుకోవడంతో వెళ్లిపోయారు. కాగా, జిల్లాలో 14 చోట్ల రైతులకు రూ.13 కోట్ల వరకు ధాన్యం డబ్బులు ఇవ్వాల్సి ఉందని సమాచారం.