కరీంనగర్ కార్పొరేషన్ పై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం : వెలిచాల రాజేందర్ రావు

కరీంనగర్ కార్పొరేషన్ పై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం : వెలిచాల రాజేందర్ రావు
  •     అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌‌‌‌చార్జి వెలిచాల రాజేందర్ రావు

కరీంనగర్, వెలుగు: మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీని చిత్తుచిత్తుగా ఓడిస్తామని కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌‌‌‌చార్జి వెలిచాల రాజేందర్ రావు అన్నారు. కరీంనగర్‌‌‌‌‌‌‌‌ బల్దియాపై కాంగ్రెస్ జెండా ఎగరవేసి తీరుతామని స్పష్టం చేశారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌‌‌‌చార్జిగా నియమితులయ్యాక తొలిసారిగా మంగళవారం కరీంనగర్ వచ్చిన వెలిచాల రాజేందర్ రావుకు అలుగునూరు చౌరస్తాలో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అక్కడి నుంచి వేలాది మంది ర్యాలీగా గీతాభవన్ చౌరస్తా వరకు చేరుకున్నారు. 

అనంతరం డీసీసీ ఆఫీసులో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ కరీంనగర్ కార్పొరేషన్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు ఆరేపల్లి మోహన్, కోడూరు సత్యనారాయణ గౌడ్, కాంగ్రెస్ నేత అల్ఫోర్స్ నరేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. తమ భేషజాలు లేవని, కరీంనగర్‌‌‌‌‌‌‌‌లో కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా కృషి చేస్తానన్నారు. రాబోయే నగరపాలక సంస్థ ఎన్నికల్లో ప్రజల్లో పలుకుబడి ఉన్న నేతలకు టికెట్లు దక్కుతాయని తెలిపారు. 

టికెట్ రానివారికి  నామినేటెడ్ పదవులు అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.  బీఆర్ఎస్, బీజేపీ నేతలు చీకటి ఒప్పందాలతో ఒకరి గెలుపు కోసం మరొకరు సాయపడుతున్నారన్నారు. ఈ సందర్భంగా సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్, అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి వెలిచాలకు అభినందనలు తెలిపారు.