
- లారీకి 9 క్వింటాళ్ల చొప్పున నొక్కేసిన ఇన్ చార్జి
- మెదక్ జిల్లా గుండ్లపల్లిలో రైతుల ఆందోళన
శివ్వంపేట, వెలుగు: మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గుండ్లపల్లి ఐకేపీ వడ్ల కొనుగోలు సెంటర్ లో గోల్మాల్జరిగింది. ధాన్యం తూకంలో సెంటర్ఇన్ చార్జి చేతివాటం చూపి రైతులను మోసగించారు. బస్తాకు 40 కిలోల వడ్లను తూకం వేయాల్సి ఉండగా, తరుగు పేరుతో బస్తాకు 42 కిలోల 500 గ్రాములు వేశారు. ఇలా ఒక్కో లారీకి 9 క్వింటాళ్ల వడ్లను కాజేసినట్టు గుర్తించి గురువారం ఆందోళనకు దిగారు. వడ్ల సెంటర్ ఇన్ చార్జి చంద్రకళను రైతులు ఒగ్గు సురేష్, మహేష్, శ్రీనివాస్, ఖాదర్ పాషా, గొర్రె విష్ణువర్ధన్ రెడ్డి, నర్సింహ, పోచయ్య, నర్సింహ, మహేష్ గౌడ్, దినకర్ రెడ్డి, మల్లేష్, మమత నిలదీశారు.
చంద్రకళ భర్త సదానందం పేరిట వడ్లు కాంటా పెట్టడంతో రైతులు పంట పండించకుండా వడ్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. దీంతో ఆమె డబ్బులు ఇస్తానని ఎవరికి చెప్పొద్దని భర్త సదానందం ద్వారా రైతులతో రాయబారం పంపారు. ఇది కాస్త గ్రామ యువకులు వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేయడంతో పాటు డీఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. దాదాపు 20 లారీల వడ్లు రైస్ మిల్లులకు తరలించగా ఒక్కో లారీకి 9 క్వింటాళ్ల చొప్పున నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామస్తుల ఫిర్యాదుతో డీపీఎం మోహన్ వెళ్లి విచారణ చేశారు. సెంటర్ఇన్ చార్జి చంద్రకళ పై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని రైతులు కోరారు. కష్టపడి పంట పండించి అమ్ముకుంటుంటే.. ఐకేపీ సెంటర్ ఇన్ చార్జి మోసం చేయడం దారుణమని మండిపడ్డారు. వడ్లు అమ్మిన ప్రతి రైతుకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్చేశారు. డీపీఎం మోహన్స్పందిస్తూ.. రిపోర్టును డీఆర్డీఓకు పంపించి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు.