విద్యుత్ బిల్లుల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి’

విద్యుత్ బిల్లుల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి’
  • కరెంట్ చార్జీలు పెంచొద్దు
  • ఈఆర్‌‌‌‌సీ విచారణలో రైతులు, వివిధ సంఘాలు

హనుమకొండ, వెలుగు: ‘‘కరెంట్ చార్జీల పేరుతో ప్రభుత్వం పేదలపై భారం మోపుతోంది. పెద్ద ఇండస్ట్రీలకు రాయితీలిచ్చి పేదోళ్లను ఇబ్బందులకు గురి చేయడం ఎంతవరకు కరెక్ట్? ప్రభుత్వం వెంటనే విద్యుత్ బిల్లుల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి’’ అని రైతులు, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. విద్యుత్ బిల్లుల పెంపు ప్రతిపాదనలపై టీఎస్ఎన్పీడీసీఎల్ పరిధిలో టీఎస్ఈఆర్‌‌‌‌సీ(తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్) ఆధ్వర్యంలో సోమవారం హనుమకొండ జడ్పీ హాలులో బహిరంగ విచారణ చేపట్టారు. ఈఆర్‌‌‌‌సీ చైర్మన్ టి.శ్రీరంగారావు, టెక్నికల్, ఫైనాన్స్ మెంబర్స్ ఎండీ మనోహర్​రాజు, కృష్ణయ్య విచారణ చేపట్టగా.. ఎన్‌‌పీడీసీఎల్ పరిధిలోని ట్రాన్స్‌‌కో, జెన్‌‌కోకు సంబంధించిన ఆఫీసర్లు, 16 జిల్లాల నుంచి దాదాపు 92 మంది ఆబ్జెక్టర్స్, వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు, రైతులు హాజరయ్యారు. ముందుగా విద్యుత్తు బిల్లుల ప్రతిపాదనలను వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ ఆధ్వర్యంలో డీసీసీ ప్రెసిడెంట్ నాయిని రాజేందర్ రెడ్డి, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య.. ఈఆర్‌‌‌‌సీ బెంచ్‌‌కు వినతిపత్రం అందజేశారు. తర్వాత విచారణ చేపట్టగా.. రైతులు, వినియోగదారులు తమ అభ్యంతరాలు తెలియజేశారు. డెవలప్‌‌మెంట్ చార్జీల పేరున పేదలపై భారం వేస్తున్నారని, కరెంట్‌‌ను ఎక్కువ ధరకు కొనుగోలు చేసి సామాన్యులను ఇబ్బందులకు గురి చేయడం కరెక్ట్ కాదన్నారు. తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను ఈఆర్‌‌‌‌సీ నోట్ చేసుకుంది. వాటిని పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పింది.

కరెంటోళ్లు అరిగోస పెడుతున్నరు
కరెంట్ ఆఫీసర్లు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, వ్యవసాయ కనెక్షన్ల కోసం అప్లై చేసుకుంటే ఏండ్ల తరబడి తిప్పించుకుంటున్నారని కామారెడ్డి జిల్లాకు చెందిన రైతులు ఈఆర్‌‌‌‌సీ ఎదుట వాపోయారు. ఏదైనా సమస్య పరిష్కారం కోసం లైన్‌‌మన్, ఏఈ దగ్గరికి వెళ్తే.. పెద్దాఫీసర్ల పేర్లు చెబుతున్నారని, అక్కడికి వెళ్లి అడిగితే మళ్లీ కిందిస్థాయి సిబ్బందిని సంప్రదించాలని సూచిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బావుల వద్ద ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోతే కనీసం రిపేర్లు చేయించడం లేదని, ఆ పని కూడా రైతులే చేసుకోవాల్సి వస్తోందని చెప్పారు. పోల్స్, ట్రాన్స్ ఫార్మర్ల రవాణా చార్జీలు కూడా రైతులే కట్టుకోవాల్సి వస్తోందన్నారు. ఇండ్లల్ల డెయిరీ ఫామ్స్‌‌ పెట్టుకుంటే వాటికీ ప్రత్యేక బిల్లులు కట్టాలంటూ పెనాల్టీలు వేస్తున్నారని, ఇలా వేసినవే రాష్ట్రంలో రూ.కోటికిపైగా బిల్లులు పెండింగ్​లో ఉన్నాయన్నారు. కరెంట్ సమస్యలకు  టోల్ ఫ్రీ నంబర్​ ఏర్పాటు చేయాలని, రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా ఆఫీసర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

లైన్‌‌మన్‌‌కు కరెంట్ పోల్ ఎక్కరాదు..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఒడితలకు  చెందిన సుభాష్ దంపతులు రెండేండ్ల కిందట కనెక్షన్​ కోసం అప్లై చేస్తే ఇంతవరకు ఇవ్వలేదని, ఎమ్మెల్యే చెప్పినా పని కాలేదని రైతు నాయకుడు ఓరుగంటి శ్రీధర్ రెడ్డి చెప్పారు. కామారెడ్డి జిల్లాలో ఏ ఒక్క లైన్​మన్‌‌కు కరెంట్ పోల్ ఎక్కరాదని, ప్రైవేటోళ్లను పెట్టుకుని పనులు చేయించుకోవాల్సి వస్తోందని అశోక్ రెడ్డి అనే రైతు తెలిపాడు. డీడీలు కట్టినా ట్రాన్స్ ఫార్మర్లు పెడ్తలేరన్నారు.  కరెంట్ ఆఫీసర్లు రైతుల మీద పెత్తనం చెలాయిస్తున్నారని, తమ మాట కనీసం పట్టించుకునే పరిస్థితిలో లేరని జనగామ జిల్లా పాలకుర్తి మండలానికి చెందిన నాయిని ఎల్లారెడ్డి చెప్పారు.

అందుకే పెంచినం..
టీఎస్ఎన్‌‌పీడీసీఎల్ సీఎండీ అన్నమనేని గోపాలరావు మాట్లాడుతూ.. సంస్థ బాగుండాలంటే కొన్ని మార్పులు అవసరమన్నారు. అంతర్గత సామర్థ్యం, లైన్లు, డీటీఆర్‌‌‌‌ల పెంపు తదితర కారణాలే డెవలప్‌‌మెంట్ చార్జీలు పెంచడానికి కారణమని చెప్పారు. డెవలప్‌‌మెంట్ చార్జీలపై ఏమైనా సందేహాలుంటే స్థానిక ఏఈని సంప్రదించాలన్నారు. ఏటా 36 వేల వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేస్తున్నామని, కామారెడ్డి, నిర్మల్‌‌ జిల్లాల్లో పెండింగ్‌‌లో ఉన్న కనెక్షన్లను వెంటనే క్లియర్ చేస్తామన్నారు. సమస్య ఉంటే 1800 425 0028 టోల్ ఫ్రీకి సమాచారం ఇవ్వాలన్నారు.

ఎస్ఈపై హత్య కేసు పెట్టాలె
కరెంట్ ఆఫీసర్లు రైతులను ఇబ్బందులు పెడ్తున్నరు. కొన్నిసార్లు ఆఫీసర్ల పని రైతులే చేసుకోవాల్సి వస్తోంది. ఇటీవల కామారెడ్డి జిల్లా గిద్దె గ్రామానికి చెందిన ఇద్దరు రైతులు ట్రాక్టర్‌‌‌‌లో కరెంట్ పోల్స్ తీసుకొస్తూ ప్రమాదానికి గురై చనిపోయారు. ఆఫీసర్ల నిర్లక్ష్యం వల్లే వారిద్దరూ చనిపోయారు. ఇందుకు కామారెడ్డి ఎస్ఈని డిస్మిస్ చేయాలి. ఆయనపై హత్యానేరం కింద కేసు బుక్ చేయాలి.
‌‌‌‌ ఓరుగంటి శ్రీధర్ రెడ్డి, రైతు నాయకుడు