ధరణితో రైతులకు తప్పని కష్టాలు

ధరణితో రైతులకు తప్పని కష్టాలు
  • సవరణలు చేయించేందుకు ఏడాదిన్నరగా తిప్పలు
  • తమ భూమి అమ్ముకోలేక కొందరు..
  • రైతుబంధు, బీమా అందక మరికొందరి అవస్థలు
  • దరఖాస్తులన్నీ కలెక్టర్ల దగ్గర పెండింగ్
  • రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న బాధితులు

మెదక్ జిల్లా శివ్వంపేట మండలం తాళ్లపల్లిగడ్డ తండాకు చెందిన మాలోత్ బాలు (32)కు నాలుగు ఎకరాల భూమి తండ్రి మంగ్యా నుంచి వారసత్వంగా వచ్చింది. రెవెన్యూ, ఫారెస్ట్ డిపార్ట్​మెంట్ల  పంచాయితీ వల్ల వ్యవసాయ భూమిని పార్ట్ బీలో పెట్టారు. ఈ క్రమంలో గత జూన్ 28న కరెంట్ షాక్ తో బాలు చనిపోయాడు. భూమి పార్ట్ బీలో ఉందన్న కారణంతో కొత్త పాస్​బుక్ రాక.. రూ.5 లక్షల రైతు బీమా అందలేదు. ఆ తండాలో ఇప్పటికి ఐదుగురు రైతులు చనిపోగా.. ఏ ఒక్క కుటుంబానికీ సాయం అందలేదు. దీంతో రైతులు జూన్ 29న ట్రాక్టర్​లో డెడ్​బాడీని తీసుకొచ్చి శివ్వంపేట తహసీల్దార్ ఆఫీస్ ముందు ఆందోళన చేపట్టారు. 

హైదరాబాద్​ / మంచిర్యాల / నెట్‌‌‌‌వర్క్, వెలుగు:ధరణి లోపాల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భూసమస్యలకు పరిష్కారం దక్కకపోగా.. కొత్త సమస్యలు వచ్చిపడటంతో అవస్థలు పడుతున్నారు. అధికారులు, సిబ్బంది చేసిన తప్పులకు తిప్పలు పడుతున్నారు. పోర్టల్‌‌‌‌లో భూముల వివరాలు నమోదు చేసేటప్పుడు తప్పులు దొర్లడం, ఆన్​లైన్​లో వేలాది సర్వే నంబర్లు మిస్ కావడం, ఒకరి భూములు మరొకరి పేర్లపై నమోదు కావడం, లక్షలు పోసి కొనుక్కున్న భూములకు పాత పట్టాదారుల పేరిటే కొత్త పాస్​బుక్​లు రావడం వంటి సమస్యలపై సవరణల కోసం తహసీల్దార్ల దగ్గరికి వెళ్తే ఆ చాన్స్ లేదని చెప్పి తప్పించుకుంటున్నారు. దీంతో సమస్యను ఎట్లా పరిష్కరించుకోవాలో అర్థం కాక రైతులు ఆవేదన చెందుతున్నారు.

బ్లాక్ లిస్టులో సర్వే నంబర్లు ఒక సర్వే నంబర్‌‌‌‌‌‌‌‌లోని కొంత భూమిపై వివాదం ఉంటే సర్వే నంబర్ మొత్తాన్ని అధికారులు బ్లాక్ లిస్టులో పెట్టేశారు. నాగర్ కర్నూల్​మండలం శ్రీపురం గ్రామ శివారులోని సర్వే నంబర్ 53లో ఓ రైతుకు చెందిన 8 గుంటల భూమికి సంబంధించిన వివాదం నడుస్తోంది. దీంతో ఆ సర్వే నంబర్​లోని మొత్తం 50 ఎకరాలను ఆఫీసర్లు బ్లాక్ లిస్టులో చేర్చారు. దీంతో 13 మంది రైతులు రైతుబంధు, రైతుబీమాకు దూరమయ్యారు.

పార్ట్ బీలో చేర్చిన భూములది మరో గోస రికార్డుల ప్రక్షాళన సమయంలో తమ భూములుగా నమోదు చేసుకున్న వాటిని దేవాదాయ, వక్ఫ్, భూ దాన్, ఫారెస్ట్, ఇరిగేషన్ డిపార్ట్​మెంట్లు నిషేధిత జాబితాలో చేర్చాయి. అసైన్డ్ ల్యాండ్స్‌‌‌‌ను లావుని పట్టాలుగా నమోదు చేసి సెక్షన్ 22ఏలో చేర్చారు. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం తాళ్లపల్లిగడ్డ తండా, నాను తండా, బిక్యా తండా, తుక్యా తండాల పరిధిలోని సర్వే నంబర్ 315, 316లో ఉన్న  1,200 ఎకరాలు ఫారెస్ట్ ఏరియాలో ఉందంటూ పార్ట్–బీలో చేర్చారు. దీంతో ఆయా గ్రామాలకు చెందిన సుమారు 5‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌50 మంది రైతులకు కొత్త పాస్‌‌‌‌ బుక్‌‌‌‌లు అందలేదు.

ఎకరం భూమి గాయబ్ 

మా నాన్న సిలువేరు వీరమల్లు పేరిట కాల్వశ్రీరాంపూర్‌‌‌‌‌‌‌‌లోని పాత 392 సర్వే నంబర్‌‌‌‌‌‌‌‌లో మాకు 3.08 ఎకరాల భూమి ఉండేది. కొత్త పాస్​బుక్ ఇస్తున్న క్రమంలో 392, 393, 266 సర్వే నంబర్లుగా చూపిస్తూ మాకు 2.08 ఎకరాలే ఇచ్చారు. ఎకరం భూమిని మా పక్కనున్న వారి పేరిట చేర్చారు. తహసీల్దార్‌‌‌‌‌‌‌‌ను, ఆర్డీవోను, అడిషనల్ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ను కలిసినా ఫలితం లేదు. ధరణిలో సరిచేయించుకుందామంటే కుదరదు అంటున్నారు. పనులు పోగొట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా పనైతలేదు.- సిలువేరు రమేశ్, కాల్వశ్రీరాంపూర్, పెద్దపల్లి జిల్లా

జనగామ జిల్లా జఫర్​గఢ్​ మండలంలోని రైతులది మరో సమస్య. ఉప్పుగల్లు, సాగరం, తిమ్మంపేట, తమ్మడపల్లి(ఐ), కోనాయచలం, ఓబులాపూర్, తిమ్మాపూర్, జఫర్​గఢ్, అలియాబాద్ గ్రామాల్లోని 5,106 ఎకరాలను రెవెన్యూ ఆఫీసర్లు పొరపాటున అసైన్డ్ భూముల జాబితాలో చేర్చారు. బాధిత రైతుల ఆందోళనకు మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మద్దతు పలికారు. గత నెల 14న బాధిత రైతులతో వెళ్లి కలెక్టర్ శివలింగయ్యను కలిసి రెవెన్యూ ఆఫీసర్ల తప్పు వల్ల ఏర్పడ్డ సమస్యను పరిష్కరించాలని కోరారు. ప్రస్తుతం వీరంతా తమ వద్ద ఉన్న ఆధారాలతో ధరణి గ్రీవెన్స్ లో అప్లై చేసుకుంటున్నారు. వీళ్ల సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుందనేది ఆఫీసర్లకు కూడా తెలియదు.

కరెక్షన్స్ కావట్లేదు

బాధితులు ధరణి గ్రీవెన్స్‌‌లో దరఖాస్తు చేసుకున్నా.. సవరణలు జరగడం లేదు. కలెక్టర్ల వద్ద డిజిటల్ సైన్లు పెండింగ్‌‌లో ఉండడంతో పాస్​బుక్‌‌లు రావడం లేదు. ధరణిలో దొర్లిన తప్పులను సవరించే అధికారం కలెక్టర్లకు మాత్రమే ఉంది. కానీ వారు ఇతర పనుల్లో బిజీగా ఉండి వీటిపై దృష్టి పెట్టలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. దీంతో అన్ని జిల్లాల్లో వందల కొద్దీ దరఖాస్తులు పెండింగ్​పడుతున్నాయి. ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్‌‌కూ భూసమస్యలపైనే ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి. మరోవైపు చాలా జిల్లాల్లో జాయింట్ సబ్ రిజిస్ర్టార్లు వివాదాస్పద భూములకు కూడా పట్టాలు చేస్తున్నారనే ఫిర్యాదులు ఇటీవల పెరుగుతున్నాయి. దీనికి ట్రిబ్యునల్ తీర్పులని, ఇంకోటని కారణాలు చెబుతున్నారు.

హైదరాబాద్ చుట్టూరా భారీగానే

హైదరాబాద్, రంగారెడ్డి శివారు ప్రాంతాల్లో వ్యవసాయ భూముల రేట్లు కోట్లు పలుకుతున్నాయి. కానీ ధరణి సమస్యలతో రైతులకు కంటి మీద కునుకులేకుండా పోతోంది. భూముల సరిహద్దులు, విస్తీర్ణాలు వాళ్లకు తెలియకుండానే మారిపోయాయి. పట్టాదారుల భూములు ప్రొహిబిటెడ్ లిస్టులో చేరిపోతున్నవి కొన్నికాగా, అమ్ముకున్న వారి పేర్లనే రికార్డుల్లో చూపిస్తున్నవి మరికొన్ని. రంగారెడ్డి జిల్లా కొత్తూరు, నందిగామ మండలాల పరిధిలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. వంశపారంపర్యంగా వచ్చిన భూములు సైతం రికార్డుల్లో ఇతరుల పేర్లతో నమోదుకావడంతో బాధితులు తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ విషయంలో తాము ఏమీ చేయలేమని తహసీల్దార్లు చేతులెత్తేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

మళ్లీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలట..

తాము కొన్న భూములకు పాత పట్టాదారుల పేరిటే కొత్త పాస్​బుక్​లు వస్తున్నాయి. దీనిపై తహసీల్దార్లను ఆశ్రయిస్తే.. భూములు అమ్మినవాళ్ల నుంచి మరోసారి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఉచిత సలహాలు ఇస్తున్నారు. పాత వాళ్లు ఒప్పుకోని చోట్ల గొడవలు కూడా జరుగుతున్నాయి. ఇదే అదనుగా కొందరు అడ్డదారిలో ఇతరులకు విక్రయిస్తున్నారు. వీటిపై ఫిర్యాదులు వస్తున్నా తమకెలాంటి సంబంధం లేదని, ట్రిబ్యునల్​కు వెళ్లాలని చెప్పి తహసీల్దార్లు తప్పించుకుంటున్నారు. హడావుడిగా ఇచ్చిన ట్రిబ్యునల్​తీర్పులు సమస్యకు పరిష్కారం చూపకపోగా, కొత్త సమస్యలకు దారి తీస్తున్నాయి. ట్రిబ్యునల్ నోటీసులు అందక, అందినా అర్థం కాక రైతులు ఎంక్వైరీకి హాజరు కాకపోతే ఎక్స్​పార్టీ పేరిట తీర్పులు ఇచ్చేస్తున్నారు. దీంతో బాధితులు న్యాయం కోసం తహసీల్దార్ ఆఫీసుల ఎదుట ఆందోళనలు చేస్తున్నారు.

రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం ఎస్‌‌బీపల్లికి చెందిన కొప్పుల రవీందర్‌‌‌‌రెడ్డి, సత్యనారాయణ కలిసి తమ ఎకరా 13 గుంటల భూమిని చంద్రశేఖర్​రెడ్డి, రఘువీరా రెడ్డి అనే ఇద్దరికి 2017లో అమ్మేశారు. కానీ కొత్త పాస్​బుక్‌‌లు పాత వారి (సత్యనారాయణ, రవీందర్​రెడ్డి) పేర్లపైనే ఇష్యూ అయ్యాయి. ధరణిలోనూ వాళ్లిద్దరి పేర్లే కనిపిస్తున్నాయి. ఈ విషయమై బాధితులు తహసీల్దార్​ను కలిస్తే పాతవాళ్లతో మరోసారి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పారు. కానీ తన ప్రమేయం లేకుండానే తన ఖాతాలో పడ్డ భూమిని మళ్లీ రిజిస్ట్రేషన్ చేస్తే లేనిపోని సమస్యలు వస్తాయని సత్యనారాయణ వెనుకాడుతున్నాడు.

తిప్పుకుంటున్రు

నా భర్త పేరు మీద ఉన్న 10 గుంటల భూమిని వేరే వాళ్ల పేరుపై కంప్యూటర్‌‌‌‌లో రికార్డ్ చేసిన్రు. దాన్ని సరిచేయమని తహసీల్దార్ ఆఫీసుకు పోతే.. ‘ధరణి సైట్ ఓపెన్ అయితలేదు. అయినంక చేస్తం’ అంటూ రోజు తిప్పుకుంటున్రు. ఈ మధ్యే నా భర్త చనిపోయిండు. ఆయన పేరుమీద ఉన్న భూమిని నాకు చేయమంటే చేస్తలేరు. పాత పాస్​బుక్​లో పది గుంటల భూమి ఉన్నప్పటికీ కొత్త పాస్​బుక్ రాలేదు.‌‌- బొజ్జ లచ్చవ్వ, పోరండ్ల, కరీంనగర్ జిల్లా