- మాస్టర్ ప్లాన్ నుంచి పంట భూములను తొలగించాలని డిమాండ్
- ప్లాన్ సవరించకుంటే జేఏసీగా ఏర్పడి పోరాడాలని నిర్ణయం
జగిత్యాల, వెలుగు: వారం కింద కామారెడ్డి.. ఇప్పు డు జగిత్యాల !! మాస్టర్‌ప్లాన్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలోనూ రైతులు ఆందోళన బాట పట్టారు. కొత్త మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం హన్నాబాద్, నూకపల్లి, ధరూర్, తిప్పన్నపేట్, తిమ్మాపూర్, మోతె గ్రామాల రైతులు నిరసనకు దిగారు. జగిత్యాల మున్సిపల్ ఆఫీస్ ఎదుట ధర్నా చేశారు. కొత్త మాస్టర్‌ప్లాన్‌లో తమ భూములను వివిధ జోన్ల కింద చూపడం సరికాదన్నారు. రిక్రియేషన్, ఇండస్ట్రియల్, బఫర్ జోన్, పబ్లిక్, సెమీ పబ్లిక్ జోన్ లలో ఎలాంటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వరని, వెంటనే అధికారులు మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే అన్ని గ్రామాల రైతులతో జేఏసీ ఏర్పాటు చేసి ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరిం చారు. దీనిపై మున్సిపల్ కమిషనర్ నరేశ్‌కు వినతి పత్రం ఇచ్చారు. రైతుల ధర్నాకు బీజేపీ నేతలు మద్దతు తెలిపారు.
అధికారులపై సర్పంచ్ల ఒత్తిడి
హస్నాబాద్, నూకపల్లి, ధరూర్, తిప్పన్నపేట్, తిమ్మాపూర్, మోతె గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించకుండానే సర్పంచులు అనుకూలంగా మాస్టర్ ప్లాన్‌కు తీర్మానాలిచ్చారు. నర్సింగాపూర్, తిమ్మాపూర్ ప్రాంతాలను పార్కులు, ప్లేజోన్, రిక్రియేషన్ జోన్ల కింద.. తిప్పన్నపేట్, హన్నాబాద్, లింగంపేట్ శివారు ప్రాంతాలను ఇండస్ట్రియల్ జోన్ కింద.. మోతె శివారును పబ్లిక్, సెమీ పబ్లిక్ జోన్లుగా ప్రతిపాదించారు. ఈ ఏరియాల్లో నిర్మాణాలకు అనుమతి ఉండదన్న విషయం తెలిసి రైతులు భగ్గుమంటున్నారు. తీర్మానాలిచ్చిన సర్పంచులు ఇప్పుడు మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలంటూ ఆఫీసర్లపై ఒత్తిడి తెస్తున్నారు.
అవసరమైతే మాస్టర్ ప్లాన్ రద్దు : ఎమ్మెల్యే సంజయ్
జగిత్యాల,వెలుగు: అవసరమైతే మాస్టర్ ప్లాన్ ను రద్దు చేస్తామని.. రైతులు ఆందోళన వీడాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కోరారు. ఇప్పుడు విడుదల చేసిన నోటిఫికేషన్ ముసాయిదా మాత్రమేనని.. జగిత్యాల, పరిసర ప్రాంతాల ప్రజల అభీష్టం మేరకు అవసరమైతే మాస్టర్ ప్లాన్ ను రద్దు చేస్తామని స్పష్టం చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంజయ్ కుమార్ మాట్లాడారు. 2041 సంవత్సరం అవసరాలకు అనుగుణంగా చేపట్టిన మాస్టర్ ప్లాన్ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. యావర్ రోడ్డు విషయంలో ప్రజల దృష్టిని మరల్చడానికే మాస్టర్ ప్లాన్ను అమలు చేస్తున్నామన్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి, సర్పంచ్ లు గంగాధర్,లక్ష్మణ్ రావు,ప్రభాకర్,ఎంపీటీసీ మహేశ్,ఉప సర్పంచ్ లు మోహన్ రెడ్డి, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డిలో ఆగని ఆందోళన
కామారెడ్డి /కామారెడ్డి టౌన్, వెలుగు: కామారెడ్డి మున్సిపాలిటీలో అత్యవసర మీటింగ్‌ను ఏర్పాటు చేసి మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ డిమాండ్ చేసింది. బుధవారం మున్సిపల్ ఆఫీసు ఎదుట రైతులు ధర్నా చేశారు. నలుగురు రియల్ ఎస్టేట్ వ్యాపా రుల కోసం 4 వేల మంది రైతులను రోడ్డు మీదకు తీసుకురావటం ఎంతవరకు సమంజసమని బీజేపీ కామారెడ్డి నియోజ కవర్గ ఇన్చార్జి వెంకటరమణారెడ్డి ప్రశ్నిం చారు. కాంగ్రెస్ కిసాన్ సెల్ స్టేట్ ప్రెసిడెంట్ అన్వేశ్‌రెడ్డి, పీసీసీ జనరల్ సెక్రటరీ సుభాశ్‌రెడ్డి, బీజేపీ, కాంగ్రెస్ లీడర్లు, లింగాపూర్, అడ్లూర్, అడ్లూర్ఎల్లారెడ్డి, టెకిర్యాల్, ఇల్చి పూర్, రామేశ్వర్‌పల్లి, పాతరాజంపేటకు చెందిన రైతులు ధర్నాలో పాల్గొన్నారు. ధర్నా నేపథ్యంలో అడ్లూర్, టెకిర్యాల్ లలో రైతు నాయకులు, ప్రతిపక్ష నేతలను పోలీసులు తెల్లవారుజామునే అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు.
అధికార పార్టీలో ఉన్నా ఏం చేయలేకపోతున్నం
‘‘మాస్టర్‌ప్లాన్‌పై ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే పార్టీకి, పదవులకు రాజీనామా చేస్తాం. జగిత్యాల మరో కామారెడ్డి కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. మా గ్రామ పంచాయతీలోని భూములను రీక్రియేషన్ జోన్ల కింద ప్రపోజ్ చేశారు. అధికార పార్టీలో ఉన్నా మేం ఏమీ చేయలేకపోతున్నాం. కాబట్టి ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తాం.’’
- గడ్డం మల్లారెడ్డి, బీఆర్ఎస్ నేత, నర్సింగాపూర్

