‘పుష్ప’ అమ్మిన సరుకు ఎర్ర చందనం.. నల్గొండ జిల్లాలో దొంగల టార్గెట్ శ్రీగంధం !

‘పుష్ప’ అమ్మిన సరుకు ఎర్ర చందనం.. నల్గొండ జిల్లాలో దొంగల టార్గెట్ శ్రీగంధం !

నల్గొండ: నల్గొండ జిల్లాలో శ్రీగంధం చెట్లు సాగు చేసిన రైతులకు దొంగల భయం పట్టుకుంది. ఇలా శ్రీగంధం చెట్లను రాత్రికి రాత్రి మాయం చేస్తున్నారని రైతులు పోలీసులకు ఫిర్యాదు చేసినా సీరియస్గా తీసుకోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండు నెలలుగా నల్గొండ జిల్లాలో పలు చోట్ల లక్షల రూపాయల శ్రీగంధం చెట్లు మాయం అవుతున్నాయి. కనగల్, చండూర్, నల్గొండతో పాటు మరికొన్ని చోట్ల శ్రీగంధం చెట్ల దొంగతనం జరిగింది. సుమారు 20 సంవత్సరాల చెట్లు పక్వానికి వచ్చిన తరువాత దొంగతనం జరగడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు.

ప్రస్తుతం మార్కెట్లో కేజీ శ్రీగంధం కర్రకు 5 వేల నుంచి 12 వేల రూపాయలు పలుకుతుంది. దీంతో.. ఆ కర్రలను అమ్ముకుని సొమ్ము చేసుకునేందుకు కొందరు దొంగలు రాత్రికి రాత్రి చెట్లను నరికేస్తున్నారు. ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో రైతులు ఫిర్యాదు చేశారు. శ్రీగంధం చెట్ల దొంగలను పట్టుకోకపోతే నష్టపోతామని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

శ్రీగంధం 12 నుంచి 15 ఏళ్ళ పంట. చెద పురుగు, కాండం తొలిచే పురుగుల నుంచి కాపాడుకుంటే దీర్ఘకాలికంగా మంచి లాభాలుంటాయి. శ్రీగంధం చెట్లు 30 శాతం నేల నుంచి, 70 శాతం మొక్కల నుంచి ఆహారం తీసుకుంటాయి. ఫామ్ ల్యాండ్​వెంచర్లలో శ్రీగంధం చెట్లు ఎక్కువగా పెంచుతున్నారు. 15 ఏండ్లు పెంచితే ఒక్కో చెట్టుకు సరాసరి 20 కిలోల శ్రీగంధం దిగుబడి వస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో క్వాలిటీని బట్టి కిలో ధర గరిష్టంగా 12 వేల రూపాయలు పలుకుతుంది. గుంటకు పది చెట్లు పెంచినా రూ.30 లక్షల దాకా ఆదాయం వస్తుందనే ఆశతో నల్గొండ జిల్లాలో కొందరు రైతులు ఈ శ్రీగంధం చెట్లను సాగు చేస్తున్నారు.