వెంటాడుతున్న అకాల వర్షాలు..రైతన్న అరిగోస

వెంటాడుతున్న అకాల వర్షాలు..రైతన్న అరిగోస
  • వెంటాడుతున్న అకాల వర్షాలు
  • కాంటాలు లేట్‌‌‌‌ చేస్తున్న సెంటర్ల నిర్వాహకులు
  • మిల్లుల వద్ద తరుగు పేరుతో రైతులను దోస్తున్నరు
  • టార్గెట్​ ప్రకారం పావు వంతు వడ్లను కూడా కొనని సర్కారు
  • అమ్మిన పంటకు కూడా పైసలు రాక రైతుల అవస్థలు


మహబూబ్​నగర్/నారాయణపేట, వెలుగు:  యాసంగిలో వడ్లు పండించిన రైతులు అరిగోస పడుతున్నారు.  సర్కారు కాంటాలు లేట్‌‌‌‌ చేస్తుండడం, మరోవైపు అకాల వర్షాలు వెంటాడుతుండడంతో ఆగమవుతున్నారు.  కొంటున్న వడ్లకు సైతం మిల్లుల వద్ద ఇష్టంవచ్చినట్లు తరుగు తీస్తున్నారు. 40 కిలోల బస్తాకు 600 గ్రాముల తరుగు తీయాల్సి ఉండగా.. మూడునాలుగు కిలోల వరకు తీస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు అమ్మిన ధాన్యానికి వారాలు గడుస్తున్నా డబ్బులు  ఇవ్వడం లేదని వాపోతున్నారు. 

పావు వంతు కూడా కొనలె..

మహబూబ్​నగర్ ​జిల్లాలో యాసంగిలో 1.5 లక్షల మెట్రిక్​ టన్నుల వడ్లు కొనాలని ఆఫీసర్లు టార్గెట్​ పెట్టుకున్నారు.  సివిల్​ సప్లై​ ఆఫీసర్ల లెక్కల ప్రకారం.. ఇప్పటివరకు 190 కొనుగోలు సెంటర్ల ద్వారా 11,627 రైతుల నుంచి 56,305 మెట్రిక్​ టన్నుల వడ్లను మాత్రమే కొన్నారు. నారాయణపేటలో1.20 లక్షల మెట్రిక్‌‌‌‌ టన్నుల టార్గెట్‌‌‌‌ కాగా.. 91 కేంద్రాల ద్వారా 7 వేల మంది రైతులను 50 వేల మెట్రిక్ టన్నులు కొన్నారు. ఇప్పటికే సీజన్​ముగిసిపోవడంతో అక్కడడక్కడా సెంటర్లను మూసేస్తున్నారు. 

అకాల వర్షాలతో ఆగమాగం

రెండు వారాలుగా పాలమూరు జిల్లాలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. మే మొదటి వారం నుంచి ప్రతి రోజు సాయంత్రం ఐదు నుంచి ఎనిమిది గంటల ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే మిడ్జిల్, బాలానగర్, జడ్చర్ల, మహ్మదాబాద్​, పాలమూరు, గండీడ్, ​నవాబ్​పేట, మాగనూరు, నర్వ, దామరిగిద్ద మండలాల్లో సెంటర్ల వద్ద ఆరబోసిన వడ్లు, బస్తాలలో నింపిన వడ్లు తడిసిపోయాయి. పైగా వాతావరణం కూడా మబ్బు పట్టి ఉండటంతో వడ్లు ఆరడం లేదు.  దీంతో వాటిలో తేమ శాతం ఎక్కువగా చూపిస్తుండడంతో  ఈ వడ్లను కొనడం లేదు.  రైతులు చేసేది లేక ప్రైవేట్​వ్యాపారులకు రూ.1,400 నుంచి రూ.1,500లకే అమ్ముకొని లాస్​ అవుతున్నారు. 

లేట్ అవుతున్న పేమెంట్లు

ప్రభుత్వ సెంటర్లలో వడ్లు అమ్మిన రైతులకు పైసలు లేట్​గా పడుతున్నాయి.  పాలమూరు జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు 57 వేల మెట్రిక్​ టన్నుల కొన్నారు. ఇందులో 43 వేల మెట్రిక్​ టన్నులకు ఓపీఎంఎస్ చేశారు. అందులో 30 వేల మెట్రిక్​ టన్నులకు సంబంధించి మాత్రమే రైతులకు పేమెంట్లు చేశారు.  మిగతావి ఇంకా పెండింగ్​లో ఉన్నాయి. పేమెంట్​ లేట్​ కావడానికి సెంటర్లే కారణమని తెలుస్తున్నది. నిర్వాహకులు ఆన్​లైన్​లో ఎంట్రీ చేయకపోవడంతో పైసలు లేట్​గా పడుతున్నట్లు తెలుస్తోంది. 

కాంటాలు లేట్..  

ఉమ్మడి పాలమూరు జిల్లాలో వడ్ల సెంటర్ల వద్ద లేట్‌‌‌‌గా కాంటాలు చేస్తున్నారు. వడ్లను సెంటర్​ను తీసుకొచ్చిన వారం, పది రోజుల తర్వాతే కొంటున్నారు. దీంతో చాలా మంది రైతులు వర్షాల భయంతో తక్కువ రేట్​కు అయినా సరే మిల్లర్లకే డైరెక్ట్​గా వడ్లను అమ్ముతున్నారు. అయితే వాళ్లు 40 కిలోల బస్తాపై రెండు నుంచి నాలుగు కిలోల వరకు తరుగు తీసి రైతులను మోసం చేస్తున్నారు.  ఇదేంటని ప్రశ్నిస్తే ‘తేమ శాతం ఎక్కువగా ఉందని, అమ్మితే అమ్మండి.. లేకుంటే వెళ్లిపోండి’.. అని సమాధానం ఇస్తున్నారు. దీనికితోడు సెంటర్లలో జోకిన వడ్లను మిల్లులకు తరలించే బాధ్యత రైతులతే అని చెప్పడంతో, అక్కడా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వడ్లను ట్రాక్టర్లలో మిల్లులకు తరలించేందుకు కిరాయిలు, మిల్లుల వద్ద బస్తాలకు దించుకునేందుకు హమాలీల కూలీ డబ్బులు రైతులే భరిస్తున్నారు. 

పది రోజులైనా కొంటలేరు..

నాకున్న మూడు ఎకరాల్లో వరి సాగు చేసిన. ఆరబెట్టి సెంటర్​కు తీసుకొచ్చి  10 రోజులు అయిపాయే. ఇంత వరకు నా వడ్లను జోకుతలేరు.  మబ్బులు కమ్ముకుంటుండడంతో భయమైతుంది . ఎన్ని రోజులని వడ్ల కుప్పల వద్ద కాపలా ఉండాలె?

- వెంకట్​రెడ్డి, రైతు, కొమిరెడ్డిపల్లి, పాలమూరు

తరుగు ఎక్కువగా తీస్తే చర్యలు

గవర్నమెంట్​ గైడ్​లైన్స్​ ప్రకారం 40 కిలోల బ్యాగ్​పై 600 గ్రాముల వడ్లను మాత్రమే తరుగు తీయాలె. అంతకుమించి   తీస్తే మిల్లర్లపై చర్యలు తీసుకుంటం.  హమాలీల కూలి డబ్బులు రైతులు ధాన్యం అమ్మిన సెంటర్​కే సంబంధం. కొనుగోళ్లలో వేగం పెంచినం.
- హథిరాం నాయక్​, డీఎం, సివిల్​ సప్లై, నారాయణపేట

తరుగు ఎక్కువగా తీస్తున్నరు...

తాలు, తరుగు పేరిట క్వింటాల్‌‌కు నాలుగైదు కిలోలు తీస్తున్నరు.  రూ. 30 హమాలీ వసూలు చేస్తున్నరు. ట్రాన్స్‌‌‌‌ఫోర్ట్‌‌‌‌ కోసం ట్రాక్టర్లకు  రోజుకు రూ. 2500 కిరాయి అయితుంది. నేరుగా మిల్లర్ల వద్దకు పొతే క్వింటాల్‌‌కు రూ. 10 ప్రాసెసింగ్ చార్జి తీసుకుంటున్నరు.
- అనంత్​రెడ్డి, చెన్నారెడ్డిపల్లి, మద్దూర్​ మండలం