రైతు బంధు ఇయ్యలే... వడ్ల పైసలు రాలే

రైతు బంధు ఇయ్యలే... వడ్ల పైసలు రాలే
  • దిక్కు తోచని స్థితిలో రైతన్నలు
  • కాంటా పెట్టి నెల రోజులైనా డబ్బులు పడలే
  • రూ.3 వేల కోట్లకుపైగా బాకీ పడ్డ సివిల్ ​సప్లయ్స్‌‌ శాఖ
  • సాగు పనులు వదిలేసి బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న రైతులు
  • సర్కారు రుణమాఫీ చేయక క్రాప్ ​లోన్లు అందుతలే
  • చేతిల రూపాయి లేక.. ప్రైవేటు అప్పులు తీసుకుంటున్న అన్నదాతలు


వెలుగు, నెట్‌‌వర్క్: నైరుతి వచ్చేసింది.. రాష్ట్రమంతా వానలు పడుతున్నాయి. ఈ సమయంలో వ్యవసాయ పనులు మొదలుపెట్టాల్సిన రైతులు.. యాసంగి వడ్ల పైసల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ధాన్యం అమ్మిన వారం రోజుల్లో డబ్బులు చెల్లిస్తామని చెప్పిన సర్కారు.. నెల గడుస్తున్నా బ్యాంకు అకౌంట్లలో జమ చేయలేదు. మరోవైపు రైతుబంధు కింద ఇయ్యాల్సిన పెట్టుబడి సాయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గతేడాది జూన్​15 నుంచే రైతుల ఖాతాల్లో రైతుబంధు జమ చేయగా, ఈ సారి ఆ ఊసే ఎత్తడం లేదు. పంట రుణాలను మాఫీ చేయకపోవడంతో బ్యాంకర్లు కొత్త లోన్లు ఇవ్వట్లేదు. దీంతో చేతిలో చిల్లి గవ్వలేక రైతులు పెట్టుబడుల కోసం దిక్కులు చూస్తున్నారు.

రైతుబంధు ఎప్పుడు?

వడ్లు అమ్మిన పైసలు సమయానికి రాకపోవడంతో కనీసం రైతుబంధు పైసలన్నా అకౌంట్లలో పడుతాయని అన్నదాతలు ఆశించారు. గతేడాది ఈ సమయానికే రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమచేశారు. కానీ ఈసారి సర్కారు దగ్గర ఫండ్స్ లేకపోవడంతో పెట్టుబడి సాయం మాటే ఎత్తడం లేదు. ఏటా సీజన్ ​ప్రారంభానికి ముందే వ్యవసాయ శాఖ ద్వారా రైతుల వివరాలను సర్కారు తెప్పించుకునేది. కానీ ఈసారి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని అగ్రికల్చర్ ఆఫీసర్లు చెప్తున్నారు. ఈ వానాకాలం సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా కోటి 52 లక్షల 91 వేల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయనే అంచనా ఉంది. ఇందుకు సంబంధించి 66.61 లక్షల మందికి ఎకరానికి రూ.5 వేల చొప్పున పెట్టుబడి సాయం అందించాలంటే రూ.7,645.55 కోట్ల దాకా అవసరం. కానీ ఆమేరకు సర్కారు దగ్గర నిధులు లేకపోవడంతో రైతు బంధు సాయం ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది.

10 శాతం మందికే రుణమాఫీ

సర్కారు రుణమాఫీ చేయకపోవడంతో రైతులకు బ్యాంకులు కొత్తగా ఎలాంటి లోన్లు ఇవ్వడం లేదు. 2018 డిసెంబర్‌‌ 11 నాటికి రూ.లక్ష వరకు ఉన్న క్రాప్ లోన్లను మాఫీ చేస్తామని ఎన్నికల టైంలో టీఆర్ఎస్ హామీ ఇచ్చింది. కానీ ఈ నాలుగేండ్లలో కేవలం 4 శాతం లోన్లను, అది కూడా రూ.25 వేల లోపు రుణాలను పూర్తిగా, రూ.50 వేల లోపు ఉన్న లోన్లను కొంతవరకు మాఫీ చేసింది. సర్కారు చెప్పిన తేదీ నాటికి బ్యాంకుల్లో40.66 లక్షల మంది రైతులు రూ.25,936 కోట్ల క్రాప్​లోన్లు​ తీసుకోగా, కేవలం 4 లక్షల మంది రైతులు తీసుకున్న రూ.1,171 కోట్లు మాత్రమే మాఫీ చేశారు. ఇంకా 36.68 లక్షల మంది రైతులకు సంబంధించిన 24,765 కోట్లను ప్రభుత్వం మాఫీ చేయాల్సి ఉంది. సర్కారు తీరు వల్ల రాష్ట్రవ్యాప్తంగా 36 లక్షల మంది రైతులు బ్యాంకుల దృష్టిలో డిఫాల్టర్లుగా మిగిలిపోయారు. ఈ విషయాన్ని బ్యాంకర్లు అధికారికంగా ఎక్కడా  ప్రకటించకున్నా.. తాము డిఫాల్టర్లుగా భావించే వాళ్లకు క్రాప్​లోన్స్ ఇవ్వడం లేదు. వడ్డీ కట్టి రెన్యువల్​ చేసుకున్న వాటినే కొత్త లోన్లుగా చూపుతున్నారు. గత వానాకాలం సీజన్‌లో ఎస్ఎల్‌బీసీ రూ.35,665 కోట్ల లక్ష్యం నిర్ణయించగా, సీజన్ పూర్తయ్యే నాటికి 50 శాతం కూడా ఇవ్వలేదు. అవి కూడా వడ్డీ కట్టించుకొని రెన్యువల్​ చేసినవే తప్ప కొత్త లోన్లు కావు. ఇలా అటు వడ్ల పైసలు రాక, రైతుబంధు సాయం, బ్యాంకు లోన్లు అందక ఇబ్బందులు పడుతున్నారు. దిక్కుతోచని చాలా మంది రైతులు అదును దాటుతుండడంతో ఎప్పట్లాగే బయట వడ్డీ వ్యాపారుల వద్ద అధిక మిత్తికి అప్పులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

మస్తు తక్లీఫ్ అయితంది

ఐదు పుట్ల వడ్లను తుంగతుర్తి సొసైటీ ఏర్పాటు చేసిన కొనుగోలు సెంటర్‌‌లో కాంటా పెట్టినం. పైసలు ఇంకా పడలేదు. వానకాలం పెట్టుబడులకు మస్తు తక్లీఫ్ అయితంది. ప్రభుత్వం స్పందించి త్వరగా పైసలు ఏయాలె. రైతుబంధు కూడా గతేడాది ఇచ్చినట్లు టైమ్‌కు ఇయ్యాలె. లేదంటే ఆసాముల దగ్గర అప్పులకు పోవాల్సిందే.

- గూగులోతు కాండ్య, తుంగతుర్తి మండలం, సూర్యాపేట జిల్లా


చిల్లిగవ్వ లేదు

యాసంగిలో రెండు ఎకరాల్లో వరి వేసిన. 30 క్వింటాళ్లు పండితే.. మే 21న రంగారెడ్డిపల్లి కొనుగోలు సెంటర్‌‌లో అమ్మిన. వారం రోజుల్లో పైసలు పడ్తయని చెప్పారు. కానీ ఇప్పటివరకు పైసలు పడలే. రైతుబంధు కూడా ఖాతాల ఎయ్యలే. వానాకాలం సీజన్ మొదలైంది. పెట్టుబడికి చేతిల చిల్లి గవ్వలేదు. ఎరువులు, విత్తనాల రేట్లు మస్తు పిరమైనయ్. సర్కారు సబ్సిడీ విత్తనాలు కూడా బంద్​పెట్టింది. బ్యాంకుకు పోతే క్రాప్ లోన్లు ఇస్తలేరు. వడ్లు అమ్మిన పైసలు వస్తే తప్ప విత్తనాలు కొనే పరిస్థితి లేదు. వెంటనే వడ్ల పైసలు పడేలా ఆఫీసర్లు చూడాలె.

- కుందేటి కిస్టన్న, రంగారెడ్డిపల్లి, గండీడ్ మండలం, మహబూబ్​నగర్ జిల్లా

మిత్తికి తెద్దామనుకుంటున్న

నెల రోజుల కింద బచ్చురాజ్‌‌పల్లి సెంటర్‌‌‌‌లో 41 క్వింటాళ్ల వడ్లను కాంటా పెట్టారు. అకౌంట్ల ఇంకా పైసలు పడలే. రైతు బంధు పైసలూ రాలే. అటేమో వర్షాలు పడ్తన్నయ్. విత్తనాలు, ఎరువులు కొనాలె. ట్రాక్టర్ కిరాయిలు, కూలీలకు ఇచ్చేందుకు చేతుల పైసలు లేవు. రెండు, మూడు రోజులు చూసి ఆసామి దగ్గర మిత్తికి తెద్దామనుకుంటున్న. లేకపోతే ఎల్లెటట్లు లేదు.

‑ మాలోత్ నంది, షౌకత్ పల్లి తండా, నిజాంపేట మండలం, మెదక్​ జిల్లా

రూ.3,228 కోట్లు పెండింగ్

రాష్ట్రవ్యాప్తంగా యాసంగి వడ్ల కొనుగోళ్లు దాదాపు పూర్తయ్యాయి. మొత్తం 6,600 కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 49.35 లక్షల టన్నుల వడ్లను సేకరించారు. 6,091 సెంటర్లను కూడా మూసివేశారు. 7,24,090 మంది రైతులకు సివిల్ సప్లయ్స్‌‌ శాఖ రూ.9,662.04 కోట్లను చెల్లించాల్సి ఉంది. రూల్స్ ప్రకారం వడ్లను కాంటా పెట్టిన వారం రోజుల్లో రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేయాలి. కానీ బుధవారం వరకు రూ.6,433.18 కోట్లను మాత్రమే జమ చేయగా, ఇంకా రూ.3,228 కోట్లు చెల్లించాల్సి ఉంది. కాంటాలు, ట్యాబ్ ఎంట్రీ లేట్ అవుతుండడం, లారీలు, హమాలీల కొరత కారణంగా మిల్లుల్లో అనుకున్న సమయానికి అన్‌‌లోడ్​ కాకపోవడం తదితర కారణాలతో నెల రోజులైతున్నా రైతుల అకౌంట్లలో డబ్బులు పడటం లేదు.