ఎద్దుల్లేని ఎవుసం..తగ్గిపోతున్నపశుసంపద

ఎద్దుల్లేని ఎవుసం..తగ్గిపోతున్నపశుసంపద
  • రాష్ట్రంలో తగ్గిపోతున్న పశుసంపద
  • సేద్యంలో పెరిగిన యంత్రాల వాడకం
  • ఎడ్లు లేక.. ట్రాక్టర్లు దొరకక రైతుల ఇబ్బందులు
  • భారీగా పెరిగిన సాగు ఖర్చు
  • పట్టించుకోని సర్కారు.. అటకెక్కిన ‘యంత్రలక్ష్మి’

హైదరాబాద్‌, వెలుగుఎవుసం అనంగనే ఎద్దులు గుర్తొస్తయి. ఎలపటొక ఎద్దు, దాపటొక ఎద్దును కట్టి రైతు పొలం దున్నే దృశ్యమే కనిపిస్తది. చెలకలు, బీడు భూముల్లో ఆవులు, బర్రెలు, దూడల వంటివి చేసే సందడి కూడా గుర్తుకొస్తది. కానీ.. ఇప్పుడు చాలా చోట్ల ఎలపటెద్దూ లేదు. దాపటెద్దూ లేదు. ఎక్కువ చోట్ల ట్రాక్టర్లు, యంత్రాలే కనిపిస్తున్నయి. రాష్ట్రంలో పశుసంపద గణనీయంగా పడిపోతున్నది.  ప్రధానంగా వ్యవసాయ రంగానికి తోడ్పాటును అందించే ఎద్దులు, ఆవులు కనుమరుగవుతున్నయి.   Farming in the state is a growing demand for agriculture and machinery

పశుసంపదతో కళకళలాడాల్సిన గ్రామాలు వెలవెలబోతున్నయి. కొన్నేండ్ల కిందటి వరకు నాగళ్లతో పొలం దున్నాలన్నా, దుక్కి దున్నాలన్నా ఎడ్లు లేనిదే అయ్యే పని కాదు. దాదాపుగా రెండు మూడెకరాలు భూమి ఉన్న రైతు నుంచి వందల ఎకరాలున్న రైతుల వరకూ అందరి ఇండ్లలోనూ ఎద్దులు ఉండేవి. చిన్న రైతుల వద్ద ఒక జత ఉంటే, పెద్ద రైతుల వద్ద వాళ్ల భూములను బట్టి పశువులు ఉండేవి. కానీ, ఇప్పుడు పరిస్థితి ఎద్దులేని ఎవుసంగా మారింది.

7 ఏండ్లలో 5 లక్షల పశువులు తగ్గుదల

పశుసంవర్ధక శాఖ విడుదల చేసిన 2012 నాటి గణాంకాల ప్రకారం రాష్ట్రంలో బర్రెలు, దున్నపోతులు కాకుండా కేవలం ఎడ్లు, ఆవులు కలిపి 48 లక్షల 80 వేల 293 ఉండేవి.  తాజాగా నిర్వహించిన పశుగణనలో పశువుల సంఖ్య గణనీయంగా తగ్గింది. నేడు 42 లక్షల 97 వేల 301 పశువులు మాత్రమే ఉన్నాయి. గడిచిన ఏడేళ్లలో 5,82,992 పశుసంపద తగ్గిపోయింది. వీటిలో ప్రధానంగా ఎద్దులే ఎక్కువగా తగ్గిపోయాయని పశుగణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

పశువులెందుకు భారమైనయి?

గ్రామాల్లో ఒకప్పుడు ఇంటింటా ఒకటో రెండో పశువులుండేవి. కానీ ఇప్పుడు ఐదారిండ్లకు ఒకటి రెండు కూడా లేని పరిస్థితి వచ్చింది. ఉమ్మడి కుటుంబాలు పోవడం, పశువులను మేపేందుకు మనుషులు లేకపోవడం, యాంత్రీకరణ పెరగడం, జీతగాళ్లు దొరకకపోవడం వంటి పలు కారణాల వల్ల పశుపోషణ క్రమంగా తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం  రైతులకు ఉన్న  ఎడ్లను తప్ప కొనే పరిస్థితి లేదు. ఎంత లేదన్న జత ఎడ్లకు 40 వేల నుంచి 80 వేల వరకు ధరలు ఉంటున్నాయి. పెద్ద రైతులు తప్ప సాధారణ రైతులు జత ఎడ్లను కొనాలంటే కష్టంగానే ఉంది. వాటిని మేపడం,  ప్రత్యేకంగా షెడ్డు వేసి నిర్వహించడం వ్యయప్రయాసలతో కూడుకుంటోంది. దీంతో గ్రామాల్లో రైతులు పశుపోషనణణను పక్కన పెట్టి యంత్రాలనే నమ్ముకుంటున్నారు.

ఎకరం నాటుకు 12 వేల ఖర్చు..

ఒక ఎకరానికి రూ.4500 ట్రాక్టర్‌ కిరాయి, బురద పొలం దున్నితే కల్టివేటర్‌కు రెండు గంటలకు రూ.3600,  నాటు కూళ్లు గుత్తకిస్తే ఎకరానికి రూ.2500, ఒక ఎకరానికి డీఏపీ బస్తా రూ.1460, గట్టు చెక్కడానికి పార పని కూలి రూ.1000 , ఒక్క కూలి మనిషికి రూ.400 చొప్పున, గొర్రు తోలితే రోజుకు కిరాయి రూ.1000  ఇలా ఎకరానికి  దాదాపుగా రూ. 12 వేలకు అటూ ఇటూగా ఖర్చు వస్తోంది. మూడెకరాల పొలం చేస్తే దాదాపుగా రూ.35 వేల వరకు ఖర్చు వస్తోందని రైతులు చెప్తున్నారు.

రాష్ట్రం లెక్కలు చెప్పలే..
కేంద్రం నిధులు ఇయ్యలే

ఎడ్లతో వ్యవసాయం చేసేటప్పుడు చాలావరకూ ఖర్చు తప్పేది. కానీ ఇప్పుడు యాంత్రీకరణ అయిన తర్వాత ఖర్చు భారీగా పెరిగింది.  వ్యవసాయ యాంత్రీకరణ పేరుతో ప్రభుత్వం మాటలు చెప్పడం తప్ప చేతలు లేవని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి. గత సంవత్సరం ఒక్క యంత్రం కూడా మంజూరు చేయక పోవడంతో రాష్ట్రవ్యాప్తంగా లక్షన్నర దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం యంత్రలక్ష్మీ పేరుతో ట్రాక్టర్‌ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం కింద గత  ఏడాది నుంచి ఒక్క ట్రాక్టర్‌ కానీ, యంత్రాన్ని కానీ ప్రభుత్వం మంజూరు చేయలేదు.  కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల్లో రాష్ట్ర వాటా చెల్లించడం లేదు. కేంద్రం తన వాటాలో మొదటి విడత సగం చెల్లిస్తోంది. రాష్టం తన వాటాలో సగం చెల్లిస్తేనే రెండో విడత కేంద్రం నిధులు ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లుగా పైసా కేటాయించక పోవడంతో ఈ పథకం నీరుగారుతోంది. మూడేళ్లుగా లెక్కలు చెప్పలేదని కేంద్ర ప్రభుత్వం నిధులను నిలిపివేసింది. దీంతో 2018–-19 ఆర్థిక సంవత్సరంలో ఒక్క యంత్రం రాకపోవడం గమనార్హం. దీంతో ఎడ్లు లేక మరోవైపు ప్రభుత్వం ట్రాక్టర్లు ఇవ్వక రైతులు ఇబ్బంది పడుతున్నారు.

ఎడ్లు లేవు.. ట్రాక్టర్లు దొరకవు 

యాంత్రీకరణ నేపథ్యంలో పల్లెల్లో ట్రాక్టర్లు రంగ ప్రవేశం చేశాయి. దీంతో రైతులు ఉన్న ఎడ్లను అమ్ముకుని ట్రాక్టర్లపై ఆధారపడే పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా నాగళ్ల స్థానంలో ట్రాక్టర్లతో దుక్కులు దున్నిస్తున్నారు. తాజాగా వర్షాలు కురువడంతో గ్రామాల్లో ట్రాక్టర్లకు డిమాండ్‌ పెరిగింది. కానీ డీజిల్‌ రేట్లు పెరగడంతో ట్రాక్టర్‌ కిరాయి బాగా పెరిగిపోయింది. గంటకు రూ.1500 ఇస్తే కానీ పొలం దున్నడానికి రానంటున్నారు. అది కూడా అదునుకు వస్తలేరని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ట్రాక్టర్‌ రాక, ఎడ్లు లేక పల్లెల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న ఎడ్లను అమ్ముకుని, ట్రాక్టర్లను నమ్ముకుంటే ఈ పరిస్థితి వచ్చిందని పలువురు వాపోతున్నారు.  వచ్చిన వర్షాలతో నాటు పెట్టడానికి ట్రాక్టర్ల కోసం ఇబ్బంది పడాల్సి వస్తోందని, కరిగట్టు చేసి బురుద పొలం నాటుకు సిద్దం చేసే కల్టివేటర్‌ ట్రాక్టర్‌ కిరాయి గంటకు రూ.1800 తీసుకుంటున్నారని, ఎకరానికి 12 వేల వరకు ఖర్చు వస్తోందని మహబూబాద్‌ జిల్లా గూడురు మండలం గొల్లగూడెం మహిళా రైతు మంగ సుమతి వెల్లడించారు. ఇలా అయితే ఎవుసం సాగేదెట్లాగో తెలియడం లేదన్నారు.