
ప్రస్తుతం దాయాది దేశం పాకిస్థాన్ ఆర్థికంగా దయనీయ స్థితిలో ఉంది. అప్పుల ఊబిలో పాక్ కొట్టుమిట్టాడుతుంటే ఆ దేశ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మాత్రం వరుస విదేశీ పర్యటనలతో ఎంజాయ్ చేస్తున్నాడనే విమర్శలు పెరుగుతున్నాయి. ఒకపక్క ప్రజలకు కనీస అవసరాలైన తిండి, సామాజీక భద్రత కోసం పోరాడుతుంటే ఆర్మీ పెద్దలు డబ్బు దుబారా చేస్తున్నారు. మునీర్ చేయనున్న ఇండోనేషియా, శ్రీలంక పర్యటనల్లో లగ్జరీ ఖర్చులపై పాకిస్థాన్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థికంగా బలహీనంగా ఉన్న దేశంలో ఉన్నత వర్గాల ప్రత్యేక హక్కులు, సైనిక దుబారా గురించి ప్రస్తుతం చర్చ కొనసాగుతోంది.
దౌత్య సంబంధాలను పునరుద్ధరించే ప్రయత్నంలో మునీర్ ఈ నెల చివర్లో ఇండోనేషియాకు వెళ్లిన సంగతి తెలిసిందే. మే ప్రారంభంలో జరిగిన ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (OIC) పార్లమెంటరీ యూనియన్ సమావేశంలో కాశ్మీర్‌పై భారతదేశంపై బలమైన సూచనను తీసుకురావడానికి ఇస్లామాబాద్ చేసిన ప్రయత్నాలను జకార్తా, ఈజిప్ట్, బహ్రెయిన్ అడ్డుకున్న తరుణంలో తాజా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఇండోనేషియాలో దిగడానికి ముందే, మునీర్ జూలై 20 నుండి 23 వరకు శ్రీలంకకు విలాసవంతమైన పర్యటనకు వెళ్లనున్నట్లు తేలింది.
అయితే మునీర్ పర్యటనకు ప్రత్యేక విమానం, బైక్ ఎస్కార్ట్, హెలికాప్ట్ రైడ్స్, గైడెడ్ సిటీ టూర్ అలాగే కొలంబియాలో పర్యటన సమయంలో ఉండేందుకు ఫైవ్ స్టార్ హోటల్ బస వంటి దుబారా ఖర్చులపై పాక్ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐఎంఫ్ కఠిన చర్యల కారణంగా పాక్ క్యాబినెట్ మంత్రులకు కూడా ఈ ప్రత్యేక హక్కులు, సౌకర్యాలు నిలిపివేసిన క్రమంలో మునీర్ పర్యటనకు భారీగా వెచ్చించటం సరికాదనే వాదనలు వినిపిస్తున్నాయి.
ALSO READ : Tariff Bomb: రష్యా నుంచి ఆయిల్ కొంటే.. ఇండియాపై పన్నుల మోత మోగిస్తా : ట్రంప్ వార్నింగ్
గత నెలలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భోజన సమావేశానికి ముందు ఆసిమ్ ఒక హై-ఎండ్ అమెరికన్ మాల్‌లో షాపింగ్ చేస్తూ కనిపించిన కొన్ని వారాల తర్వాత మళ్లీ మునీర్ లగ్జరీ టూర్స్ తీవ్ర వ్యతిరేకతను చూస్తున్నాయి. సోషల్ మీడియాలో దీనిపై తీవ్ర వ్యతిరేకత కొనసాగుతోంది. ఒకపక్క పెరిగిన ద్రవ్యోల్బణం, తగ్గుతున్న పాక్ ప్రజల ఆదాయాల సమయంలో ఈ ఏడాది మే నెలలో బిలియన్ డాలర్లను ఐఎంఫ్ నుంచి రుణంగా పొందిన పాక్ చట్టసభల్లోని సభ్యులకు వేతనాలను 500 శాతం పెంచటం అక్కడి ప్రజలకు ఆగ్రహం తెప్పిస్తోంది. 2024–25 ఆర్థిక సర్వే ప్రకారం.. పాక్ ప్రభుత్వ ఆదాయంలో సగానికి పైగా వడ్డీ చెల్లింపులకే సరిపోతోందని.. దీనివల్ల ఇప్పట్లో అభివృద్ధికి అవకాశాలు తక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు.