పాకిస్థాన్ కు డెడ్ లైన్: మారకుంటే బ్లాక్ లిస్టులోకేనని వార్నింగ్

పాకిస్థాన్ కు డెడ్ లైన్: మారకుంటే బ్లాక్ లిస్టులోకేనని వార్నింగ్
  • ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకోవాలని FATF నోటీస్
  • ఇమ్రాన్ ఖాన్ కు 2020 ఫిబ్రవరి వరకే గడువు..
  • ఆ తర్వాత గ్రే లిస్టు నుంచి బ్లాక్ లిస్టులోకేనని హెచ్చరిక
  • అది జరిగితే ఏ దేశం నుంచీ చిల్లిగవ్వ సాయం అందదు

కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్నట్టు తయారైంది పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి. ఆర్మీ కనుసైగలకే భయపడే పాక్ ప్రధానికి ఉగ్ర సంస్థలపై చర్యలు తీసుకునే ధైర్యం లేదు.. కఠినంగా వ్యవహరించకుంటే ఏ దేశం నుంచీ ఒక్క రూపాయి కూడా సాయం అందనీయకుండా చేస్తామని అంతర్జాతీయ సంస్థ FATF వార్నింగ్.

ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కటకటలాడుతున్న ఆ దేశానికి మెడపై కత్తి పెట్టింది  ఫైనాన్సియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF).

ఉగ్ర సంస్థలకు ఆర్థిక సాయం అందకుండా కంట్రోల్ చేసే ఈ అంతర్జాతీయ సంస్థ  ఇప్పటికే పాకిస్థాన్ పై ఆంక్షలు విధించింది. ఆ దేశాన్ని జూన్ నుంచి గ్రే లిస్టులో పెట్టింది. ఇతర దేశాల నుంచి వచ్చి ఆర్థిక సాయంపై నిఘా పెట్టి.. కంట్రోల్ చేస్తోంది.

27 సూచనలిస్తే.. పాటించింది ఐదే

ఉగ్ర సంస్థలపై నిషేధం పెట్టాలని, వాటికి ఆర్థిక సాయం అందకుండా చేయాలని సూచిస్తూ పాక్ కు FATF గతంలో 27 పాయింట్లతో యాక్షన్ ప్లాన్ పంపింది. కానీ వాటిలో కేవలం ఐదింటిని మాత్రమే అమలు చేసింది ఇమ్రాన్ ఖాన్ సర్కార్. పైకి ఉగ్ర సంస్థలపై యాక్షన్ తీసుకుంటున్నామని చెబుతూనే.. వాటిపై ప్రేమను చూపిస్తూనే ఉంది. ఇంటర్నల్ గా ముష్కర మూకలను ప్రోత్సాహిస్తోంది. దీంతో తాజాగా జరిగిన FATF సమావేశంలో ఇమ్రాన్ ఖాన్ కు వార్నింగ్ ఇచ్చిందా సంస్థ.

2020 ఫిబ్రవరిలోపు తమ సూచనలు పాటించి, ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇమ్రాన్ ఖాన్ కు డెడ్ లైన్ పెట్టింది. ఈ గడువులోపు మార్పు రాకుంటే పాకిస్థాన్ ని బ్లాక్ లిస్టులో పెట్టేస్తామని FATF అధ్యక్షుడు షియాంగ్మిన్ వార్నింగ్ ఇచ్చారు. ఈ గైడ్ లైన్స్ వేగంగా అమలు చేయకుండే పాకిస్థాన్ కు ఏ దేశం నుంచీ ఒక్క రూపాయి కూడా అందదు. అదే జరిగితే ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఆ దేశం నిండా మునిగినట్టే.