V6 News

మామిళ్ల గూడెంలో తండ్రీకూతురు అనుమానాస్పద మృతి

మామిళ్ల గూడెంలో తండ్రీకూతురు అనుమానాస్పద మృతి
  •     భార్య, మరో కూతురి పరిస్థితి విషమం
  •     ఖమ్మంలోని మామిళ్లగూడెంలో ఘటన 

ఖమ్మం టౌన్, వెలుగు: తండ్రి, ఐదేండ్ల కూతురు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన ఖమ్మంలో జరిగింది. నేలకొండపల్లి మండలం ఆనంతసాగర్ కు చెందిన కణతాల రాము, రమ్యకు 2009లో వివాహం అయ్యింది. ఈ దంపతులకు రమ్య(5), రీతిక(3) అనే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఖమ్మం నగరంలోని మామిళ్లగూడెం బొడ్రాయి సెంటర్ లో రాము(32) కుటుంబ సభ్యులతో కలిసి అద్దె ఇంట్లో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం రాము ఉండే ఇంటి సమీపంలో దుర్వాసన వస్తుండటాన్ని స్థానికులు గమనించారు. 

మృతుడి భార్య రమ్య కూడా ఆదివారం ఉదయం ఇంటి ముంగిట తిరుగుతూ కనిపించింది. దుర్వాసన ఎక్కువగా వస్తుండడంతో స్థానికులు ఇంటి కిటికీ తెరిచి చూడగా రాము, అతడి ఐదేండ్ల కూతురు రమ్య విగతాజీవులుగా రక్తపు మడుగులో పడి ఉన్నారు. స్థానికులు ఇంటి తలుపులు పగులగొట్టి చూడగా, మృతుడి భార్య రమ్య దుప్పటి కప్పుకుని ఆపస్మారక స్థితిలో పడి ఉంది. నోటి వెంట నూరగా రావడం కనిపించింది. చిన్నకుతూరు రీతిక నూదుటిపై బలమైన గాయం ఉంది. 

దీంతో వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. తల్లి, కూతురును ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. వీరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతులు రాము, దివ్య అనుమానాస్పదంగా మృతి చెంది రెండు రోజులు అయ్యి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. రాము మొబైల్ కు వచ్చిన ప్రతి కాల్ ను భార్య లిఫ్ట్​ చేస్తూ అతడి ఆరోగ్యం బాగలేదని, నిద్ర పోతున్నాడని రమ్య చెప్పినట్లు మృతుడి పేరెంట్స్ తెలిపారు. ఖమ్మం టౌన్ ఏసీపీ రమణమూర్తి, టూ టౌన్ సీఐ బాలకృష్ణ, క్లూస్ టీం ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.