నేషనల్​ హైవేపై కారును ఢీకొట్టిన డీసీఎం వ్యాన్ .. తండ్రీ కూతురు మృతి

నేషనల్​ హైవేపై కారును ఢీకొట్టిన డీసీఎం వ్యాన్ .. తండ్రీ కూతురు మృతి
  • నిర్మల్ ​జిల్లాలో నేషనల్​ హైవేపై ఘటన
  • మృతులది ఆదిలాబాద్​ జిల్లా కేంద్రం
  • హైదరాబాద్ ​నుంచి ఇంటికెళ్తుండగా ప్రమాదం
  • నేరడిగొండ వద్ద రోడ్డు ప్రమాదంలో మరొకరు

నిర్మల్/నేరడిగొండ, వెలుగు:  కారును డీసీఎం వ్యాన్​ ఢీ కొట్టగా.. తండ్రీకూతుర్లు మృతిచెందారు. ఈ ప్రమాదం నిర్మల్ జిల్లా నీలాయి పేట గ్రామ పరిధిలో నేషనల్ హైవే బైపాస్ రోడ్డుపై ఆదివారం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రవీంద్రనగర్​కు చెందిన శంకర్(45).. హైదరాబాద్ లో బీటెక్ చదువుతున్న తన కూతురు కృతిక(20) ను కారులో ఇంటికి తీసుకొస్తున్నాడు. కారు నేషనల్​హైవే బైపాస్​రోడ్డుపైకి రాగానే..  అతివేగంగా వస్తున్న డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. దీంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ గాయాలతో బయటపడగా.. శంకర్, కృతిక అక్కడికక్కడే మృతిచెందారు. ఈ మేరకు నిర్మల్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. 

 ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు 

ఆదిలాబాద్​ జిల్లా నేరడిగొండ మండలంలోని రోల్ మామడ టోల్ ప్లాజా వద్ద ఆదివారం ఉదయం  రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మరణించగా, మరొకరికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లాకు చెందిన కత్తూరి వెంకటేశ్ (35),  ఆయన బామ్మర్ది బొమ్మడివార్ అన్వేష్​ కలిసి ​కారులో ఆదిలాబాద్ నుంచి నిర్మల్ వెళ్తున్నారు.  అన్వేష్ కారును నడుపుతున్నాడు. 

నేరడిగొండ మండలంలోని రోల్ మామడ టోల్ ప్లాజా వద్ద పార్కింగ్ స్థలంలో ఆగి ఉన్న లారీని.. స్పీడ్ గా వచ్చిన కారు బలంగా ఢీ కొట్టింది. దీంతో కత్తూరి వెంకటేశ్ తలకు బలమైన గాయాలు కాగా.. టోల్ ప్లాజా సిబ్బంది 108 అంబులెన్స్ లో నిర్మల్ లోని ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. అప్పటికే వెంకటేశ్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అన్వేష్​ కు స్వల్ప గాయాలయ్యాయి. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.