
జగిత్యాల జిల్లాలో విషాదం నెలకొంది. అనారోగ్యంతో తండ్రి మృతి చెందాడనే మనస్తాపంతో కొడుకు ఉరేసుకుని చనిపోయాడు. ఒకే రోజు తండ్రీ కొడుకులిద్దరు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి
అసలేం జరిగిందంటే...జగిత్యాల రూరల్ మండలం సోమన్ పల్లి గ్రామంలో చంద వెంకన్న అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఇంటి వద్దనే చికిత్స తీసుకుంటున్నాడు. ఆరోగ్యం విషమించడంతో ఆగస్టు 8న ఉదయం తన ఇంట్లో వెంకన్న మృతి చెందాడు. తండ్రి అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తుండగా తీవ్ర మనస్థాపానికి గురైన అతని కుమారుడు చంద తిరుపతి (31) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ముందుగా తాత వెంకన్న చితికి నిప్పుపెట్టిన మనమడు(పెద్ద కొడుకు కొడుకు) తిరుపతి అంత్యక్రియలు జరిపారు. తిరుపతికి కొడుకు లేకపోవడంతో బిడ్డ చేతుల మీదుగా చితికి నిప్పు పెట్టించారు.
ఒకే రోజు తండ్రీకొడుకులిద్దరు మృతి చెందడంతో సోమన్ పల్లి గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. గతంలో వెంకన్న పెద్ద కుమారుడు రవి కూడా దుబాయ్ లో ఆత్మహత్య చేసుకున్నాడు. తిరుపతికి రూ. 5 లక్షల వరకు అప్పులున్నాయని.. మరో వైపు తండ్రి మరణంతో కుంగిపోయి ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్నాడని అతడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.