పొలంలో తెగిపడిన కరెంట్​ తీగ.. షాక్​తో తండ్రీ కొడుకు మృతి

పొలంలో తెగిపడిన కరెంట్​ తీగ.. షాక్​తో తండ్రీ కొడుకు మృతి
  • యజమానిని కాపాడే యత్నంలో కన్నుమూసిన కుక్క  
  • సిద్దిపేట జిల్లా జాలిగామలో ఘటన
  • విద్యుత్​శాఖ తీరుపై విమర్శలు
  • పరిహారం, ఉద్యోగం ఇస్తామని ఆఫీసర్ల హామీ

గజ్వేల్, వెలుగు : విద్యుత్​శాఖ అధికారుల నిర్లక్ష్యం తండ్రీ కొడుకుల ప్రాణాలు తీసింది. వైర్ల మెయింటనెన్స్ ​సక్రమంగా లేకపోవడంతో సిద్దిపేట జిల్లా గజ్వేల్​మండలం జాలిగామలో ఆదివారం ​పొలంలో తీగ తెగిపడి, అది తగిలి తండ్రి, కొడుకు కన్నుమూశారు. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కుమ్మరి కనకయ్య (51) తన పొలంలో వరి సాగు చేశాడు. ఆదివారం ఉదయం నీళ్లు చూడడానికి పొలం వద్దకు వెళ్లగా అక్కడ అప్పటికే ఎల్​టీ(ట్రాన్స్​ఫార్మర్​ నుంచి బోర్లకు కరెంట్​సరఫరా చేసే తీగ) కరెంట్​తీగ తెగిపడి ఉంది. దీన్ని గమనించని కనకయ్య తీగకు తగలడంతో షాక్ కొట్టి అక్కడికక్కడే చనిపోయాడు. తండ్రి ఎంతకూ రాకపోవడంతో పెద్ద కొడుకు భాస్కర్​(31), నడిపి కొడుకు కరుణాకర్​ పొలానికి వెళ్లారు. భాస్కర్​ పెంచుకుంటున్న కుక్క కూడా అతని వెంట నడుస్తోంది. అన్నదమ్ములిద్దరూ పొలానికి వెళ్లి చెరోవైపు వెతుకుతున్నారు. తండ్రి చనిపోయిన చోటికి కొద్ది దూరంలో తీగ తెగిపడి ఉండగా గమనించని భాస్కర్​ దానికి తాకడంతో షాక్​ కొట్టి కింద పడిపోయాడు. తీగను తాకడం వల్లే యజమానికి ఆపద వచ్చిందని గుర్తించిన కుక్క అతడిని కాపాడేందుకు తీగను నోట పట్టుకుని పక్కకు లాగేందుకు యత్నించి అది కూడా షాక్​కు గురై కన్నుమూసింది. 

చనిపోతూ అరవడంతో కరుణాకర్ ​అటు వైపు వెళ్లి చూడగా తెగిపడిన తీగ, పక్కన చనిపోయిన తన అన్న భాస్కర్, కుక్క, మరికొద్ది దూరంలో తండ్రి శవం కనిపించాయి. సమీపంలోనే ఉన్న మరో రైతు సహాయంతో ట్రాన్స్​ఫార్మర్ కు కరెంట్​ ​ఆపివేసి విషయాన్ని గ్రామస్తులకు, విద్యుత్​ శాఖాధికారులకు తెలిపాడు. విద్యుత్ ​శాఖ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్​ చేశారు. విషయం తెలుసుకున్న ఆఫీసర్లు అక్కడకు చేరుకుని పరిహారంతో పాటు, మృతుడు భాస్కర్​ భార్య భారతికి  సంస్థలో ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు.  

ములుగు జిల్లాలో మరో రైతు  

మంగపేట : ములుగు జిల్లా మంగపేట మండలం జబ్బోనిగూడెంలో ఆదివారం సాయంత్రం కరెంట్​షాక్​తో రైతు దుర్గం సత్యం ( 47 ) చనిపోయాడు. స్థానికుల కథనం ప్రకారం..మండలంలోని బోరు నర్సాపురానికి చెందిన దుర్గం  సత్యం జబ్బోనిగూడెం గ్రామంలో వ్యవసాయం చేస్తున్నాడు.  పొలంలోని బోరు నడవకపోవడంతో ఆదివారం మోటార్ వైర్లను  చెక్ చేస్తుండగా కరెంట్ షాక్ కొట్టింది.  దీంతో సత్యం అక్కడికక్కడే కన్నుమూశాడు.