చేపల వేటకు వెళ్లిన తండ్రీకొడుకులు మృతి

చేపల వేటకు వెళ్లిన తండ్రీకొడుకులు మృతి

సంగారెడ్డి (హత్నూర), వెలుగు: సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని సాదుల్లానగర్​లో చేపల వేటకు వెళ్లి తండ్రీకొడుకులు మృతి చెందారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం..గ్రామానికి చెందిన చెక్కల ప్రభు(46) వ్యవసాయం చేస్తుంటాడు. ముదిరాజ్​లు కావడంతో వారానికి రెండు మూడు సార్లు చేపలు పట్టడానికి వెళ్తుంటాడు. ఇతడి కొడుకు నాగరాజు(23)తో కలిసి మంగళవారం సాయంత్రం చేపల కోసం గ్రామ శివారులోని తుర్కల ఖానాపూర్ చెరువుకు వెళ్లాడు. తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు చెరువు దగ్గర వెతకగా ఆచూకీ దొరకలేదు. బుధవారం తెల్లవారుజామున చెరువులో మృతదేహాలు తేలగా కొందరు గ్రామస్తులు గుర్తించి పోలీసులు, కుటుంబసభ్యులకు చెప్పారు. మృతుడి భార్య రంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

మంచిర్యాల జిల్లాలో యువకుడు..

బెల్లంపల్లి రూరల్: మంచిర్యాల జిల్లా భీమిని మండలంలో చేపల వేటకు వెళ్లిన ఓ యువకుడు చనిపోయాడు. ఎస్‌‌‌‌ఐ ప్రశాంత్ కథనం ప్రకా రం..కుమ్రం భీం జిల్లా కాగజ్​నగర్ కు చెందిన సల్మాన్ ఖాన్(22) చేపల వ్యాపారం చేస్తుంటాడు. మంగళవారం సాయంత్రం కాగజ్​నగర్ నుంచి భీమిని మండలంలోని కమలాపుర్ ప్రాజెక్టులో చేపలు పట్టేందుకు నాటు పడవలో వెళ్లాడు. ప్రమాదవశాత్తు నాటు పడవ బోల్తా పడడంతో సల్మాన్ ​నీళ్లలో పడిపోయాడు. ఎంతకీ ఒడ్డుకు రాకపోవడంతో అక్కడి వాచ్​మెన్ బలరాం అతడి ​కుటుంబీకులకు సమాచారమిచ్చాడు. దీంతో బుధవారం సల్మాన్​ఖాన్ కుటుంబీకులు భీమిని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గజ ఈతగాళ్లతో ప్రాజెక్టులో గాలించగా డెడ్​బాడీ దొరికింది. మృతుడి అన్న గౌస్ ఖాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.